బిల్లు మొత్తం చెల్లిస్తేనే మృతదేహం ఇస్తాం!

15 Aug, 2020 08:17 IST|Sakshi

రాంగోపాల్‌పేట్‌: కరోనా మహమ్మారి పేరుతో దోపిడీకి పాల్పడుతున్న కార్పొరేట్‌ ఆస్పత్రులకు ప్రభుత్వం, హైకోర్టు హెచ్చరికలు జారీ చేస్తున్నా అవి తమకు వర్తించవన్నట్లు వ్యవహరిస్తున్నాయి. వివరాలివీ... ముషీరాబాద్‌కు చెందిన 49 సంవత్సరాల ఓ వ్యక్తి సెక్యూరిటీ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో గత నెల 20వ తేదీన సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరారు. అతను పనిచేసే సంస్థకు చెందిన ఇన్య్సూరెన్స్‌ నుంచి డబ్బు చెల్లించేందుకు వారు ఒప్పుకున్నారు.

ఇలా 22 రోజులకు గాను రూ. 20 లక్షల బిల్లు వేశారు. చికిత్స పొందుతూ ఈ నెల 12వ తేదీ రాత్రి 9 గంటలకు ఆయన మరణించారు. చికిత్సకు రూ. 20 లక్షలు బిల్లు అయిందని... బీమా సొమ్ము పోను మిగతా రూ. 8 లక్షలు చెల్లించాలని కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో నిరుపేద అయిన ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాలేదు. విషయం చెప్పి మృతదేహం ఇవ్వాలని కోరినా అప్పగించలేదు. విషయం తెలుసుకున్న క్రైస్తవ సంఘాల నాయకులు అక్కడికొచ్చి ఆస్పత్రి వర్గాలను నిలదీశారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో స్పందించిన ఆస్పత్రి యాజమాన్యం... జీహెచ్‌ఎంసీ, పోలీసులు సకాలంలో రాకపోవడంతో మృతదేహం అప్పగింతలో ఆలస్యం జరిగిందని స్పష్టం చేసింది. 

ఆస్పత్రిపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం: మత్తయ్య 
కరోనా పేరుతో ప్రజలను దోపిడీకి గురిచేస్తున్న కార్పొరేట్‌ ఆస్పత్రులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం అయిందని క్రైస్తవ ధర్మప్రచార సమితి అధ్యక్షుడు జెరూసలెం మత్తయ్య ఆరోపించారు. చిన్నచిన్న ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ఇలాంటి పెద్ద పెద్ద ఆస్పత్రులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తమ తప్పు బయటపడకుండా బాధితులను బెదిరింపులకు పాల్పడి తమకు అనుకూలంగా రాయించుకున్నారని ఆరోపించారు.  

మరిన్ని వార్తలు