మానవత్వం మచ్చుకైనా లేదు.. అంత ‘మనీ’తత్వమే

17 May, 2021 03:29 IST|Sakshi

కోవిడ్‌ బారిన పడిన దంపతులకు ఒకే గదిలో చికిత్స\

వేర్వేరు గదుల్లో చికిత్స అందించినట్లు బిల్లు జారీ

ఐదు రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు ఇచ్చి..11 ఇచ్చినట్లు బిల్లు

మాదాపూర్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి నిర్వాకం

కేటీఆర్‌కు ఫిర్యాదు చేసిన బాధితుడు రవికుమార్‌  

సాక్షి, హైదరాబాద్‌: అక్కడ మానవత్వం మచ్చుకైనా లేదు.. అంత ‘మనీ’తత్వమే. కరోనా రోగి కదా అన్న కరుణాలేదు.. చేసిందే చికిత్స.. వేసిందే బిల్లు! కార్పొరేట్‌ ఆస్పత్రుల దోపిడీకి అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. మొన్న నాగోల్లోని ఓ ఆస్పత్రి కరోనా రోగి నుంచి ఏకంగా రూ.23 లక్షల బిల్లు వసూలు చేయగా, నిన్న బీఎన్‌రెడ్డి నగర్‌లోని రెండు ప్రైవేటు ఆస్పత్రులు రోజుకు రూ.లక్ష చొప్పున దండుకున్నాయి. తాజాగా మాదాపూర్‌లోని మరో కార్పొరేట్‌ ఆస్పత్రి చేయని చికిత్సలకు భారీ బిల్లు వేసి ఇద్దరు రోగుల జేబులకు చిల్లులు పెట్టింది. లబోదిబోమంటూ బాధితులు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్‌కు ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన చార్జీలకు అదనంగా పైసా కూడా తీసుకోవద్దని వైద్య, ఆరోగ్య వాఖ హెచ్చరికలు జారీ చేసినా కార్పొరేట్‌ ఆస్పత్రులు వాటిని పెడచెవిన పెడుతూ అందినకాడికి దోచుకుంటున్నాయి. అసలు విషయం ఏంటంటే... 

ఇద్దరికి ఒకే గది.. బిల్లు మాత్రం.. 
ఓయూ కాలనీకి చెందిన రవికుమార్, ఆయన సతీమణి రజనికి ఇటీవల కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. సాచురేషన్‌ ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోతుండటంతో తెలిసిన వైద్యుడి సహాయంతో తొలుత మణికొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. ఆ ఆస్పత్రిలో ఐసీయూ వెంటిలేటర్‌ సౌకర్యం లేకపోవడంతో ఈ నెల 4న మాదాపూర్‌లోని మరో కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరారు. భార్యభర్తలిద్దరూ ఒకే గదిలో ఉండి చికిత్స పొందారు. భర్తకు బెడ్‌ కేటాయించగా, భార్యను మాత్రం బెడ్‌సైడ్‌ సోపాలోనే ఉంచి చికిత్స అందించారు. అయితే వీరిని వేర్వేరు గదుల్లో ఉంచి చికిత్సలు అందించినట్లు యాజమాన్యం బిల్లు వేసింది. ఒక్కొక్కరి నుంచి రోజుకు రూ.8,500 చొప్పున ఐదు రోజులకు మొత్తం రూ.42,500 వసూలు చేసింది. 

మందుల్లోనూ మాయాజాలమే...  
నిజానికి వీరిద్దరూ సదరు ఆస్పత్రిలో చేరక ముం దే వేరే ఆస్పత్రిలో ఒకరు రెండు, మరొకరు మూ డు చొప్పున రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు తీసుకున్నా రు. కానీ, ఆ ఆస్పత్రి యాజమాన్యం మాత్రం తమవద్దే ఒకరు ఆరు, మరొకరు ఐదు ఇంజక్షన్లు తీసుకున్నట్లు వాటికి కూడా కలిపి బిల్లు జారీ చేయడం గమనార్హం. అంతేకాదు రూ.900 విలువ చేసే పీపీఈ కిట్టుకు రూ.మూడు వేల చొప్పున బిల్లు వేసింది. ఇలా మొత్తం రూ.6.50 లక్షల బిల్లు వసూలు చేసింది. కోలుకోవడంతో ఈ నెల 12న డిశ్చార్జై ఇంటికి చేరుకున్న బాధితులు బిల్లును చూసి అవాక్కయ్యారు. అందించిన సేవలకు మిం చి మెడికల్‌ బిల్లు వసూలు చేసినట్లు గుర్తించారు. సదరు కార్పొరేట్‌ ఆస్పత్రి దోపిడిపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్‌కు ట్విట్టర్‌లో ఫిర్యా దు చేశారు. బాధితుల ఫిర్యాదుపై మంత్రి కేటీఆర్‌ స్పందించి విచారణకు ఆదేశించినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు