రెవె‘న్యూ దందా’!..  ధరణిలో స్లాట్‌ బుకింగ్‌ పేరుతో..

18 Aug, 2021 11:18 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బీబీపేట(నిజామాబాద్‌): రెవన్యూ వ్యవస్థలో అక్రమాలను నిలువరించేందుకు ప్రభుత్వం ఎన్ని సంస్కరణలు తీసుకొస్తున్నా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. ప్రభుత్వం ‘ధరణి’ తీసుకొచ్చినా అవకతవకలకు అడ్డుకట్ట పడట్లేదు. రెవెన్యూ సిబ్బంది దోపిడీ ఆగట్లేదు. వాస్తవానికి రెవెన్యూలో లంచాలను నివారించేందుకు ప్రభుత్వం వీఆర్వోల వ్యవస్థనే రద్దు చేసింది. భూ సమస్యల పరిష్కారానికి, సులువుగా రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల కోసం ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయినప్పటకీ రెవెన్యూ సిబ్బంది ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ధరణిలో స్లాట్‌ బుకింగ్‌ దగ్గరి నుంచీ రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల వరకూ అంతా వారి కనుసన్నల్లో జరిగేలా ‘పట్టు’ పెంచుకున్నారు. 

బుకింగ్‌ నుంచి మొదలుకొని.. 
రెవెన్యూలో సంస్కరణలు చేపట్టిన ప్రభుత్వం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల బాధ్యతను తహసీల్దార్లకు అప్పగించింది. దీంతో మండల కార్యాలయాల్లోనే భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల ప్రక్రియ చేపడుతున్నారు. భూ కొనుగోలుదారులు ముందుగా మీసేవ కేంద్రాలకు వెళ్లి ధరణిలో స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. నిర్దేశిత తేదీ, సమయానికి వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి ఇందులో ఇతరుల ప్రమేయం అవసరమే లేదు.

అయితే, కొందరు వీఆర్‌ఏలు మాత్రం అన్నీ తామై కథ నడిపిస్తున్నారు. స్లాట్‌ బుకింగ్, రిజిస్ట్రేషన్లకు సంబంధించి అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి వస్తున్న రైతులను బుట్టలో వేసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మొత్తం తాము పూర్తి చేసిస్తామని, ఇంత మొత్తంలో ఖర్చవుతుందని మాట్లాడుకుంటున్నారు.  

ఒక్క మండలంలోనే 56 మందికి మెమోలు.. 
బీబీపేట మండలంలో ధరణి పోర్టల్‌ ద్వారా స్లాట్లు బుక్‌ చేస్తూ రైతులను మోసం చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో అధికారులు స్పందించారు.  మొత్తం 56 మంది వీఆర్‌ఏలకు ఇన్‌చార్జి తహసీల్దార్‌ శాంత రెండ్రోజుల క్రితం మెమోలు జారీ చేశారు. మరోసారి ఇలాంటి అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చిరించినట్లు తెలిసింది. రైతులు మీసేవ కేంద్రాల్లోనే స్లాట్లు బుకింగ్‌ వద్దనే చేసుకోవాలని, వీఆర్‌ఏలను ఆశ్రయించాల్సిన అవసరం లేదని అధికారులు సూచించారు.

బీబీపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన రైతు ఇటీవల భూమి కొనుగోలు చేశాడు. తహసీల్దార్‌ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్లు చేస్తుండడంతో స్థానిక వీఆర్‌ఏను సంప్రదించాడు. అయితే, ముందుగా ధరణిలో స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాలని, దీంతో పాటు రిజిస్ట్రేషన్‌ చార్జీల కోసం రూ.18 వేలు ఖర్చవుతుందని చెప్పాడు. అతడ్ని గుడ్డిగా నమ్మిన రైతు అడిగినంత ఇచ్చి, రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. వాస్తవానికి రిజిస్ట్రేషన్‌ చార్జీలు, ఇతర ఖర్చులు కలిపి మొత్తం రూ.8 వేలలోపే అవుతుంది. కానీ, వీఆర్‌ఏ చేతివాటం ప్రదర్శించి రైతును రూ.రెండు వేలకు ముంచాడు.

ఇళ్లల్లోనే కంప్యూటర్లు, ప్రింటర్లు.. 
గ్రామాల్లో రైతులతో ఉన్న సత్సంబంధాలను వీఆర్‌ఏలు దోపిడీకి వినియోగించుకుంటున్నారు. స్లాట్‌ బుకింగ్, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ తాము పూర్తి చేయిస్తామని చెప్పి పెద్ద మొత్తంలో దండుకుంటున్నారు. ధరణి పోర్టల్‌లో ఎవరైనా స్లాట్‌ బుకింగ్‌ చేసుకునే అవకాశముంది. దీంతో వీఆర్‌ఏలు తమ ఇళ్లల్లోనే కంప్యూటర్లు, ప్రింటర్లు పెట్టుకుని రైతుల పేరిట స్లాట్‌ బుకింగ్‌ చేస్తున్నారు. ఇందుకోసం నిర్దేశిత ఫీజు కంటే రెట్టింపు వసూలు చేస్తున్నారు.

ఇక, ఆయా రైతులను మండలాఫీసుకు తీసుకెళ్లి రిజిస్ట్రేషన్‌ త్వరగా పూర్తయ్యేలా చూస్తున్నారు. ఒకవేళ మీసేవ కేంద్రాల్లో స్లాట్‌ బుక్‌ చేసుకుని వచ్చిన రైతుల ఫైళ్లు కింద పెట్టి, వీఆర్‌ఏలు బుక్‌ చేసిన ఫైలును మీద పెట్టి తొందరగా రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యేలా చేస్తున్నారు. ఉన్నతాధికారులు పెద్దగా పట్టించుకోక పోవడంతో వీఆర్‌ఏల ఆగడాలకు అడ్డుకట్ట పడట్లేదు.  

మరిన్ని వార్తలు