ప్రభుత్వాసుపత్రిలో లంచావతారులు.. తోటి ఉద్యోగుల వద్దే

21 Jul, 2021 07:34 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కరీంనగర్‌టౌన్‌: దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదన్నట్లు తయారైంది ప్రభుత్వాసుపత్రిలో ఉద్యోగుల పరిస్థితి. లంచాల కోసం ప్రజలనే కాదు.. సహోద్యోగులను కూడా పీడించే దుస్థితి దాపురించింది. ప్రభుత్వ కార్యాలయాలకు పనుల కోసం వెళ్లే సామాన్య ప్రజల వద్ద కొంత మంది ఉద్యోగులు లంచం తీసుకొని పనిచేయడం సర్వసాధారణం. కానీ ప్రభుత్వ ఉద్యోగుల వద్దే తోటి ఉద్యోగులు పనులు చేసేందుకు లంచాలు తీసుకోవడం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చర్చనీయాంశంగా మారింది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగానే మిగిలిపోతున్నాయి. తోటి ఉద్యోగులు డబ్బుల కోసం పీడిస్తూ.. ఇవ్వకుంటే మీ పనులు పెండింగ్‌లో ఉంటాయంటూ బెదిరింపులకు గురిచేస్తూ జబర్దస్త్‌గా వసూలు చేస్తున్నారని బాధిత ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 

సర్వీసు బుక్‌ రాస్తే రూ.1,500..
ఇటీవల కొత్తగా 40 మంది స్టాఫ్‌ నర్సులు ఆసుపత్రిలో విధుల్లో చేరారు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి రిటైర్డ్‌ అయ్యే వరకు సర్వీసు బుక్‌ ఎంతో కీలకం. కొత్తగా చేరిన ఉద్యోగుల సర్వీస్‌బుక్‌ రాసేందుకు సంబంధిత ఉద్యోగులు లంచం డిమాండ్‌ చేసినట్లు తెలిసింది. సర్వీస్‌ బుక్‌ తామే తీసుకువచ్చి రాసేందుకు ఒక్కో ఉద్యోగి వద్ద రూ.5 వేల వరకు డిమాండ్‌ చేయగా, చివరకు రూ.1,500లకు బేరం కుదిరినట్లు సమాచారం. అది కూడా సర్వీస్‌ బుక్‌ ఉద్యోగులే కొనుగోలు చేసి తీసుకువస్తే రూ.1,500 తీసుకొని రాసిస్తామని చెప్పినట్లు తెలిసింది. ఇప్పటికే కొంత మంది సర్వీసు బుక్‌తో పాటు ఒప్పుకున్న ప్రకారం డబ్బులు కవర్‌లో పెట్టి ఇచ్చినట్లు విశ్వాసనీయ సమాచారం.

పే ఫిక్సేషన్‌కు రూ.500..
మూడేళ్లుగా కళ్లు కాయలు కాసేలా చూసిన వేతన సవరణ (పీఆర్‌సీ)ను ప్రభుత్వం ఇటీవల అమలు చేసింది. దీంతో ఉద్యోగులకు వేతనాలు పెరిగాయి. పెరిగిన వేతనాలను సంబంధిత ఉద్యోగుల హెడ్‌ ఆఫ్‌ది డిపార్ట్‌మెంట్‌ నుంచి సవరణ చేసి డీటీవోకు పంపించాల్సి ఉంటుంది. ఇదంతా ఎలాంటి ఖర్చు లేకుండా చేయాల్సిన పని. కానీ ప్రభుత్వాసుపత్రిలో సర్వీస్‌ బుక్‌లో పే ఫిక్సేషన్‌ చేసేందుకు సంబంధిత ఒక్కో ఉద్యోగి నుంచి రూ.500 వసూలు చేయడం చర్చనీయాంశంగా మారింది. పే ఫిక్సేషన్‌ చేయాల్సిన ఉద్యోగుల పనితీరు అంతా హడావిడి అన్నట్లు తయారైంది.

కొంత మందికి జీతాల బిల్లులు చేయరాదు. టెక్నాలజీ, ఇంటర్నెట్, సాఫ్ట్‌వేర్‌ అందుబాటులోకి వచ్చాక వివరాలు నింపితే బిల్లు దానంతట అదే చకచకా తయారైపోతుంది. అయితే ఆసుపత్రిలో కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇంటర్నెట్‌ ఉన్నా చాలా మందికి మౌస్‌ పట్టడం కూడా రాదు. దీంతో బయటివారితో చేయించేందుకు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వసూళ్ల దందాపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
ఆసుపత్రిలో డబ్బు వసూలు చేసే విషయం నా దృష్టికి రాలేదు. విధుల్లో భాగంగా జరిగే పనుల కోసం ఎవరూ డబ్బులు ఇవ్వొద్దు. ఎవరైనా వసూళ్లకు పాల్పడితే వారిపై ఫిర్యాదు చేయాలి. శాఖాపరమైన చర్యలు చేపడతాం. డబ్బు వసూలు చేస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదు.        

– డాక్టర్‌ రత్నమాల, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌  

మరిన్ని వార్తలు