TSRTC: చుక్కలు చూపిస్తున్న చమురు

6 Sep, 2021 04:36 IST|Sakshi

ఆర్టీసీకి పెనుభారంగా మారిన డీజిల్‌ వ్యయం 

రెండేళ్ల వ్యవధిలో లీటర్‌ ధర రూ.24 పెరిగిన వైనం 

మొత్తం ఖర్చులో 30 శాతాన్ని మించిన ఆయిల్‌ పద్దు 

తాజా లెక్కల ప్రకారం ఒక కిలోమీటరుకు రూ.60 వ్యయం 

ఇందులో డీజిల్‌ వాటా రూ.21 

2019తో పోలిస్తే రోజుకు అదనంగా రూ.1.30 కోట్ల భారం 

సాక్షి, హైదరాబాద్‌: ఎప్పటికప్పుడు పెరుగుతున్న చమురు భారం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను తీవ్రంగా కలవరపెడుతోంది. చూస్తుండగానే మొత్తం వ్యయంలో డీజిల్‌ వాటా ఏకంగా 30 శాతాన్ని మించింది. రెండేళ్ల స్వల్ప విరామంలోనే లీటరు డీజిల్‌పై రూ.24 మేర ధర పెరగటంతో ప్రస్తుతం ఆర్టీసీ పరిస్థితి గందరగోళంగా మారింది. సంస్థ తాజా లెక్కల ప్రకారం.. ఒక కిలోమీటరుకు వ్యయం (కాస్ట్‌ పర్‌ కిలోమీటర్‌) రూ.60గా ఉండగా, అందులో డీజిల్‌ వాటా రూ.21కి చేరింది. ఉద్యోగుల జీతాల ఖర్చు 53 శాతం ఉండగా, ఇప్పుడు డీజిల్‌ భారం 30 శాతాన్ని మించటంతో ఈ రెంటినీ ఎలా తగ్గించుకోవాలనే విషయంపై ఆర్టీసీ మేధోమధనం ప్రారంభించింది. సంస్థ కొత్త ఎండీగా బాధ్యతలు స్వీకరించిన వీసీ సజ్జనార్, వీలైనంత త్వరగా డీజిల్‌ ఖర్చు తగ్గింపుపై సరికొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.  

రోజుకు 5.4 లక్షల లీటర్ల వాడకం 
రెండేళ్ల క్రితం ఆర్టీసీలో సమ్మె జరిగిన సమయంలో డీజిల్‌ ధర లీటరుకు రూ.73గా ఉంది. ఆ సమ్మె సమయంలో కార్మిక సంఘాల ప్రధాన డిమాండ్లలో ఆర్టీసీపై డీజిల్‌ భారాన్ని తగ్గించడం కూడా ఒకటి. చమురుపై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్‌ను ఎత్తేయటం ద్వారా ఆర్టీసీని రక్షించాలని కార్మికులు డిమాండ్‌ చేశారు. సరిగ్గా రెండేళ్ల తర్వాత ఇప్పుడు లీటర్‌ ధర రూ.97కు చేరింది. ఆర్టీసీకి చమురు కంపెనీలు కొంత తగ్గింపు ధరలకే డీజిల్‌ను సరఫరా చేస్తున్నా.. లీటర్‌పై మొత్తం మీద రూ.24 పెరిగిపోవటంతో రోజువారీ వినియోగంలో అదనపు భారం దాదాపు రూ.1.30 కోట్లకు చేరింది. 

పేరుకుపోతున్న బిల్లులు 
ఆర్టీసీ నిత్యం 5.4 లక్షల లీటర్ల ఆయిల్‌ను వాడు తుంది. కోవిడ్‌ వల్ల ఏడాదిన్నరగా పూర్తిస్థాయి లో బస్సులు తిరగకపోవటంతో ఈ ఖర్చు కొం త ఆదా అయింది. ఇప్పుడు కోవిడ్‌ దాదాపు తగ్గిపోవటంతో పూర్తిస్థాయిలో బస్సులను నడుపుతున్నారు. దీంతో డీజిల్‌ వినియోగం మళ్లీ గరిష్ట స్థాయికి చేరింది. దీంతో ఖర్చును భరించలేక ఆర్టీసీ కిందామీదా పడుతోంది. గతంలో ఇలాగే బిల్లులు పేరుకుపోతే సరఫరా నిలిపేస్తామని ఆయిల్‌ కంపెనీలు హెచ్చరించటంతో కొంతచెల్లించి సమస్య లేకుండా చూసింది. ఇప్పుడు ప్రతినెలా బిల్లులు పేరుకుపోతుండటంతో  కంపెనీల నుంచి ఒత్తిడి పెరుగుతోంది.  

మళ్లీ ప్రత్యామ్నాయాలపై దృష్టి.. 
చమురు ధరల భారాన్ని తట్టుకోలేక కొంతకాలం క్రితం ఆర్టీసీ కొన్ని ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారించింది. అందులో ముఖ్యమైంది ఎలక్ట్రిక్‌ కన్వర్షన్‌. ఎలక్ట్రిక్‌ బస్సులు నడిపితే చమురు వినియోగం ఉండనందున అటువైపు మొగ్గు చూపింది. అయితే ఆ బస్సుల ఖరీదు ఎక్కువ కావటంతో కొత్త బస్సులు కొనే పరిస్థితి లేదు. ఇందుకోసం ఉన్న బస్సులను ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చాలని యోచించింది. ఈ మేరకు కొన్ని కంపెనీలతో చర్చించింది. కానీ ఖర్చు కూడా ఎక్కువగా ఉంది. దీంతో కన్వర్ట్‌ చేసిన కంపెనీలే కొన్నేళ్లు వాటిని నిర్వహించి డీజిల్‌ ఆదా రూపంలో మిగిలిన మొత్తంలో లాభం తీసుకోవటం లాంటి ఒప్పందాలు చేసుకోవాలని భావించింది. కానీ నాటి ఎండీ దీనిపై ఎటూ తేల్చకుండా పెండింగులో పెట్టారు.  

మరిన్ని వార్తలు