యాసంగిలో తొలిసారి పత్తి సాగు

29 May, 2022 00:58 IST|Sakshi
చెన్నూర్‌ మండలం శివలింగాపూర్‌లో యాసంగి పత్తి పంటను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు  

విజయం సాధించిన రైతులు 

రాష్ట్రంలోనే మొదటిసారి మంచిర్యాల జిల్లాలో 37 ఎకరాల్లో పంట

చెన్నూర్‌: వర్షాధారంగా సాగయ్యే పత్తి పంటను మంచిర్యాల జిల్లా రైతులు రాష్ట్రంలోనే తొలిసారిగా యాసంగిలో సాగు చేసి విజయం సాధించారు. ఈ ఏడాది పత్తికి డిమాండ్‌ ఉండడంతో మంచి లాభాలు ఆర్జించారు. చెన్నూర్‌ మండలం శివలింగాపూర్, అక్కెపల్లి గ్రామాల్లో ఎనిమిది మంది రైతులు 17 ఎకరాలు, లక్సెట్టిపేట మండలం ఇటిక్యాల, దండేపల్లి, జైపూర్‌ మండలం కోటపల్లిలో కొందరు రైతులు ఐదెకరాల చొప్పున మొత్తంగా 37 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు.

ఇందులో ఇటిక్యాల గ్రామంలో కొడె తిరుమల్‌రావుకు ఐదెకరాల్లో.. ఎకరాకు 10 క్వింటాళ్ల నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటాల్‌కు రూ.10 వేలకు పైగా ధర పలకడంతో ఎకరానికి రూ.లక్షకు పైగా రాబడి వచ్చింది. శివలింగాపూర్, అక్కెపల్లి గ్రామాల్లో కొంతమందికి ఎకరానికి ఏడెనిమిది క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశాలున్నాయి.

శివలింగాపూర్, అక్కెపల్లి గ్రామాల్లో పత్తి పంటను ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన విభాగం సంచాలకురాలు ఉమాదేవి తన బృందంతో పరిశీలించారు. రానున్న రోజుల్లో యాసంగిలో పత్తి సాగు చేస్తే బాగుంటుందని ఈ బృందం అభిప్రాయపడింది. ఈ పరిశోధన బృందం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తే యాసంగిలో పత్తి సాగు చేయాలని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.  

ప్రయత్నం ఫలించింది.. 
యాసంగిలో వరికి బదులుగా 3.08 ఎకరాల్లో పత్తి సాగు చేశా. తొలి ప్రయత్నం ఫలించి పత్తి ఏపుగా పెరగడమే కాకుండా కాయ నాణ్యత బాగుంది. ఎకరానికి 7 నుంచి 8 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుంది. యాసంగి పత్తి పంట లాభమే. 
– బత్తుల సమ్మయ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ 

ఎకరానికి రూ.లక్ష  
ఆంధ్రప్రదేశ్‌లో యాసంగిలో పత్తి సాగు చేస్తారు. తెలంగాణలో ప్రయత్నం చేద్దామని ఐదు ఎకరాల్లో పత్తి పంట వేశా. ఎకరానికి రూ.30 వేలు ఖర్చయింది. వర్షాధార పత్తి కంటే దిగుబడి బాగుంది. ఖర్చు కూడా తక్కువే. ఎకరానికి రూ.లక్ష ఆదాయం వచ్చింది. వచ్చే ఏడాది పది ఎకరాల్లో పత్తి వేస్తా. 
–తిరుమల్‌రావు, రైతు, ఇటిక్యాల 

డిసెంబర్‌లో సాగు చేస్తే మేలు.. 
చెన్నూర్‌ మండలంలో 17 ఎకరాల్లో పత్తి సాగైంది. పంట బాగుంది. ఎకరానికి 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడి రైతులు జనవరిలో విత్తనాలు వేశారు. యాసింగిలో పత్తి సాగు చేయాలని ఆసక్తి ఉన్న రైతులు డిసెంబర్‌లో విత్తనాలు వేస్తే దిగుబడి మరింత పెరుగుతుంది.  
–మహేందర్, ఏవో, చెన్నూర్‌ 

మరిన్ని వార్తలు