రికార్డులు సృష్టిస్తున్న తెల్లబంగారం: గజ్వేల్‌లో రూ.8,261 జమ్మికుంటలో రూ.8,150

27 Oct, 2021 03:14 IST|Sakshi

పత్తి క్వింటాలుకు రికార్డు ధర.. 

వరంగల్‌ సహా పలు ప్రాంతాల్లో ‘మద్దతు’కు మించి ధర 

జమ్మికుంట/ఆదిలాబాద్‌ టౌన్‌/ ఖమ్మం వ్యవసాయం/సిద్దిపేట: తెల్ల బంగారం ధరలో రికార్డులు సృష్టిస్తోంది. ప్రభుత్వ మద్దతు ధర క్వింటా రూ.6,025 ఉండగా, బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.2 వేలకుపైబడి ధర పలుకుతోంది. మంగళవారం గజ్వేల్‌ మార్కెట్లో క్వింటాల్‌ పత్తికి రూ.8,261 ధర లభించింది. ఇంకా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో రూ.8,150, ఆదిలాబాద్‌ మార్కెట్లో రూ.8,020, వరంగల్‌ ఏనుమాముల మార్కెట్‌లో రూ.7,960, జనగామ మార్కెట్లో రూ.7,900, ఖమ్మంలో రూ.7,800 ధరకు వ్యాపారులు కొను గోలుచేశారు. 

దేశవ్యాప్తంగా పత్తి దిగుబడి తగ్గినందుకే ధరలు పెరుగుతున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. విదేశాల్లో పత్తి ఉత్పత్తులకు డిమాండ్‌ పెరిగిందని, రానున్న రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. కాగా, మంగళవారం పై ప్రధాన మార్కెట్లకు పెద్దసంఖ్యలో వాహనాల్లో పత్తి వచ్చింది. అన్నిచోట్లా మోడల్‌ ధర క్వింటాకు రూ.8 వేలకుపైగా, కనిష్టంగా రూ.7,900 చొప్పున వ్యాపారులు రైతులకు చెల్లించారు.  
(చదవండి: Anthrax At Warangal: ఆంత్రాక్స్‌ వ్యాధి కలకలం: మటన్‌ కొంటున్నారా..? జర జాగ్రత్త!)

మరిన్ని వార్తలు