రంగు మారిన 'దూది'బతుకు

2 Jan, 2021 05:24 IST|Sakshi
నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం గడియగౌరారం సీసీఐ కొనుగోలు కేంద్రం వద్ద నిలిచిన రైతుల పత్తి ట్రాక్టర్లు

సగానికి పైగా తగ్గిన పత్తి దిగుబడులు 

ముందు అనుకూలించి పూత దశలో వానదెబ్బ 

చీడపీడలతో మరింత నష్టం 

రంగుమారిన పత్తిని కొనుగోలు చేయని సీసీఐ 

దిగుబడి తగ్గి అప్పులపాలైన పత్తి రైతు 

సాక్షి నెట్‌వర్క్‌: దూదిరైతుకు దుఃఖమే మిగిలింది. అదనుకు పడిన వర్షాలకు కళకళలాడిన పత్తిచేలు.. అదే వరుణుడి ఆగ్రహంతో ఛిద్రమయ్యాయి. ఎంతో దిగుబడి వస్తుందని ఆశపడ్డ రైతుకు నిరాశే మిగిలింది. అకాల వర్షాలకు సగానికిపైగా దిగుబడి తగ్గిపోయింది. సీసీఐ అధికారులు తేమశాతం, ఎర్రబారిందని కొర్రీలు పెట్టి కొనుగోలు చేయకపోవడంతో దళారులను ఆశ్రయించి వచ్చినకాడికి అమ్ముకున్నారు. పత్తి వేస్తే పెద్దగా లాభాలు రాకపోయినా.. ఖర్చులు పోగా చేసిన కష్టమైనా మిగిలేది. కానీ ఏడాది అంతా తారుమారైంది. పెట్టిన పెట్టుబడులు రాక..అప్పులు నెత్తిన పడ్డాయి. రాష్ట్రంలో పత్తి అధికంగా సాగు చేసిన జిల్లాల్లో నల్లగొండ జిల్లా మొదటి, ఉమ్మడి ఆదిలాబాద్‌ రెండు స్థానాల్లో ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 2,39,865 ఎకరాలకు గాను 7,29,405 ఎకరాలు, సిద్దిపేట జిల్లాలో 2.40 లక్షల ఎకరాలు, ఉమ్మడి ఆదిలాబాద్‌లో 11.35 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. సకాలంలో వర్షాలు పడటంతో చేలు ఏపుగా పెరిగాయి. గూడ బాగా వేసింది. దీంతో తమ పంట పండిందని రైతులు ఆనంద పడ్డారు. వ్యవసాయ అధికారులు కూడా దిగుబడి భారీగా వస్తుందని అంచనా వేశారు. 

సగానికి తగ్గిన దిగుబడి 
ఆగస్టు, సెపె్టంబర్, అక్టోబర్‌ మాసాలలో వచ్చిన  తుపాన్లు పత్తి రైతుల ఆశలను అడియాసలు చేశాయి. పూత, పిందె, కాయ దశలలో ఉన్న సమయంలో వర్షాలు కురవడంతో చేలపై ఉన్న పూత, పిందె రాలిపోవడంతో పాటు కాయలు పగిలి రంగుమారిన పత్తి చేతికి వచ్చింది. తెగుళ్లు ఆశించి, చేలు ఎర్రబారి సగానికి సగం కాయలు, పిందెలు రాలిపోయాయి. దీంతో ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశించిన రైతులకు కేవలం 2 నుంచి 4 క్వింటాళ్ల పత్తి మాత్రమే దిగుబడి వచ్చింది. నల్లగొండ జిల్లాలో సుమారు 58 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అధికారులు అంచనాలు వేశారు. కానీ తుపానుల కారణంగా 35 లక్షల క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. సిద్దిపేట జిల్లాలో 2.4 లక్షల మెట్రిక్‌ టన్నులు అంచనా వేయగా.. లక్ష టన్నులు కూడా రాలేదు.. అలాగే, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 96 లక్షల క్వింటాళ్ల మేర వస్తుందని అంచనా వేయగా, 36 లక్షల క్వింటాళ్ల మేర వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా అక్కడక్కడా చేనుపై కొంత పత్తి ఉంది. మూడు జిల్లాల్లో అంతా కలిపి పది లక్షల క్వింటాళ్ల మేర ఉంటుందని అంచనా. 

అమ్ముకునేందుకు నానా పాట్లు 
అంతోఇంతో చేతికొచ్చిన పత్తిని అమ్ముకుందామని వెళ్లిన రైతులకు చుక్కలు కనిపించాయి. పత్తి నల్లగా ఉందని, తేమశాతం ఎక్కువగా ఉందని సగం పత్తిని కూడా కొనుగోలు చేయలేదని రైతులు వాపోతున్నారు. ‘సీసీఐ పత్తి క్వింటాకు రూ. 5,880లకు కొనుగోలు చేయాల్సి ఉంది.. కానీ, పట్టించుకోకపోవడంతో ప్రైవేట్‌ వ్యాపారులకు రూ.4 వేల నుంచి రూ.4,500లకు అమ్ముకున్నాం’అని సిద్దిపేట జిల్లా చేర్యాలకు చెందిన రైతు రాములు ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాలో సీసీఐ కేంద్రాలు ఆలస్యంగా కొనుగోళ్లు ప్రారంభించాయి. రంగు మారిన పత్తిని కొనుగోలు చేయడానికి సీసీఐ అధికారులు నిరాకరించడంతో క్వింటాకు రూ.2,700ల నుంచి రూ.3,500 వరకు దళారులకు విక్రయించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో సగానికి మేర ప్రైవేట్‌కు అమ్ముకున్నారు.  

పెట్టుబడి కూడా రావడం లేదు 
ఈ రైతు పేరు నెల్లికంటి ముత్తయ్య. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొంపల్లి గ్రామం. తనకు ఉన్న 8 ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. ఎకరానికి రూ.18 వేల చొప్పున రూ.1.44 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టాడు. మొదట పూత బాగా రాగా ఈసారి పంట పండిందని ఆనందపడ్డాడు. కానీ వరుస వర్షాలతో అన్నీ తలకిందులయ్యాయి. ఎకరానికి 3 నుంచి 4 క్వింటాళ్ల చొప్పున 27 క్వింటాళ్ల లోపు వచ్చింది. అది కూడా నాణ్యత లేని దిగుబడి రావడంతో సీసీఐ కేంద్రంలో కొంత పత్తిని అమ్మాడు. మిగతా పత్తిని తీసుకోలేదు. ఈ ఏడాది నాకు రూ.50 వేలకుపైగా నష్టం వచ్చింది. తెచ్చిన అప్పులు మీద పడ్డాయి. 

అప్పే మిగిలింది 
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన నర్సింహులు మూడెకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. ఎకరాకు పది క్వింటాళ్లు పండే పత్తి ఈసారి 8 క్వింటాళ్లే పండింది. సీసీఐ కేంద్రానికి పత్తి అమ్మేందుకు వెళ్లగా, పత్తి నల్లబారిందని, తేమశాతం ఎక్కువగా ఉందని వెనక్కి పంపారు. తప్పని పరిస్థితిలో ప్రైవేట్‌ వ్యాపారికి రూ.40,800కు అమ్ముకున్నాడు. మొత్తం ఖర్చు 1,22,000 వచ్చింది. ఏడాది కాలంగా ఇంటిల్లిపాది కష్టపడితే.., రూ.81,200 అప్పు మిగిలింది.   

మరిన్ని వార్తలు