Global Warming: ఇలాగయితే ముంబై, కాకినాడ కనుమరుగే!

27 Oct, 2021 17:37 IST|Sakshi

కడ్తాల్‌: గ్లోబల్‌ వార్మింగ్‌ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ముంబై, కాకినాడ వంటి తీర ప్రాంతాలు భవిష్యత్తులో కనిపించవని పూర్తిగా నీట మునిగిపోతాయని ప్రముఖ ఎన్విరాన్‌మెంటలిస్ట్‌, ప్రొఫెసర్‌ పురుషోత్తం రెడ్డి అన్నారు. కౌన్సిల్‌ ఫర్‌ గ్రీన్‌ రివల్యూషన్‌ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లోని ఆన్మాస్‌పల్లిలో ఉన్న ఎర్త్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని గ్లాస్కో నగరంలో 2021 అక్టోబరు 31 నుంచి నవంబరు 12 పర్యావరణ మార్పులపై జరగనున్న కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ (సీఓపీ)-26వ అంతర్జాతీయ సమావేశం నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు.  

ప్యారిస్‌ హామీ ఏమైంది ?
2005లో జరిగిన ప్యారిస్‌ సమావేశంలో క్లైమెట్‌ ఛేంజ్‌పై విస్త్రృతంగా చర్చించారని ప్రొఫెసర్‌ పురుషోత్తంరెడ్డి గుర్తు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న 194 దేశాలు కాలుష్యాన్ని తగ్గించేందుకు అంగీకరించాయన్నారు.  అందులో భాగంగా 2005లో  వెలువడుతున్న కర్బణ ఉద్ఘారాల్లో 33 శాతం నుంచి 35 శాతం వరకు తగ్గిస్తామని భారత ప్రధాని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. కానీ వాస్తవంలో ప్రభుత్వంలో ఈ పని చేయడం లేదన్నారు. అంతర్జాతీయ వేదికల మీద ఇచ్చిన హామీలకు దేశీయంగా అవి అమలవుతున్న తీరుకు పొంతన లేదన్నారు.

దుష్పరిణామాలు
ప్యారిస్‌ సమావేశంలో 2 సెల్సియస్‌ డిగ్రీలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వాలు అది అమలు చేయడంలో విఫలమయ్యాయని ఫలితంగా ఇప్పటికే భూవాతావరణం 1.12 సెల్సియస్‌ డిగ్రీలు వేడెక్కిందన్నారు. ఇటీవల కాలంలో కెనడా, ఆస్ట్రేలియా, సైబీరియాలో కార్చిర్చులు చెలరేగి లక్షలాది హెక్టార్ల అటవీ నాశనమైందని, ఊర్లకు ఊర్లే తగలబడి పోయాయన్నారు. అంతేకాదు మన దేశంలో అనేక ప్రాంతాల్లో వరదలు పోటెత్తిన విషయాన్ని ప్రొఫెసర్‌ పురుషోత్తమరెడ్డి గుర్తు చేశారు. ఈ దుష్‌పరిణామాలకు గ్లోబల్‌ వార్మింగే కారణమన్నారు.


ఒత్తిడి తేవాలి
క్లైమెట్‌ ఛేంజ్‌ విషయంలో మన నిర్లక్ష్య వైఖరి ఇలాగే కొనసాగితే రాబోయే ఇరవై ఏళ్లలో 2 సెల్సియస్‌ డిగ్రీల వరకు భూవాతావరణం వేడేక్కే అవకాశం ఉందన్నారు. అదే జరిగితే తీవ్ర ఉత్పతాలు సంభవిస్తాయని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాలైన కాకినాడ, ముంబై, బంగ్లాదేశ్‌, మాల్దీవ్స్‌ వంటివి ఉండబోవన్నారు. ఈ విపత్తు రాకుండా నివారించాలంటే భూతాపాన్ని 1.5 సెల్సియస్‌ డిగ్రీలకు మించకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రపంచ దేశాల మీద పౌర సమాజం ఒత్తిడి తేవాలని సూచించారు.

36 లక్షల మొక్కలు
వాతావరణ సమతుల్యత లక్ష్యంగా కౌన్సిల్‌ ఫర్‌ గ్రీన్‌ రివల్యూషన్‌ (సీజీఆర్‌) పని చేస్తుందని ఆ సంస్థ అధ్యక్షురాలు లీలా లక్ష్మారెడ్డి అన్నారు. గడిచిన పదకొండేళ్ల కాలంలో తెలుగు రాష్ట్రాల పరిధిలో 36 లక్షల మొక్కలను నాటినట్టు తెలిపారు. తూర్పు కనుమల పరిరక్షణకు సీజీఆర్‌ తరఫున నిర్విరామంగా కృషి చేస్తున్నట్టు తెలిపారు. భావితరాలకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ మంచి వాతావరణ ఇవ్వాల్సిన అవవసరం ఉందని సీజీఆర్‌ ఫౌండర్‌ లక్ష్మారెడ్డి అన్నారు.

ఎర్త్‌ సెంటర్‌
ప్రాంతీయంగా జరుగుతున్న వాతావరణ మార్పులను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లేందుకు కడ్తాల్‌ సమీపంలో ఎర్త్‌ సెంటర్‌ని ఏర్పాటు చేశామని బయెడైవర్సిటీ నిపుణులు తులసీరావు తెలిపారు. ప్రజల్లో రాజకీయ చైతన్యంతో పాటు పర్యావరణ చైతన్యం కూడా పెరగాల్సి ఉందన్నారు. గ్లాస్కో సమావేశ వివరాలను ఎప్పటిప్పడు అందించేందుకు ఎర్త్‌సెంటర్‌లో ప్రత్యేక న్యూస్‌రూమ్‌ ఏర్పాటు చేసినట్టు ఎర్త్‌ సెంటర్‌ డైరెక్టర్‌ సాయి భాస్కర్‌రెడ్డి తెలిపారు.

సీజీఆర్‌ ఒక్కటే
పర్యావరణం, వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ దేశం మొత్తం మీద స్థిరంగా పని చేస్తున్న సంస్థ కౌన్సిల్‌ ఫర్‌ గ్రీన్‌ రివల్యూషన్‌ ఒక్కటే ఉందని ఆర్టీఐ మాజీ కమిషనర్‌ దిలీప్‌రెడ్డి అన్నారు. వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న విపత్కర పరిస్థితుల ప్రభావం ప్రజలపై ఇప్పటికే పడిందన్నారు. గ్లోబల్‌ వార్మింగ్‌పై ప్రజలు తమంతట తాముగా గొంతెత్తే సమయం వచ్చిందన్నారు. ఈ సందర్భంగా గ్లాస్కోలో జరుగుతున్న సీఓపీ 26 సమావేశ వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు సీజీఆర్‌ తరఫున అందిస్తామన్నారు. 

మరిన్ని వార్తలు