అవగాహన లేక ‘కు.ని’కి పాట్లు! 

12 Sep, 2022 02:23 IST|Sakshi

రాష్ట్రంలో అర్హులైనవారిలో 49.2 శాతం మందికే అవగాహన 

కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ తాజా నివేదిక వెల్లడి 

కు.ని.ఆపరేషన్ల కోసం వచ్చే పురుషులు రెండు శాతమే 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అవగాహన లేక చాలామంది కుటుంబ నియంత్రణ(కు.ని.) ఆపరేషన్ల కోసం ముందుకు రావడంలేదు. దానివల్ల కలిగే దుష్ప్రభావాలపై బాధితులకు పూర్తిస్థాయిలో అవగాహన కలిగించడంలో వైద్యసిబ్బంది అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా కు.ని. ఆపరేషన్ల ప్రక్రియ గణనీయంగా సాగడంలేదు. ఈ మేరకు కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ తాజాగా నివేదిక విడుదల చేసింది.

కు.ని. ఆపరేషన్లకు అర్హులైనవారిలో 49.2 శాతం మందికే వైద్యసిబ్బంది అవగాహన కల్పిస్తున్నారని తెలిపింది. గతంలో అది 25 శాతం ఉండేది. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 62.8 శాతం మందికి, అత్యంత తక్కువగా జగిత్యాలలో 24 శాతం మందికి అవగాహన కల్పిస్తున్నారు. కు.ని. ఆపరేషన్ల వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయని నిపుణులు అంటున్నారు. కాగా, కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌పై రాష్ట్రంలో ఆరోగ్య కార్యకర్తలు కేవలం 17 శాతమే అవగాహన కల్పిస్తున్నారు. 31.4 శాతంతో మహబూబాబాద్‌ జిల్లాలో అత్యధికంగా అవగాహన కల్పిస్తుండగా, వికారాబాద్, నిజామాబాద్‌ జిల్లాలో అత్యల్పంగా 8.6 శాతం ఉందని వివరించింది.  

నివేదికలోని అంశాలు... 
రాష్ట్రంలో 68.1 శాతం మంది కుటుంబ నియంత్రణకు సంబంధించి ఏదో ఒక పద్ధతిని అవలంబిస్తున్నారు. గతంతో పోలిస్తే 11 శాతం పెరిగింది. అత్యధికంగా 78.7% మంది ఖమ్మం జిల్లాలో, అత్యంత తక్కువగా 49.4% కొమురంభీం జిల్లాలో అనుసరిస్తున్నా రు. ఉత్తర తెలంగాణలో తక్కువగా ఉంది.  

అధునాతన పద్ధతుల్లో కుటుంబ నియంత్రణ జరుగుతోంది. 15–49 ఏళ్లలోపు పెళ్లయిన మహిళలు తెలంగాణలో 66.7% అధునాతన పద్ధతులు అవలంభిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో అత్యంత ఎక్కువగా 77.9%, అత్యంత తక్కువగా కొమురంభీం జిల్లాలో 49.1% అవలంభిస్తున్నారు.  

ట్యుబెక్టమీ పద్ధతిలో మహిళలు 61.9% మంది కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. అంతకుముందుతో పోలిస్తే 7 శాతం పెరిగింది. సూర్యాపేటలో 75.9%, కరీంనగర్‌ జిల్లాలో 44.4% ఉన్నారు.  

పురుషుల్లో కుటుంబ నియంత్రణ వెసెక్టమీ అనేది తెలంగాణ సగటు కేవలం రెండు శాతమే. గతం కంటే 0.5% పెరిగింది. జయశంకర్‌ జిల్లాలో అత్యధికంగా అవసరమైనవారిలో 11.3% మంది పురుషులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. హైదరాబాద్, జోగులాంబ, మహబూబ్‌నగర్, నల్లగొండ, నాగర్‌కర్నూలు, వికారాబాద్, నిజామాబాద్, వనపర్తి జిల్లాల్లో ఒక్కరూ చేయించుకోలేదు.  

గర్భ నియంత్రణ మాత్రల ద్వారా కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించేవారు మహిళలు 0.8 శాతమే ఉన్నారు. సంగారెడ్డి జిల్లాలో రెండు శాతం, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో జీరో శాతం ఉంది. గతంతో పోలిస్తే రాష్ట్రంలో 0.5 శాతం పెరిగింది.  

మహిళలకు గర్భాశయంలో ఒక డివైజ్‌ (ఐయూడీ)ను ప్రవేశపెట్టడం ద్వారా కుటుంబ నియంత్రణ పాటించే పద్ధతి రాష్ట్రంలో 0.5 % గా ఉంది. హైదరాబాద్‌లో 1.8 శాతం మంది ఉపయోగిస్తున్నారు. వరంగల్, మహబూబాబాద్, భూపాలపల్లి, మెదక్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేటల్లో ఈ పద్ధతిని పాటించడంలేదు.  

కండోమ్స్‌ను వినియోగించే పురుషులు 0.8 శాతమే. గతంతో పోలిస్తే 0.3% పెరిగింది. సిరిసిల్ల జిల్లాలో 1.8% మంది ఉపయోగిస్తున్నారు. మంచిర్యాలలో జీరో శాతం ఉన్నారు.  

ఇంజెక్షన్‌ రూపంలో రాష్ట్రంలో మహిళలు కుటుంబ నియంత్రణ పాటించేవారు 0.1% మాత్రమే ఉన్నారు.  

అసలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకునే అవకాశం ఉన్నా చేయించుకోనివారు రాష్ట్రంలో 6.4% ఉన్నారు. జగిత్యాల జిల్లాలో 13.4% కాగా, నల్లగొండ జిల్లాలో రెండు శాతం ఉన్నారు.    

మరిన్ని వార్తలు