కౌన్సిలర్లకు ‘కరెంటు’షాక్‌!

7 Dec, 2021 09:47 IST|Sakshi
విద్యుత్‌ లైన్‌మెన్‌ పై దాడిచేస్తున్న కౌన్సిలర్లు

సాక్షి, చెన్నూర్‌(ఆదిలాబాద్‌): అది విద్యుత్‌ శాఖకు చెందిన సబ్‌స్టేషన్‌ స్థలం.. దానిలో షెడ్లు నిర్మించడానికి మున్సిపల్‌ కౌన్సిలర్లు ప్రయత్నించారు.. ఇదేమిటని అడ్డుకున్న విద్యుత్‌ సిబ్బందిపై దాడికి దిగారు. ఈ తీరుతో మండిపడ్డ విద్యుత్‌ సిబ్బంది పట్టణం మొత్తానికి కరెంట్‌ కట్‌ చేశారు, జాతీయ రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు. సోమవారం మంచిర్యాల జిల్లా చెన్నూరులో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.

చెన్నూర్‌ మున్సిపాలిటీ పరిధిలో పెట్రోల్‌బంక్‌ నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ పనుల్లో చిరు వ్యాపారులు షెడ్లు కోల్పోయారు. వారికి స్థానిక సబ్‌స్టేషన్‌ స్థలంలో షెడ్లు నిర్మించాలని మున్సిపల్‌ కమిషనర్, కౌన్సిలర్లు నిర్ణయించారు. సోమవారం సబ్‌స్టేషన్‌ ఆవరణలో నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యుత్‌శాఖ ఏఈ రామ్మూర్తి, లైన్‌మెన్లు అక్కడికి చేరుకున్నారు.

తమకు సమాచారం ఇవ్వకుండా విద్యుత్‌ శాఖ స్థలంలో షెడ్లు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ స్థలంలో నిర్మాణానికి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఏమిటంటూ కౌన్సిలర్లు ఎదురు ప్రశ్నించారు. ఇరువర్గాల మధ్య జరుగుతున్న ఈ వాగ్వాదాన్ని విద్యుత్‌ లైన్‌మెన్లు పాషా, సృజన్‌ వీడియో తీయడం మొదలుపెట్టారు.

అది చూసిన కౌన్సిలర్లు రెవెల్లి మహేశ్, వేల్పుల సుధాకర్, 11వ వార్డు కౌన్సిలర్‌ పెండ్యాల స్వర్ణలత భర్త, ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అనుచరుడిగా పేరున్న లక్ష్మణ్‌ తదితరులు ఆగ్రహంతో లైన్‌మన్లపై దాడి చేశారు. 

విద్యుత్‌ సరఫరా నిలిపేసి నిరసన 
తమ ఉద్యోగులపై దాడికి నిరసనగా విద్యుత్‌శాఖ అధికారులు, సిబ్బంది చెన్నూర్‌లో సుమారు 6 గంటలపాటు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. మంచిర్యాల– చెన్నూర్‌ జాతీయ రహదారిపై రెండు గంటల పాటు బైఠాయించారు.  పోలీసులు అక్కడికి చేరుకుని నచ్చజెప్పడంతో ఆందోళనను విరమించారు. 

మరిన్ని వార్తలు