కలెక్టరేట్‌పై దంపతుల ఆత్మహత్యాయత్నం

14 Feb, 2023 01:58 IST|Sakshi
ఆత్మహత్యాయత్నం చేస్తున్న దంపతులు  

జనగామ: తమ తాతనుంచి వారసత్వంగా వచ్చిన భూమిని కొందరు రెవెన్యూ అధికారులు ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్‌ చేసి.. అన్యాయం చేశారని ఆరోపిస్తూ సోమవారం జనగామ జిల్లా సమీకృత కలెక్టరేట్‌పైకి ఎక్కి ఓ దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇలా వీరు ఈ సమస్యపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ఇది మూడోసారని తెలుస్తోంది. వివరాలిలా ఉన్నాయి.

జనగామ మండలం పసరమడ్ల గ్రామానికి చెందిన నిమ్మల నర్సింగారావు, రేవతి దంపతులు బతుకు దెరువు కోసం ఐదేళ్ల క్రితం ములుగు జిల్లా తాడ్వాయి మండలం ఏలుబాకకు వెళ్లారు. అక్కడ నర్సింగారావు కారు డ్రైవింగ్‌ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కాగా, గ్రామంలో తమ తాత నుంచి వారసత్వంగా వచ్చిన 4 ఎకరాల భూమిని అప్పటి తహసీల్దార్‌ రమేశ్, వీఆర్‌ఓ క్రాంతి అదే గ్రామానికి చెందిన కొందరి పేరిట రిజస్ట్రేషన్‌ చేశారని నర్సింగారావు ఆరోపించారు. ఈ విషయమై తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఎన్ని సార్లు విన్నవించుకున్నా ఫలితం కనిపించలేదని తెలిపారు.  

కలెక్టర్‌ను కలిసి..: నర్సింగారావు దంపతులు ఉదయం 11 గంటల తర్వాత గ్రీవెన్స్‌ కార్యక్రమంలో కలెక్టర్‌ సీహెచ్‌ శివలింగయ్యను కలసి వినతిపత్రం అందజేశారు. నాలుగేళ్లనుంచి తమ సమస్య పరిష్కారంకోసం తిరుగుతున్నామని, త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌.. ‘మీకు న్యాయం జరిగేలా చూస్తున్నా.. కొంత ఆలస్యం జరుగుతుంది, కొద్దిగా ఓపిక పట్టండి’అని సమాధానం చెప్పారు.

అయితే ఓపిక నశించిన ఆ దంపతులు కలెక్టరేట్‌ పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నర్సింగారావు దంపతులు ఒంటిపై డీజిల్‌ పోసుకుని చేతిలో అగ్గిపెట్టె పట్టుకుని.. తాము చచ్చిపోతున్నామని, ఇక్కడ న్యాయం జరగదని అరవడంతో అక్కడికి వచ్చిన అధికారులు, పోలీసులు, జనం గంటసేపు వారిని బతిమిలాడారు. చివరికి పై నుంచి ఆ దంపతులపై నీళ్లు పోయగా, అక్కడే ఉన్న పోలీసులు చాకచక్యంగా వారిని పట్టుకుని కిందకు తీసుకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం తహసీల్దార్‌ రవీందర్‌ వారితో మాట్లాడారు. పట్టా రద్దు వ్యవహారం కోర్టు ద్వారా రావాల్సి ఉందని.. తమ చేతుల్లో లేదని, కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలని దంపతులకు చెప్పి పంపించారు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు