ప్ర‌భుత్వానికి హైకోర్టు ఆదేశం..విచార‌ణ వాయిదా

24 Sep, 2020 17:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : చ‌ర్ల ఎన్‌కౌంట‌ర్‌పై దాఖ‌లైన పిటిష‌న్‌పై హైకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చనిపోయిన ముగ్గురు మృతదేహాలను ఫ్రీజ్ చేయాలని పిటీషనర్ త‌ర‌పు న్యాయ‌వాది ర‌గునాథ్ హైకోర్టును కోరారు. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో  పాల్గొన్న పోలీసులపై సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయాలని తెలిపారు. మృతదేహాలను వరంగల్ ఎంజీఎం, ఉస్మానియా ఆసుపత్రికి తరలించాలన్నారు. అదే విధంగా మృత దేహాలకు ఫోరెన్సిక్ నిపుణులతో పోస్టు మార్టం చేపించాలని హైకోర్టును కోరారు. (ముగ్గురు మావోల ఎన్‌కౌంటర్‌ )

అయితే ఇప్ప‌టికే మూడు మృత‌దేహాల‌ను పోస్టుమార్టం చేసి కుటుంబ‌స‌భ్యుల‌కు అప్ప‌గించామ‌ని ప్ర‌భుత్వం బ‌దులిచ్చింది. దీనిపై స్పందించిన న్యాయ‌స్థానం  కుటుంబ సభ్యుల నుండి మృతదేహాలను తీసుకుని భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ  హాస్పిటల్‌లో  ఫ్రీజ్ చేయాలని ప్ర‌భుత్వానికి సూచించింది. అంతేకాకుండా ఎంజీఎం ఫోరెన్సిక్ నిపుణులతో రీ పోస్టుమార్టం చేపించాలని ఆదేశించింది. పోస్టుమార్టం మొత్తం వీడియో గ్రఫీ చేపించి రీపోర్ట్ షీల్డ్ కవర్‌లో సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశించింది. త‌దుప‌రి విచార‌ణ‌ను  అక్టోబర్ 5 కు వాయిదావేసింది. (చర్ల ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపించాలి)

మరిన్ని వార్తలు