Covid Care: బీపీ, షుగర్‌, ఒబేసిటీ ఉన్నవారు..

4 May, 2021 09:01 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కరోనా కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కోవిడ్‌ అనేది ఎవరికైనా సోకే అవకాశం ఉంటుంది. అయితే షుగర్, బీపీతో పాటు ఒబేసిటీ కూడా ఉంటే కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వారు రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహారం తీసుకోవాలి. పండ్లు, రసాలు ఎక్కువగా తీసుకోవాలి. షుగర్, బీపీ నియంత్రణలో ఉంచుకోవాలి. ఊబకాయులకు ఊపిరితిత్తులు విచ్చుకోవడం (ఎక్స్‌పాన్షన్‌)తక్కువగా ఉంటుంది. వారికి కోవిడ్‌ వస్తే ఛాతీపై బోర్లా పడుకుని తల పక్కకు తిప్పుతూ 2, 3 గంటలకు ఒకసారి దీర్ఘ శ్వాస తీసుకోవాలి. దానివల్ల వారి ఆక్సిజన్‌ శాచురేషన్‌ స్థాయిలు పెంచుకోగలుగుతారు. పూర్తిగా బోర్లా పడుకోలేని వారు ఒకపక్కకైనా తిరిగి పడుకోవాలి. 

బీపీకి వాడే మందులతో వైరస్‌ తీవ్రత పెరుగుతోందనే ప్రచారంలో వాస్తవం ఉందా? 
బీపీకి వైరస్‌ పెరుగుదలకు అసలేం సంబంధం లేదు. బీపీకి వాడే మందులు వైరస్‌ తీవ్రతను పెంచుతాయన్న ప్రచారం అవాస్తవం. బీపీ, షుగర్‌ ఉన్నవారిలో కోవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్‌ ఇస్తారు కాబట్టి షుగర్, బీపీ పెరిగే అవకాశాలు ఉంటాయి. అందువల్ల పేషెంట్లు తమ మందులను తప్పనిసరిగా కొనసాగించాలి. ఆటోమేటిక్‌ బీపీ చెకింగ్‌ ఎలక్ట్రానిక్‌ మీటర్ల ద్వారా చెక్‌ చేసుకోవచ్చు. రోజుకు రెండుసార్లు షుగర్‌ను పరీక్షించుకోవాలి. లెవల్స్‌ పెరిగితే డాక్టర్లను సంప్రదించాలి.  

-డా.ఎ.నవీన్‌రెడ్డి,
క్రిటికల్‌కేర్, డయాబెటాలజీ, జనరల్‌ మెడిసిన్, నవీన్‌రెడ్డి ఆస్పత్రి

మరిన్ని వార్తలు