మృత్యు ఘంటికలు..!

30 Jul, 2020 12:28 IST|Sakshi
కరోనాతో చనిపోయిన వ్యక్తికి దహన సంస్కారాలు పూర్తి చేస్తున్న వైద్య సిబ్బంది

పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు      

ఎనిమిదికి చేరిన మృతులు   

తోడవుతున్న ఇతర రోగాలు  

జిల్లాలో చేయిదాటుతున్న పరిస్థితి

బెల్లంపల్లి: జిల్లాలో కరోనా మహమ్మారి మృత్యు ఘంటికలు మోగిస్తోంది. వైరస్‌ సోకిన  ఒక్కొక్కరిని క్రమంగా కాటికి తీసుకెళ్తోంది. పాజిటివ్‌ వచ్చిన వెంటనే ఐసోలేషన్‌ వార్డులో చేర్చినా.. కొందరికి మృత్యువు మాత్రం తప్పడం లేదు. కరోనా రక్కసితోపాటు ఇతర వ్యాధులు కూడా వేగంగా తిరగదోడుతున్నాయి. పాత జబ్బులన్నీ ఒకేసారి దాడిచేస్తుండడంతో వ్యక్తి శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి.. మందులు వాడినా నయంకావడం లేదు. జిల్లాలో ఇలా మూడురోజుల వ్యవధిలోనే ముగ్గురు వ్యక్తులు కరోనాతో మృతిచెందడం కలకలం రేపగా.. ఇప్పటివరకు వైరస్‌బారిన పడి తనువు చాలించిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. ఈ పరిణామాలు జిల్లావాసులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. మున్ముందు పరిస్థితులు మరెంత దారుణంగా ఉంటాయోననే భయపడుతున్నారు. 

మొత్తంగా 8.. వరుసగా ముగ్గురు
ఇన్నాళ్లూ హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో మాత్రమే కరోనా మరణాలు సంభవిస్తున్నట్లు విని.. మన వరకు రాలేదు కదా.. అనుకుంటున్న తరుణంలో ప్రస్తుతం ఆ పరిస్థితులు జిల్లాకు చేరాయి. జిల్లా కేంద్రంలోని తిలక్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి (55) ఈనెల 26న రాత్రి కరోనా లక్షణాలతో బెల్లంపల్లి ఐసోలేషన్‌ వార్డులో మృతిచెందాడు. 27న శ్రీరాంపూర్‌కు చెందిన ఓ మహిళ మంచిర్యాల జిల్లాకేంద్ర ఆసుపత్రిలో మరణించింది. ఆ ఘటన జరిగిన 24 గంటల వ్యవధిలోనే బెల్లంపల్లి ఐసోలేషన్‌ వార్డులో మరో మరణం సంభవించింది. 28న రాత్రి బెల్లంపల్లి ఇంక్‌లైన్‌ రడగంబాలబస్తీకి చెందిన వ్యక్తి (62) కరోనా అనుమానిత లక్షణాలతో చనిపోయాడు. ఇలా మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు మృత్యు ఒడిలోకి చేరారు. అంతకుముందు చెన్నూర్‌ మండలం ముత్తురావుపల్లికి చెందిన మహిళ (58) కరోనా పాజిటివ్‌తో మృతి చెందింది. జిల్లాలో   ఆమెదే తొలి మరణంగా రికార్డు కెక్కింది. ఆ తర్వాత మంచిర్యాలకు చెందిన ఓ వ్యక్తి,తర్వాత రామకృష్ణాపూర్‌ (బీజోన్‌ ఏరియా)కు చెందిన మహిళ (52), మళ్లీ వారం తర్వాత బెల్లంపల్లి హన్మాన్‌బస్తీకి చెందిన ఓ మహిళ కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రిలో మృత్యువాత పడింది. ఆమె చనిపోయిన వారంలో బెల్లంపల్లి బజారు ఏరియాకు చెందిన వృద్ధుడు (80) హైదరాబాద్‌లో కరోనా లక్షణాలతో తుదిశ్వాస విడిచాడు. 

కడచూపునకు నోచుకోకుండా కాటికి..
కరోనా వైరస్‌తో చనిపోతే బంధువులు, కనీసం కుటుంబసభ్యులు కూడా చివరి చూపునకు నోచుకోవడంలేదు. అందరూ ఉన్నా.. అనాథలా కాటికి చేరుతున్నారు. అప్పటివరకు కుటుంబంతో కలిసి మెలిసి అన్యోన్యంగా గడిపి.. చివరకు చివరి చూపు లేకుండా ఖననం అవుతున్నారు. అంత్యక్రియల్లో సరైన రక్షణ చర్యలు తీసుకోకుంటే వైరస్‌ అంటుకునే ప్రమాదం ఉంటుందనే ప్రచారంతో కనీసం భార్యాబిడ్డలు కూడా ఆ దారిదాపులకు రావడం లేదు. ప్రభుత్వ వైద్య సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి, పకడ్బందీగా  రక్షణ సూత్రాలు పాటించి అంతిమసంస్కారాలు చేస్తున్న తీరు కలిచి వేస్తోంది. మాయదారి వైరస్‌ కుటుంబ సభ్యులు, బంధువులు, ఆత్మీయుల కన్నీటికి కారణమవుతోంది. 

400కు పైగా పాజిటివ్‌ కేసులు
జిల్లాలో అధికారికంగా ఇప్పటివరకు 400 మందికిపైగా పాజిటివ్‌ వచ్చింది. మరో 800 మంది వరకు హోంక్వారంటైన్‌లో గడుపుతున్నారు. మంచిర్యాల,  బెల్లంపల్లి, చెన్నూర్, శ్రీరాంపూర్, లక్సెట్టిపేట, రామకృష్ణాపూర్, నస్పూర్, తాండూర్, దండేపల్లి, జన్నారం, హాజీపూర్, జైపూర్, భీమారం, కాసిపేట ప్రాంతాల్లో వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకూ కరోనా రక్కసి జిల్లాప్రజలపై విరుచుకుపడుతూనే ఉంది. మరోవైపు పాజిటివ్‌ వచ్చిన చాలామంది ఆరోగ్యంగా బయటకు వస్తుండడం కొంత ఉపశమనంగా చెప్పుకోవచ్చు.   

ధైర్యమే మందు..
మాయదారి వైరస్‌ సోకిందని తెలిసిన వెంటనే అధైర్యపడొద్దని వైద్యులు భరోసా కల్పిస్తున్నారు. ధైర్యంతో ఉంటే వ్యాధిని జయించవచ్చని సూచిస్తున్నారు. కుటుంబసభ్యులు కంగారు పడకుండా సదరు వ్యక్తికి మనోధైర్యం కల్పించాలని, ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా వ్యాయామం చేయించాలని, వేడినీరు తాగడంతోపాటు అల్లం, సొంఠి, మిరియాలు, దాల్చిన చెక్కతో తయారు చేసిన కషాయం తాగాలని సూచిస్తున్నారు. కోడిగుడ్లు, చికెన్, మటన్‌ తినాలని, వైద్యుల సూచనలు, సలహాలు విధిగా పాటించాలని పేర్కొంటున్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు