సొంతిల్లు కలేనా!

15 Feb, 2021 20:56 IST|Sakshi

భారంగా మారిన నిర్మాణం

భారీగా పెరిగిన సిమెంట్, ఐరన్, సామగ్రి ధరలు 

ఎలక్ట్రిక్‌ సామగ్రి ధరలకు సైతం రెక్కలు 

వేధిస్తున్న కూలీల కొరత 

లాక్‌డౌన్‌ తర్వాత తీవ్ర ఇబ్బందులు

ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు వెంకట్‌రెడ్డి. వికారాబాద్‌ పట్టణంలోని ఎన్జీఓస్‌ కాలనీలో 150 గజాల్లో ఇల్లు నిర్మించుకుంటున్నాడు. లాక్‌డౌన్‌కు ముందే కట్టుకోవాలని భావించాడు.  అప్పటి అంచనాల ప్రకారం ఒక అంతస్తు నిర్మించేందుకు రూ.15 లక్షలు అవుతాయని భావించాడు. కరోనా ప్రభావంతో నిర్మాణం ఆగిపోయింది. ఇప్పుడు తిరిగి పనులు ప్రారంభించాడు. స్టీల్, ఇటుక, సిమెంట్, ఇతర సామగ్రి ధరలు పెరగడంతో మొదట తాను అంచనా వేసిన డబ్బులతో నిర్మాణం పూర్తయ్యేలా కనిపించడం లేదని చెబుతున్నాడు. ప్రస్తుత ధరల ప్రకారం ఒక అంతస్తుకు రూ.18 లక్షలు ఖర్చు కావొచ్చని చెబుతున్నాడు.   

ఇతడి పేరు అఖిలేశ్వర్‌. వికారాబాద్‌ మహావీర్‌ ఆస్పత్రికి వెళ్లే రోడ్డులో 120 గజాల్లో ఇల్లు నిర్మించుకుంటున్నాడు. గతేడాది ప్రారంభించాలని భావించాడు. వ్యక్తిగత కారణాలతో జాప్యం జరిగింది. అంతలోనే కరోనా లాక్‌డౌన్‌ రావడంతో కొన్నిరోజుల క్రితం ఇంటి పనులు ప్రారంభించాడు. సామగ్రి ధరలు విపరీతంగా పెరగడంతో అనుకున్న బడ్జెట్‌ కంటే ఎక్కువ అవుతుందని చెబుతున్నాడు. స్టీల్, సిమెంట్‌ ధరలకు రెక్కలు వచ్చాయని, వ్యాపారులు ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారని ఆందోళన చెందుతున్నాడు. 

వికారాబాద్‌ అర్బన్‌: కరోనా మహమ్మారి అన్ని రంగాలను అతలాకుతలం చేసింది. పేద, మధ్య తరగతి కుటుంబాలతో పాటు రియల్‌ ఎస్టేట్, నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోవడంతో సరుకుల తయారీ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. లాక్‌డౌన్‌ తర్వాత సిమెంటు, ఇసుక, ఐరన్‌ ధరలు అమాంతంగా పెరిగాయి. సొంతిల్లు కట్టుకోవాలంటే జనం బెంబేలెత్తిపోతున్నారు. జిల్లాలో బిల్డర్లు, బడా కాంట్రాక్టర్లు 100 మందికి పైగానే ఉన్నారు. వీరిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 20వేల మంది ఆధారపడి ఉంటారు. జిల్లాలో నెలవారీగా సరాసరి 1,500 టన్నుల ఐరన్, లక్ష బస్తాల వరకు సిమెంటు అమ్మకాలు జరుగుతుంటాయి. కరోనా సంక్షోభానికి ముందుతో పోలిస్తే సిమెంటు, కాళేశ్వరం ఇసుక, ఎలక్ట్రికల్, ఐరన్, లేబర్‌ చార్జీలు, పీవీసీ పైపుల ధరలు 34 శాతం నుంచి 45 శాతం వరకు పెరిగాయి. ధరలు పెరగడంతో 30 శాతం మేర అమ్మకాలు పడిపోయాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలకు 
సొంతింటి ఆశలు కలగానే మిగిలిపోతున్నాయి.  

ధరలన్నీ పైపైకి..  
మూడేళ్లతో పోలిస్తే బస్తా సిమెంటు ధర రూ.110 నుంచి 350 రూ. వరకు పెరిగింది. లాక్‌డౌన్‌ కంటే ముందు బస్తా సిమెంట్‌ రూ. 320 ఉండగా ప్రస్తుతం రూ. 350కి పెరిగింది. కాళేశ్వరం ఇసుక టన్ను రూ. 1000 నుంచి రూ. 1700 వరకు పెరిగింది. ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టడంతో నిర్మాణదారులు ఇసుకను కొనుగోలు చేసి నిల్వ ఉంచుకుంటున్నాడు. ఇసుక ధరతో పోలిస్తే తెల్ల డస్టు ధర తక్కువ ఉండటంతో కొందరు దానిని వినియోగిస్తున్నారు. లోకల్‌ ఇసుకకు డిమాండ్‌ పెరిగింది. జిల్లాకు ఎక్కువగా మహారాష్ట్ర నుంచి ఇటుకను తీసుకొస్తారు. లాక్‌డౌన్‌ కంటే ముందు ఒక్కో ఇటుక ధర రూ. 4 నుంచి రూ. 5 ఉండగా ప్రస్తుతం రూ. 6 నుంచి 7 పలుకుతోంది. పేదలు ఇల్లు నిర్మించుకుందామంటే ధరలు చూసి భయపడుతున్నారు.  

నిర్మాణ సమయంలో.. 
ఇల్లు నిర్మించే సమయంలో యజమాని సదరు బిల్డర్‌ లేదా కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించే సమయంలో ఒప్పందం కుదుర్చుకుంటారు. చదరపు అడుగు సివిల్‌ పనులకు (కేవలం సిమెంటు) గతంలో రూ. 500 ఉండగా, ప్రస్తుతం రూ. 850 తీసుకుంటున్నారు. ఫర్నిచర్‌ మినహా వందశాతం పనుల కోసం చదరపు అడుగు గతంలో రూ. 1200 తీసుకోగా, ప్రస్తుతం రూ. 1,550, ఫర్నిచర్‌తో కలుపుకొని ప్రస్తుతం రూ. 1,850 ధర పలుకుతోంది. జిల్లా కేంద్రంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన సుమారు 200 మంది మేస్త్రీలు, ఇతర కారి్మకులు పనిచేసేవారు. కరోనా సమయంలో 50 శాతం మంది సొంత ఊళ్లకు వెళ్లడంతో నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది.

ఐదునెలల పాటు పూర్తిగా పనులు నిలిచిపోగా ఇప్పుడిప్పుడే తిరిగి ప్రారంభమయ్యాయి. లేబర్‌ కొరత కూడా తీవ్రంగా ఉంది. గతంలో తాపీ మేస్త్రీకి రూ. 800 కూలి ఇవ్వగా ప్రస్తుతం రూ. 1000కి పెరిగింది. పార పనికోసం వచ్చే వారికి రోజుకు గతంలో రూ. 500 ఇవ్వగా ఇప్పుడు రూ. 600 ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. సిమెంట్, స్టీల్, ఇసుక ఇతర సామగ్రి ధరలను ప్రభుత్వం నియంత్రించాలని నిర్మాణదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు