Corona: పిల్లల్లో ఈ లక్షణాలుంటే నిర్లక్ష్యం వద్దు

17 May, 2021 09:13 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పిల్లలకూ కరోనా సోకుతుంది

వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే వరకు బయట తిరగనీయొద్దు

అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే మాస్క్‌మస్ట్‌

చిన్నపిల్లల వైద్య నిపుణులు రేసు హరీష్‌

నల్లగొండటౌన్‌ : కరోనా వైరస్‌ మరింత శక్తివంతంగా మారుతోంది. మొదటి దశలో కంటే రెండో దశలో కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరగడమే అందుకు నిదర్శనం. సెకండ్‌ వేవ్‌లో యువకులు, మహిళలు మహమ్మారి బారినపడిన విషయాన్ని చూశాం. థర్డ్‌వేవ్‌ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఈ థర్డ్‌వేవ్‌లో చిన్న పిల్లలు వైరస్‌ బారిన పడే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకుని పిల్లను కాపాడుకోవాలని సూచిస్తున్నారు.. నల్లగొండలోని శ్రీ అశ్విని పిల్లల ఆసుపత్రికి చెందిన డాక్టర్‌ రేసు హరీష్‌(ఎండీ, పీడియాట్రిక్స్‌). వైరస్‌ చిన్న పిల్లలకు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలు, సూ చనలపై ఆదివారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వూ్యలో వెల్లడించారు. 

ప్రశ్న : కోవిడ్‌ చిన్న పిల్లలో కూడా వస్తుందా..? వ్యాధి లక్షణాలు ఎలా గుర్తు పట్టాలి?
జవాబు : కరోనా చిన్న పిల్లల్లో కూడా వస్తుంది. పెద్దల్లో అయితే దగ్గు, జలుబు, ఆయాసం కొన్ని సందర్భాల్లో గుండె పోటు, పక్షవాతం వంటి లక్షణాలు ఉంటాయి. పిల్లల్లో అయితే ఎక్కువగా వాంతులు, విరేచనాలు, జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు కనిపిస్తాయి.

ప్రశ్న : ఆస్పత్రుల్లో ఎప్పుడు చేర్పించాలి?
జవాబు : అప్పుడే పుట్టిన పిల్లల్లో అయితే వాంతులు, విరేచనాలు, జ్వరం, పాలు తాగకపోవడం కొంచెం పెద్ద పిల్లల్లో అయితే కడుపు నొప్పి, వాంతులు ఏమి తిన్నా విరేచనాలు కావడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆస్పత్రుల్లో చేర్పించాలి. కేవలం జ్వరం, దగ్గు, జలుబు ఉంటే ఇంట్లోనే ఉండి చికిత్స పొందాలి.

ప్రశ్న : ఒకవేళ కరోనా పరీక్షల్లో నెగెటివ్‌ ఉండి లక్షణాలు ఉంటే ఏం చేయాలి?
జవాబు : పిల్లల్లో లక్షణాలు ఉండి పరీక్షల్లో నెగెటివ్‌ ఉంటే రక్త పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. సీబీపీ, సీఆర్‌పీలో ఏమైనా తేడాలు ఉంటే, వైరస్‌ వస్తే మనకు తెలిసిపోతుంది. 

ప్రశ్న :  కరోనా సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
జవాబు : కరోనా సోకకుండా ఉండాలంటే ఇంట్లోనే ఉండి అవసరమైనప్పుడు మాత్రమే బయటికి వె ళ్లాలి. పిల్లలను ఇంకా కొన్ని రోజుల వరకు ముఖ్యంగా వాక్సిన్‌ అందరికీ అందుబాటులోకి వచ్చేదాకా బయట తిరగనీయకూడదు. బయటికి వెళ్తే మాస్కు లు తప్పకుండా పెట్టాలి. చేతులను శుభ్రంగా శానిటైజ్‌ చేసుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించే విధంగా చూడాలి. 

ప్రశ్న :  పిల్లలను ఐసోలేషన్‌ చేయడం కరెక్టేనా?
జవాబు : చిన్న పిల్లలను ఐసోలేషన్‌ చేయడం కష్టం. ఎందుకంటే వాళ్లను వేరుగా ఉంచితే ఎక్కువగా బాధపడి ఇంకా ఎక్కువ ఇబ్బందులు వస్తాయి. అప్పుడే పుట్టిన పిల్లలకు తల్లిపాలు ఇవ్వాలి. తల్లి పాలలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తల్లి పాలను తప్పక ఇవ్వాలి. పిల్లలకు పాలిచ్చేటప్పుడు తల్లులు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, మాస్కు లు పెట్టుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. 

ప్రశ్న : డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
జవాబు : డాక్టర్‌ను పిల్లల్లో వాంతులు, విరేచనాలు, జ్వరం, దగ్గు, జలుబు, కడుపునొప్పి మూడు రోజుల కంటే ఎక్కువ ఉన్నప్పుడు, ఆక్సిజన్‌ స్థాయి 94 కంటే తక్కువగా ఉన్నప్పుడు. కండ్లు ఎర్రగా మారినప్పుడు, దగ్గు తగ్గనప్పుడు, రోజంతా     వాంతులు, నీ రసంగా ఉంటే అప్పుడే పాలు సరిగా తాగకపోవడం, ఒళ్లంతా దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి సరైన చికిత్సలు పొందాలి. 

చదవండి: Corona: పిల్లల్లో కనిపించే లక్షణాలు ఇవే..

మరిన్ని వార్తలు