10మంది కరోనా రోగులు పరారీ!

2 Aug, 2020 11:48 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : తమను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ రిమ్స్‌ ఐసోలేషన్‌ కేంద్రం నుంచి కరోనా రోగులు పరారైన సంఘటన కలకలం రేపుతోంది. ఒకవైపు రోజురోజుకు కరోనా కేసులు పెరుగుగుండగా, మరోవైపు జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న 10మంది కరోనా పాజిటివ్‌ వ్యక్తులు శనివారం రాత్రి తప్పించుకుని బయటకు వచ్చారు. (కరోనా సోకి విద్యాశాఖ మంత్రి మృతి)

ఇటీవల ఈ రిమ్స్‌లో సరైన సౌకర్యాలు లేవని సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాజిటివ్‌ వచ్చిన పదిమంది సిబ్బంది కళ్లుగప్పి తప్పించుకున్నారు. అయితే వీరిని రిమ్స్‌ సెక్యూరిటీ గార్డులతో పాటు ఎప్పటికప్పుడు సిబ్బంది, వైద్యబృందం పర్యవేక్షించాల్సి ఉండగా వారు పట్టించుకోకపోవడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. రిమ్స్‌ నుంచి తప్పించుకున్న బాధితులు కైలాస్‌నగర్‌, చాందా, టీచర్స్‌ కాలనీ, నిజామాబాద్‌, కొత్త కుమ్మరివాడ, ద్వారక నగర్‌, ఇంద్రవెల్లి, ఖానాపూర్‌కు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. (తెలంగాణలో కొత్తగా 1891 కరోనా కేసులు)

అయితే మెరుగైన వైద్య సేవలు, సరైన సౌకర్యాలు లేకపోవడంతోనే వీరంతా రిమ్స్‌ నుంచి పరారైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఇక తప్పించుకున్నవారి ముగ్గురిని గుర్తించినట్లు వైద్యాధికారులు, పోలీసులు తెలిపారు. ఇద్దరు ఆదిలాబాద్‌ పట్టణానికి చెందిన వ్యక్తుల్ని తిరిగి రిమ్స్‌కు తరలించారు. ఇంద్రవెల్లికి చెందిన ఒకరిని హోం ఐసోలేషన్‌లో ఉంచేందుకు అనుమతి ఇచ్చారు. (విషాదం.. కరోనా బాధితులు ఆత్మహత్య)

పరారీ అవాస్తవం
ఐసోలేషన్‌ కేంద్రం నుంచి పదిమంది కరోనా రోగులు పరారయ్యారనేది అవాస్తవమని రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్ కొట్టిపారేశారు. వారు పండుగ కోసం అనుమతి తీసుకుని వెళ్లారని, వాళ్లంతా తిరిగి రిమ్స్‌కు వచ్చేశారని తెలిపారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు