నేడు నిమ్స్‌లో 55 మందికి ‘కొవాక్జిన్‌’..

6 Oct, 2020 07:55 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రెండో దశలో కరోనా టీకా!

28 రోజుల తర్వాత 3వ దశ ట్రయల్స్‌

వలంటీర్లకు రెండ్రోజుల్లో స్క్రీనింగ్‌ టెస్టులు 

లక్డీకాపూల్‌ (హైదరాబాద్‌): నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌)లో ప్రతిష్టాత్మ కంగా కొనసాగుతున్న కొవాక్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా రెండో దశ తుది టీకా ప్రయోగం చేయనున్నారు. మంగళవారం నిమ్స్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ నోడల్‌ అధికారి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సి.ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో బూస్టర్‌ డోస్‌ వేయనున్నారు. రెండో దశలో 55 మంది వలంటీర్లు కొవాక్జిన్‌ టీకాలు వేయించుకోనుండగా, మొదటి దశలో 45 మంది వలంటీర్లు టీకాలు వేయించుకున్నారు. భారతీయ కౌన్సిల్‌ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌), భారత్‌ బయోటెక్‌ సంయుక్త భాగస్వామ్యంతో మొట్టమొదటి స్వదేశీ కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ కొవాక్జిన్‌ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: కరోనా టీకా ఇచ్చే జాబితాలో వీరికి ప్రాధాన్యం)

ఇక ఈ వ్యాక్సిన్‌ హ్యూమన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రక్రియలో 105 మంది వలంటీర్లు భాగస్వాములయ్యారు. మరో 28 రోజుల్లో మూడో దశ ట్రయల్స్‌ను చేపట్టేందుకు వైద్యులు సిద్ధమవు తున్నారు. ఈ దశలో మరో 60 మంది వలంటీర్లకు కొవాక్జిన్‌ టీకాలు వేయనున్నట్టు నిమ్స్‌ వైద్య బృందం తెలిపింది. నిమ్స్‌ సంచాలకుడు డాక్టర్‌ కె. మనోహర్‌ పర్యవేక్షణలో క్లినికల్‌ ఫార్మకాలజీ ప్రొఫెసర్లు, జనరల్‌ మెడిసిన్, అనస్థీషియా, రెస్పిరేటరీ మెడిసిన్, క్రిటికల్‌ కేర్‌ విభాగాలకు చెందిన సీనియర్‌ వైద్యుల సమన్వయంతో ఈ ట్రయల్స్‌ విజయవంతంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు ఈ టీకా ఇచ్చిన వలంటీర్లలో కొవాక్జిన్‌ కారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కాలేదని నిమ్స్‌ వైద్య నిపుణులు స్పష్టం చేశారు. ఈ టీకా ప్రయోగానికి 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసులోని ఆరోగ్యవంతులని మాత్రమే ఎంపిక చేశారు. ఈ క్రమంలో మూడో దశ ట్రయల్స్‌కు సంబంధించిన వలంటీర్ల స్క్రీనింగ్‌ టెస్టుల ప్రక్రియను మరో రెండ్రోజుల్లో చేపట్టనున్నట్టు వైద్యులు తెలిపారు.

మరిన్ని వార్తలు