సమర్థ వ్యాక్సిన్‌తోనే కరోనా వైరస్‌కు చెక్‌!

1 Dec, 2020 08:34 IST|Sakshi

 90 శాతం పైగా సామర్థ్యమున్నదే అవసరం.. సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా పనిచేసేదే సరైన టీకా

వ్యాక్సిన్‌పై హడావుడి వద్దంటున్న వైద్య నిపుణులు..

డబ్ల్యూహెచ్‌వో ఇప్పటివరకు దేనినీ ఆమోదించలేదు

కొన్ని దేశాల వ్యాక్సిన్లను దేశంలో నిల్వ కూడా చేయలేం

మైనస్‌ 70 డిగ్రీల నిల్వ సామర్థ్యం కొరతే కారణం..

ఎబోలా వ్యాక్సిన్‌ నిర్ధారణకు అనేక కఠిన పరీక్షలు

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు యావత్‌ ప్రపంచం ఇప్పుడు వ్యాక్సిన్‌ వైపు చూస్తోంది. అనేక ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్‌ను తయారుచేసే పనిలో నిమగ్నమైపోయాయి. ప్రాణాంతక కోవిడ్‌-19‌ రెండో విడత విజృంభణ ప్రపంచ ప్రజలను భయకంపితుల్ని చేస్తున్న నేపథ్యంలో అనేక కరోనా వ్యాక్సిన్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయనే వార్తలు ఊరట కలిగిస్తున్నాయి. ఇప్పటివరకు కొన్ని మూడో దశ ట్రయల్స్‌ కూడా పూర్తి చేసుకోగా, మరికొన్ని రెండో దశ ట్రయల్స్‌లో ఉన్నాయి. దేశంలోనూ వ్యాక్సిన్‌ను తయారు చేసే కసరత్తు జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా వ్యాక్సిన్‌ను వేగంగా అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే టీకా సామర్థ్యంపై అందరిలోనూ చర్చ జరుగుతోంది. వైద్య నిపుణులు కూడా వాటి సమర్థతను పరిశీలిస్తున్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్న ప్రతి ఒక్కరూ ఎలాంటి దుష్ప్రభావాలకు గురికాకుండా ఉన్నప్పుడే అది నిజమైన వ్యాక్సిన్‌ అవుతుందని అంటున్నారు.

అయితే ఏ కంపెనీ వ్యాక్సిన్‌కు కూడా ఇప్పటివరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) క్లీన్‌చిట్‌ ఇవ్వలేదని అంటున్నారు. వ్యాక్సిన్‌ సమర్థతే కరోనాకు అడ్డుకట్టగా చెబుతున్నారు. విచిత్రమేంటంటే కొన్ని వ్యాక్సిన్లు మన దేశంలో నిల్వ చేసే పరిస్థితి కూడా లేకపోవడం గమనార్హం. ఫైజర్‌ వ్యాక్సిన్‌ను మైనస్‌ 70 డిగ్రీల వద్ద నిల్వ ఉంచాలి. దేశంలో అంతటి తక్కువ ఉష్ణోగ్రతలో నిల్వ చేసే సామర్థ్యం లేదు. కేవలం రీసెర్చ్‌ లేబొరేటరీల్లో మాత్రమే ఆ వసతి ఉంది. రష్యా తయారు చేసిన స్పుత్నిక్‌ సహా ఆక్స్‌ఫర్డ్‌ వంటి కొన్ని వ్యాక్సిన్లు సాధారణ రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయడానికి వీలుందని నిపుణులు చెబుతున్నారు.‍(చదవండి: 15 నిమిషాల నడక.. లక్ష కోట్ల డాలర్ల ఆదా)

ఎంత సామర్థ్యముంటే అంత మంచిది..
వ్యాక్సిన్‌ సామర్థ్యం ఎంత ఉంటే అంత మంచిది. 80 శాతం సామర్థ్యమంటే వంద మందిలో 80 మందిపై వ్యాక్సిన్‌ ప్రభావం చూపించినట్లుగా అర్థం చేసుకోవాలి. అంటే వారిలో యాంటీబాడీలు తయారై కరోనా వైరస్‌ను అడ్డుకునే శక్తి వచ్చినట్లుగా గుర్తించాలి. ఇక మిగిలిన 20 మందిలో యాంటీబాడీలు తయారు కావని అర్థం. ఇప్పటివరకు ఫైజర్, ఆక్స్‌ఫర్డ్‌ టీకాలు ఫేజ్‌ 3 ట్రయల్స్‌ పూర్తి చేసుకున్నాయి. ఫేజ్‌ 4 ట్రయల్స్‌ అంటే పోస్ట్‌ మార్కెట్‌ ట్రయల్స్‌ అన్నమాట. మార్కెట్లోకి వచ్చాక చేస్తారు. ఎంతమందికి యాంటీబాడీలు వచ్చాయనేది నిర్ధారణకు వస్తారు. 90 శాతంపైగా వ్యాక్సిన్‌ పనిచేస్తేనే బాగా సామర్థ్యమున్నట్లు లెక్క..
– డాక్టర్‌ రాకేశ్‌ కలపాల,గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, ఏఐజీ

వ్యాక్సిన్ల పనితీరుపై పూర్తి డేటా లేదు.. 
వ్యాక్సిన్‌ 90 శాతం పైగా ప్రభావం చూపగలిగితే దాన్ని సరైన వ్యాక్సిన్‌గా భావించవచ్చు. వ్యాక్సిన్‌ వేశాక శరీరంలో యాంటీబాడీలు, టీ సెల్స్‌ తయారవుతాయి. ఇవి కరోనా వైరస్‌ దాడి చేయకుండా కాపాడుతాయి. హెర్డ్‌ ఇమ్యూనిటీ రావాలంటే 60 నుంచి 70 శాతం మందికి వ్యాక్సిన్‌ వేస్తే సరిపోతుంది. ఇప్పటివరకు తయారుచేసిన వ్యాక్సిన్ల డేటా కొద్ది మొత్తంలోనే అందుబాటులో ఉంది. 70 శాతం ఉన్నవాటి సామర్థ్యం ఇంకా పెంచాల్సి ఉంది. పైగా వ్యక్తిగతంగా రోగ నిరోధక శక్తి కూడా రావాలి. ఇప్పటివరకు తయారైన వ్యాక్సిన్లు ఏ మేరకు పని చేస్తాయన్న విషయంలో పూర్తి స్థాయి డేటా లేదు. అనేక కంపెనీల వ్యాక్సిన్లకు సంబంధించి వాటి ఉపయోగం, దుష్పరిణామాలకు సంబంధించిన డేటా వెల్లడి కావాల్సి ఉంది. అందువల్ల ఇప్పటివరకు డబ్ల్యూహెచ్‌వో ఏ వ్యాక్సిన్‌నూ ఆమోదించలేదు. ఎబోలా వ్యాక్సిన్‌ బయటకు రావడానికి చాలా సమయం పట్టింది. అనేక కఠిన పరీక్షలు జరిగాయి. సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా ఉంటేనే సరైన వ్యాక్సిన్‌ అవుతుంది. అందువల్ల వ్యాక్సిన్‌ విషయంలో హడావుడి మంచిది కాదు. వ్యాక్సిన్‌ పనితీరుపై స్పష్టత వచ్చే వరకు మాస్కే సూపర్‌ వ్యాక్సిన్‌..
– డాక్టర్‌ మధు మోహన్‌రావు,హెడ్, పరిశోధన అభివృద్ధి విభాగం, నిమ్స్‌

వ్యాక్సినే ఉత్తమ పరిష్కారం..
అందరికీ హెర్డ్‌ ఇమ్యూనిటీ రావడానికి చాలా సమయం పడుతుంది. ఇప్పటికీ ప్రపంచంలో కోవిడ్‌ ఇన్‌ఫెక్షన్లు పది శాతానికి మించలేదు. కాబట్టి అందరికీ రోగనిరోధక శక్తి వచ్చే లోపు మొదట వచ్చిన వారు రిస్క్‌లో పడతారు. అందువల్ల వ్యాక్సిన్‌తో మాత్రమే స్వల్ప వ్యవధిలో హెర్డ్‌ ఇమ్యూనిటీని సాధించగలం. ఇప్పటివరకు మానవాళిపై విజృంభించిన పలు వైరస్‌లు మన ప్రయత్నం లేకుండా స్వయంగా నిర్వీర్యం కావడానికి సమయం తీసుకున్నాయి. 1914లో వచ్చిన స్పానిష్‌ ఫ్లూ మూడేళ్ల పాటు ప్రపంచాన్ని వణికించింది. కాబట్టి వైరస్‌ స్వభావం మారే వరకు వేచిచూడటం అంటే భారీ మూల్యం చెల్లించాలి. డబ్ల్యూహెచ్‌వో ప్రకారం 70 శాతంపైగా సామర్థ్యమున్న వాటిని మంచి వ్యాక్సిన్లని చెప్పింది. 50 శాతాన్ని కటాఫ్‌గా పెట్టింది. స్వల్పకాలంలో హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించాలంటే మాత్రం వ్యాక్సిన్‌ సామర్థ్యం 70 శాతానికి మించాలి.
– డాక్టర్‌ కిరణ్‌ మాదల,క్రిటికల్‌ కేర్‌ విభాగాధిపతి, నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజీ

మరిన్ని వార్తలు