కోవిడ్‌ టీకా.. ఏడాదికి ఒకటా?

11 Aug, 2020 04:10 IST|Sakshi

త్వరలో వ్యాక్సిన్‌ అంటున్ననేపథ్యంలో కొత్త సందేహాలు

ఫ్లూ వైరస్‌ తరహాలోనే ఇది జీవితాంతం పనిచేయదనే అనుమానాలు

కరోనా వైరస్‌లో మార్పులు ఎక్కువగా ఉండటమే కారణం

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం ప్రపంచమంతా కోవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది. ఇదిగో వ్యాక్సిన్‌ అదిగో వ్యాక్సిన్‌ అంటూ వివిధ దేశాల్లోని పరిశోధన సంస్థలు చేస్తున్న ప్రకటనలతో సామాన్య జనంలో ఆశలు చిగురిస్తున్నాయి. అయితే, ఆ వచ్చే వ్యాక్సిన్‌ జీవితకాలం ఎంత అనే విషయంలోనే ఇప్పుడు కొత్త వాదన తెరపైకి వచ్చింది. దాని శక్తి ఒక ఏడాదికే పరిమితమైనా ఆశ్చర్యపోనవసరంలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

వేగంగా రూపాంతరంతో..
కోవిడ్‌–19 విషయంలో ఆది నుంచీ అంతా గందరగోళమే కనిపిస్తోంది. ఇప్పటికీ ఆ వైరస్‌ తీరుతెన్నులూ పూర్తిగా స్పష్టంకాలేదు. ఇలాంటి సమయంలో దాన్ని నిరోధించే వ్యాక్సిన్‌ విషయంలో ఇతమిత్థ సమాచారం అంటూ ఏమీ లేదు. కానీ గతంలో ఉన్న అనుభవాల నేపథ్యంలో ఇలాంటి అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. సాధారణంగా వ్యాక్సిన్‌ అంటే జీవితకాలం పనిచేస్తుందనే భావన ఉంటుంది. కానీ ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ విషయంలో ఈ అభిప్రాయం మారిపోయింది. అత్యంత వేగంగా రూపాంతరం చెందే లక్షణం ఉండటమే ఇందుకు కారణం. ఇన్‌ఫ్లూయెంజాకు 1930లోనే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. కానీ 1990 తర్వాతే అన్ని దేశాల్లో విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. ఈ వ్యాక్సిన్‌ ఓసారి తీసుకుంటే ఇక జీవితాంతం ఫ్లూ బారిన పడకుండా నిశ్చింతగా ఉండొచ్చనే భరోసా మాత్రం లేకుండా పోయింది.

ఈ ఫ్లూ వైరస్‌ అత్యంత వేగంగా మార్పు చెందుతుండటంతో ప్రతి సంవత్సరం శాస్త్రవేత్తలు వ్యాక్సిన్‌ను అందుకు తగ్గట్టుగా మార్పు చేయాల్సి వస్తోంది. ఫలితంగా ప్రతి ఏటా ఈ వ్యాక్సిన్‌ వేయించుకోవాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కోవిడ్‌కు అందుబాటులోకి వచ్చే వ్యాక్సిన్‌ కూడా ఇలా తరచూ వేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనాలో పుట్టిన కోవిడ్‌–19 వైరస్‌ ప్రభావం వేర్వేరు దేశాల్లో వేర్వేరుగా ఉంటోంది. ఒకే దేశంలో నెలలు గడిచేకొద్దీ దానిలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫ్లూ వైరస్‌ అంత వేంగంగా ఆ మార్పులు లేకున్నా, వైరస్‌ మాత్రం రూపాంతరం చెందుతోందని అంటున్నారు. దీంతో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినా.. వైరస్‌ మారితే అది పనిచేసే అవకాశం ఉండదు. అప్పుడు వ్యాక్సిన్‌లో మార్పులు అవసరమవుతాయి.

ప్రతి ఏటా ఫ్లూ వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిందే..
నేను ప్రతి సంవత్సరం అమెరికా వెళ్తుంటాను. అక్కడ ఫ్లూ ప్రభావం ఎక్కువ. ప్రతి ఏటా దాదాపు 20వేల మం ది చనిపోతారు. వైరస్‌లో మార్పుల వల్ల ప్రతి సంవత్సరం కొత్త వ్యాక్సిన్‌ వస్తోంది. అందుకే ప్రతి సంవత్సరం ఆ వ్యాక్సిన్‌ తీసుకుంటున్నా. ఈసారి కోవిడ్‌ ప్రభావంతో అమెరికా వెళ్లలేదు. అయినా పక్షం రోజుల క్రితం వ్యాక్సిన్‌ తీసుకున్నాను. ఫ్లూ వైరస్‌ సోకకుండా ఉండాలంటే ప్రతి సంవత్సరం ఆ వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిందే. – డాక్టర్‌ రాజారెడ్డి, నిమ్స్‌ విశ్రాంత డైరెక్టర్‌ 

>
మరిన్ని వార్తలు