పాఠశాలల్లో పెరుగుతున్న కరోనా కేసులు

8 Sep, 2021 02:15 IST|Sakshi

మల్లంపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో 11 మందికి పాజిటివ్‌ 

నిర్మల్‌లోని పాఠశాలలో ముగ్గురికి, మహబూబాబాద్‌ జిల్లాలో ఓ ఉపాధ్యాయుడికి కరోనా

ములుగు రూరల్‌/లోకేశ్వరం(ముధోల్‌)/కురవి/అమరచింత: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కోవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. ములుగు, నిర్మల్, మహబూబాబాద్‌ జిల్లాల్లోని పాఠశాలలకు చెందిన పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు. ములుగు జిల్లా మల్లంపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం నలుగురు ఉపాధ్యాయులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో పాఠశాలలో మంగళవారం వైద్యసిబ్బంది కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా మరో ఉపాధ్యాయురాలికి, ఆరుగురు విద్యార్థులకు పాజిటివ్‌గా తేలింది.

నిర్మల్‌ జిల్లా లోకేశ్వరం మండలం హవర్గ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మంగళవారం 63 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం మోద్గులగూడెం జెడ్పీ హైస్కూల్‌లో ఓ ఉపాధ్యాయుడు సోమవారం కరోనా బారిన పడ్డారు. దీంతో స్కూల్‌లో ఇతర ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులకు మంగళవారం పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్‌ వచ్చింది. పాజిటివ్‌ కేసులు నమోదైన పాఠశాలల్లో పంచాయతీ సిబ్బంది శానిటైజేషన్‌ పనులు నిర్వహించారు.

పాజిటివ్‌ వచ్చిందని వదంతులు 
వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సోమవారం 190 మంది విద్యార్థులకు కరోనా ర్యాపిడ్‌ టెస్టులు చేశారు. అయితే వారిలో ఆరుగురికి పాజిటివ్‌గా వచ్చిందని, విషయాన్ని విద్యాశాఖ, ఆరోగ్యశాఖ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారనే వదంతులను సోషల్‌ మీడియాలో కొందరు పోస్టు చేశారు.

అవి వైరల్‌ కావడంతో మిగతా విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రుల్లో కలవరం మొదలైంది. కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌భాష ఆదేశాలతో డీఈఓ రవీందర్‌ మంగళవారం పాఠశాలకు చేరుకుని ఆ విద్యార్థులకు మరోసారి ర్యాపిడ్‌ టెస్టులతో పాటు ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు చేయించారు. వారికి నెగెటివ్‌ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.   

మరిన్ని వార్తలు