ఆక్సిజన్‌ పైపులేశారు.. వదిలేశారు.. 

11 Aug, 2021 04:03 IST|Sakshi

ఇదీ ఆర్టీసీ ఆసుపత్రిలో కోవిడ్‌ సెంటర్‌ పరిస్థితి

200 పడకల సామర్థ్యంతో ఏర్పాటుకు నిర్ణయం

కోవిడ్‌ కేసులు తగ్గటంతో నిర్లక్ష్యం..

సిబ్బంది విరాళంతో పూర్తి చేయాలని సంకల్పం

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ ప్రధాన ఆసుపత్రిలో కోవిడ్‌ సెంటర్‌ ఏర్పాటు పనులను గాలికొదిలేశారు. కోవిడ్‌ రెండో వేవ్‌ సమయంలో ఆర్టీసీ ఉద్యోగులు దాదాపు 4 వేల మంది వ్యాధి బారినపడి, 120 మంది వరకు చనిపోయారు. ఈ నేపథ్యంలో 200 పడకల సామర్థ్యంతో కరోనా సెంటర్‌ను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వైద్య, ఆరోగ్య శాఖలోని మౌలిక వసతుల కల్పన సంస్థ హడావుడిగా ఆక్సిజన్‌ పైప్‌లైన్‌ ఏర్పాటు పనులను కొంతమేర పూర్తి చేసింది. ఈలోపు కోవిడ్‌ కేసులు తగ్గడంతో ఆసుపత్రి వైపు కన్నెత్తి చూడలేదు. త్వరలో మూడో వేవ్‌ వచ్చే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఆర్టీసీ సిబ్బందిలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మూడో వేవ్‌ వరకైనా కోవిడ్‌ సెంటర్‌ సిద్ధమవుతుందని భావించారు. మొదటి రెండు దశల్లో పడకలు దొరక్క ఆర్టీసీ ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలోనే ఉద్యోగులు తమ ఆసుపత్రిలో కోవిడ్‌ సెంటర్‌ కోసం గళమెత్తారు. అయితే కోవిడ్‌ కేంద్రం పనులు చేసినట్లే చేసి మధ్యలోనే గాలికొదిలేశారు. 

ఆశలు వదులుకుని సొంతంగా..
రూ.2 కోట్లు నిధులు కేటాయిస్తే తామే పనులు చేసుకుంటామని ఆర్టీసీ ఆస్పత్రి అధికారులు వైద్య, ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ చుట్టూ తిరిగినా ప్రయో జనం లేకుండా పోయింది. దీంతో సొంతంగా విరాళాలు సేకరించటం, స్వచ్ఛంద సంస్థలను కోరి కొన్ని పనులు పూర్తి చేయించుకునేలా నడుం బిగించారు. హైదరాబాద్‌ రీజియన్‌కు చెం దిన డీవీఎంలు, డిపో మేనేజర్లు, అసిస్టెంట్‌ మేనేజర్‌ స్థాయి అధికారులు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు విరాళాలిచ్చారు. వాటితో 50బెడ్ల ఏర్పాటుకు పనులు ప్రారంభించారు. నిర్మాణ్‌ అనే సంస్థ 10 లీటర్ల సామర్థ్యమున్న 25 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను ఇచ్చింది. సెర్చ్‌ ఇంపాక్ట్‌ ఫౌండేషన్‌ తరఫున ఓ ప్రతినిధి 40 సాధారణ పడకలు, 10 ఫౌలర్‌ బెడ్లు, సైడ్‌ టేబుల్స్, ఐవీ ఫ్లూయిడ్‌ స్టాండ్లు, స్టెతస్కోపులు అందజేశారు. రాజ్‌భవన్‌ రోడ్డులో ఉన్న మరో సంస్థను కూడా సంప్రదించి పెద్ద ఆక్సిజన్‌ సిలిండర్ల కోసం చర్చిస్తున్నారు. 

వంద ఇస్తే చాలు.. 
ఆర్టీసీలో 45 వేల మంది ఉద్యోగులున్నారు. వీరంతా నెలకు రూ.100 చొప్పున చెల్లిస్తే ప్రతినెలా రూ.45 లక్షలు సమకూరుతాయి. అలా 4 నెలలు ఇస్తే కోవిడ్‌ సెంటర్‌ ఏర్పాటుకు ఇతరులపై ఆధారపడాల్సిన పని ఉండదు. ప్రతినెలా వసూలయ్యే మొత్తంతో అప్పటికప్పుడు కావాల్సిన ఏర్పాట్లు చేసుకునేందుకు వీలు పడుతుంది. తొలుత 50 బెడ్ల సామర్థ్యంతో ప్రారంభించి క్రమంగా పెంచు కుంటూ పోవాలని అధికారులు భావిస్తున్నారు. గతంలో హన్మకొండలో ఆర్టీసీ డిస్పెన్సరీని ఇలాగే ఉద్యోగుల విరాళంతో ఏర్పాటు చేశారు. తక్కువ విరాళంతో ప్రతినెలా ఓ బస్సు చొప్పున కొని నడిపిన ఉదంతాలున్నాయి.

కావాల్సినవి ఇవి.. 
పూర్తయిన ఆక్సిజన్‌ పైపులైన్‌కు ఆక్సిజన్‌ సిలిండర్లు అమర్చాలి. 
200 పడకలకు 45 లీటర్ల సామర్థ్యం ఉన్న 600 సిలిండర్లు. 
ఒక్కో సిలిండర్‌ ధర రూ.22 వేల వరకు ఉందని అధికారులు తేల్చారు. అంటే వీటికే రూ.1.32 కోట్లు అవసరం.  
ఐసీయూకు సంబంధించిన పరికరాలు కావాలి.  
7 వెంటిలేటర్లు. అంబులెన్సు, మందులు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు