పోస్ట్‌ కోవిడ్‌లో కొత్తరకం సమస్య.. ‘వైరల్‌ ఆర్‌థ్రాల్జియా’

15 Jun, 2021 07:15 IST|Sakshi

‘సాక్షి’ ఇంటర్వ్యూలో ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యుడు డాక్టర్‌ దశరథరామారెడ్డి తేతలి

సాక్షి, హైదరాబాద్‌:  కోవిడ్‌ బారినపడి కోలుకున్న వారిలో కీళ్లు, కండరాల నొప్పులు పెరగడం తెలిసిన విషయమే. తాజాగా కీళ్లు, కీళ్ల నరాలకు సంబం ధించిన కొన్ని తీవ్రమైన సమస్యలు సైతం వెలుగు చూస్తున్నాయి. ‘వైరల్‌ ఆర్‌థ్రాల్జియా’, ‘అవాస్క్యులర్‌ నెక్రోసిస్‌’ అనేవి వీటిలో ప్రధానమైనవిగా వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా చికున్‌ గున్యా, డెంగీ జ్వరాలలో వచ్చే వైరల్‌ ఆర్‌థ్రా ల్జియా’ సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ సోకి కోలుకున్న చాలా మందిలో బయటపడినట్లు చెబుతున్నారు. 2,3 నెల లు దాటినా ఈ సమస్య నుంచి పలువురు పేషెంట్లు బయట పడలేకపోతున్నారని అంటున్న ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యులు డాక్టర్‌ దశరథరామా రెడ్డి తేతలితో ‘సాక్షి’ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు 

అసలు వైరస్‌ సోకినవారిలో ఆర్థరైటిస్‌ సమస్యలు రావడానికి కారణాలేంటి? 
శరీరంలో వైరస్‌కు, యాంటీబాడీస్‌కు మధ్య జరిగే పోరాటంలో కొన్ని విషతుల్య పదార్థాలు (టాక్సిన్స్‌) వల్ల కీళ్లు, కండరాల సమస్యలు వస్తు న్నాయి. ఇవి తాత్కాలికంగానే ఉంటున్నాయి తప్ప పర్మినెంట్‌గా ఉండడం లేదు. అయితే దీనివల్ల ఇన్‌ఫ్లమేషన్‌ పెరుగుతున్నందున యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందులు తీసుకోవాలి. క్లోరోక్విన్, ఒమెగా త్రీ ఫాటీయాసిడ్స్, కాల్షియం, విటమిన్‌–డి సప్లిమెంట్లు తీసుకోవాలి. వీటితో పాటు ఫిజియోథెరపీ, వ్యాయామాలు చేయాలి.  

ఆర్థోపెడిక్‌ సంబంధిత సమస్యల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? 
తేలికపాటి వ్యాయామాలతో మొదలుపెట్టి నడక, ఆసనాలు, యోగా, ప్రాణాయామం వంటివి పెంచాలి. ఎముకలు బలంగా ఉండడానికి కాల్షియం, జింక్‌. విటమిన్‌ బీ 12, ఇతర విటమిన్‌ సప్లిమెంట్లు తీసుకోవాలి. పారాసిటమల్, హైడ్రాక్సిక్లోరోక్విన్, జాయింట్‌ లూబ్రికెంట్లు వాడాలి. ఉప్పు వేసిన గోరు వెచ్చని నీటిలో కాళ్లు, చేతులు పావుగంట పాటు ఉంచాలి. స్ట్రెస్‌ బస్టర్‌ హ్యాపీ బాల్‌ను కొంత సమయం దాకా నొక్కుతూ ఉంటే ఉపశమనం లభిస్తుంది.   

పిల్లల విషయంలో జాగ్రత్తలు మరిన్ని అవసరమా? 
థర్డ్‌వేవ్‌ గురించి ముందు నుంచే జాగ్రత్త పడాలి. మరో ఐదారు నెలల పాటు పిల్లలు అందరితో కలిసి పోకుండా చూడాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న పెద్దల వద్దకు వైరస్‌ సోకిన పిల్లలు వెళ్లకుండా చూడాలి. వారు ఇంట్లోనే ఆట పాటలు, ఇతర అభిరుచుల్లో నిమగ్నమయ్యేలా చేయాలి. 

కోవిడ్‌ టీకాల పరిస్థితి ఏమిటి? 
హెచ్‌ఐవీ కేసులు బయటపడి 35 ఏళ్లు గడిచినా ఇంకా దాని నిరోధానికి కచ్చితమైన టీకాను కనుక్కో లేకపోయారు. కోవిడ్‌ మహమ్మారి విషయంలో కొంతలో కొంత నయం. దానికి టీకా కనిపెట్టడంతో పాటు చాలా మందికి అందుబాటులోకి వచ్చింది. వైరస్‌ను ఎదుర్కొనేందుకు వీలవుతోంది. కరోనా మ్యుటెంట్లు, వేరియెంట్లు పెరగడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి.  

వైరల్‌ ఆర్‌థ్రాల్జియా అంటే ఏమిటి?
పాదాలు, చేతుల్లో ఉండే కణుపుల వద్ద, చిన్న కీళ్ల వద్ద వచ్చే నొప్పుల్ని వైరల్‌ ఆర్‌థ్రాల్జియాగా వ్యవహరిస్తున్నారు. కోవిడ్‌ వైరస్‌ ఇన్ఫెక్షన్‌ ప్రవేశించాక దాని యాంటీజెన్‌కు– శరీరంలోని రోగనిరోధకశక్తి(టీ–బాడీ)తో జరిగే ఘర్షణలో ఉత్పత్తి అయ్యే టాక్సిన్స్‌.. పాదాలు, చేతుల్లో ఉండే చిన్న చిన్న కణుపుల్లోని లేత కొబ్బరిలాంటి పదార్థాన్ని (సైనోవియం), సున్నితమైన ఇతర భాగాలను పాడుచేస్తున్నాయి. దీంతో అక్కడ వాపు ఏర్పడి కీళ్లు కదిలించినపుడు నొప్పి వస్తుంది. కొంగర్లు పోతాయి. రుమాటైడ్‌ ఆర్థరైటిస్, గౌట్‌ ఆర్థరైటిస్‌కు గురైనప్పుడు మాదిరిగా కాలి వేళ్లను ఆడించలేరు. నడవలేరు. ఇదొక కొత్తవ్యాధి అయినందున లక్షణాలను కూడా పూర్తిగా వివరించే పరిస్థితి లేదు. 

స్టెరాయిడ్స్‌ అధికంగా తీసుకుంటే హిప్‌ జాయింట్స్‌ దెబ్బతింటాయా?
సెకండ్‌వేవ్‌లో స్టెరాయిడ్స్‌ అధిక వినియోగం వల్ల సమస్యలు ఎక్కువయ్యాయి. జిల్లా, గ్రామ స్థాయిల్లో ఆర్‌ఎంపీ ఇతర వైద్యులు ఈ మం దులు అంతగా అవసరం లేకపోయినా పేషెంట్లకు ఇచ్చేస్తున్నారు. ఇవి హాని చేస్తున్నాయి. కోవిడ్‌ సమయంలో స్టెరాయిడ్స్‌ అధిక వినియోగం, తర్వాత ఎక్కువగా మద్యం తీసుకోవడం వల్ల తుంటి జాయింట్లు (హిప్‌ జాయింట్లు) దెబ్బతింటున్నాయి. దీనినే ‘అవాస్క్యులర్‌ నెక్రో సిస్‌’ అంటారు.

దీనివల్ల తుంటిలో ఉండే బాల్‌కి రక్త ప్రసరణ తగ్గిపోతుంది. కరోనా నుంచి కోలుకున్న వారికి తుంటినొప్పి వస్తే వెంటనే ఎముకల డాక్టర్లను సంప్రదించాలి. కోవిడ్‌ తగ్గిన వారు మద్యపానం ఆపకపోతే సమస్యలు తీవ్రరూపం దాలుస్తాయి. స్టెరాయిడ్స్‌ వాడకం వల్ల అప్పటికే ఎముకలు కొంత చచ్చుపడతాయి, దానికి మద్యపానం కూడా తోడైతే సమస్య ముదురుతుంది. సుదీర్ఘకాలం పాటు శరీరాన్ని అలసట, నిస్సత్తువ ఆవరించి ఏ పనీ చేయలేకపోడం, అధిక సమయం నిద్రపోవడం (క్రానిక్‌ ఫెటిగ్‌ సిండ్రోమ్‌ లేదా ఫైబ్రో మయాల్జియా) వంటి సమస్యలు కూడా వస్తున్నాయి.
చదవండి: కరోనాపై తాజా హెచ్చరిక.. అప్రమత్తం

>
మరిన్ని వార్తలు