కోవిడ్‌ సెకండ్ వేవ్‌.. కుదేలవుతున్న క్యాబ్‌లు!

12 Apr, 2021 08:10 IST|Sakshi

కోవిడ్‌ రెండో దశ ఉద్ధృతితో కుదేలు 

ట్రావెల్స్‌ వాహనాలపైనా ప్రభావం 

గ్రేటర్‌లో 80 వేల నుంచి 50 వేలకు పడిపోయిన క్యాబ్స్‌ 

పెరుగుతున్న వ్యక్తిగత వాహనాల వినియోగం 

వేల సంఖ్యలో ఉపాధి కోల్పోయిన డ్రైవర్లు 

సాక్షి, సిటీబ్యూరో: ఏడాదికి పైగా ప్రజారోగ్యంపై పడగ నీడలా మారిన మహమ్మారి కోవిడ్‌ జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. గతేడాది విజృంభించిన వైరస్‌ బారినుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న వ్యవస్థలు తిరిగి కుదేలవుతున్నాయి. చాపకింద నీరులా విస్తరిస్తున్న కోవిడ్‌ రెండో దశ ఉద్ధృతి అన్ని రంగాలను ప్రభావితం చేస్తోంది. గత సంవత్సరం కోవిడ్‌ కారణంగా కుదేలైన ప్రజారవాణా వ్యవస్థలు తిరిగి కోలుకుంటున్న తరుణంలో ముంచుకొచ్చిన రెండో దశ మరోసారి పిడుగుపాటుగా మారింది, ప్రత్యేకించి క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లు, మినీబస్సులు, ఆటోలు తదితర వాహనాలపై ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

సుమారు 80 వేలకుపైగా క్యాబ్‌లు ఉబెర్, ఓలా తదితర క్యాబ్‌దిగ్గజ సంస్థలకు అనుసంధానమై తిరుగుతుండగా, గత నెల రోజులుగా 50 వేలకు పడిపోయినట్లు అంచనా. ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టడం, రాత్రింబవళ్లు పడిగాపులు కాసినా కనీస ఆదాయం లభించకపోవడంతో  చాలా మంది డ్రైవర్లు, వాహన యజమానులు క్యాబ్‌లను వదిలేస్తున్నారు. గత 10 రోజులుగా  క్యాబ్‌ల వినియోగం గణనీయంగా తగ్గినట్లు  తెలంగాణ క్యాబ్స్, ట్యాక్సీ డ్రైవర్స్‌ జేఏసీ చైర్మన్‌  షేక్‌ సలావుద్దీన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్‌కు ముందు వేలాది మందికి ఉపాధినిచ్చిన క్యాబ్‌లు ఇప్పుడు భారంగా మారినట్లు పేర్కొన్నారు.  

ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు తగ్గిన బుకింగ్‌లు.. 
పెళ్లిళ్లు, వేడుకలు, సామూహిక ఉత్సవాలు వంటి వివిధ కార్యక్రమాల కోసం హైదరాబాద్‌ నుంచి రాకపోకలు సాగించే ట్రావెల్స్‌ వాహనాల బుకింగ్‌లు కూడా తగ్గుముఖం పట్టాయి. 8 సీట్లు, 10 సీట్లతో నడిచే మ్యాక్సీ క్యాబ్‌లు, 14 నుంచి 22 సీట్ల వరకు ఉండే మినీ బస్సులకు  డిమాండ్‌ తగ్గినట్లు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ నిర్వాహకులు పేర్కొన్నారు.  
మే నెల వరకూ పెళ్లిళ్ల ముహూర్తాలు లేకపోవడంతో వాహనాలకు డిమాండ్‌ కనిపించడం లేదు. ముఖ్యంగా పర్యాటక రంగం చాలా వరకు దెబ్బతిన్నది. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే సందర్శకుల తగ్గిపోయింది. కోవిడ్‌కు ముందు ప్రతిరోజూ సుమారు 50 వేలమందికి పైగా వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు నగర సందర్శన కోసం వచ్చేవారు. ఏడాదికిపైగా అంంతర్జాతీయ రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ వివిధ రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చే వారి సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతుండగా కోవిడ్‌ రెండో దశ ఉప్పెనలా వచ్చిపడింది. దీంతో బుకింగ్‌లపై ప్రభావం పడినట్లు ట్రావెల్స్‌ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

తెరుచుకోని ఐటీ రంగం.. 
గతేడాది ఐటీ సంస్థలు లాక్‌డౌన్‌ విధించాయి. సాఫ్ట్‌వేర్‌ నిపుణులు చాలా వరకు ఇంటి నుంచే పని చేస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి హైటెక్‌ సిటీకి, ఐటీ ప్రాంతాలకు రోజుకు 10,వేలకుపైగా క్యాబ్‌లు రాకపోకలు సాగించేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. క్యాబ్‌లు చాలా వరకు సాధారణ రాకపోకలపై మాత్రమే ఆధారపడి తిరుగుతున్నాయి. కానీ ప్రస్తుత రెండో దశ దృష్ట్యా అత్యవసర పరిస్థితిల్లో మాత్రమే నగర వాసులు క్యాబ్‌లు  వినియోగిస్తున్నారు.  
 ఇదే సమయంలో వ్యక్తిగత వాహనాల వినియోగం పెరిగింది. కోవిడ్‌ దృష్ట్యా గతేడాది నుంచి ఎక్కువ మంది వ్యక్తిగత వాహనాలపైనే ఆధారపడ్డారు. గత నవంబర్‌ నుంచి ఈ ఏడాది  ఫిబ్రవరి, మార్చి రెండో వారం వరకు  ప్రజారవాణా వాహనాలకు డిమాండ్‌ కనిపించింది. కానీ ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది.    

మరిన్ని వార్తలు