ఏందీ కిరికిరి: ఒకటి పాజిటివ్‌.. మరొకటి నెగిటివ్

23 Mar, 2021 08:23 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

యాంటిజెన్‌ టెస్టులో 40 మందికి పాజిటివ్‌.. 

ఆర్టీపీసీఆర్‌లో ఇద్దరికి మినహా అందరికీ నెగిటివ్‌ 

ప్రశ్నార్థకంగా ర్యాపిడ్‌ కిట్ల నాణ్యత.. 

తప్పడు రిపోర్ట్‌లతో తప్పని తలనొప్పి 

గ్రేటర్‌లో అనూహ్యంగా పెరిగిన పాజిటివ్‌ కేసులు 

ఆందోళనలో సిటీజనులు 

బోయిన్‌పల్లి గిరిజన సంక్షేమ వసతిగృహానికి చెందిన ఓ పదో తరగతి విద్యార్థి అకస్మాత్తుగా జ్వరం, ఆయాసంతో బాధపడుతుండటంతో అనుమానం వచ్చి శనివారం ఉదయం కోవిడ్‌ టెస్ట్‌ చేయించగా, పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆ విద్యార్థికి సన్నిహితంగా ఉన్న హాస్టల్లోని మరో 103 మంది విద్యార్థులు, హాస్టల్‌ సిబ్బందికి అదే రోజు ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు చేశారు. వీరిలో 36 మంది విద్యార్థులు సహా నలుగురు సిబ్బందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆ తర్వాత అదే రోజు వారందరికీ ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయించగా, వీరిలో పదో తరగతి విద్యార్థి(16), ఒక వర్కర్‌(55) మినహా మిగిలిన వారందరికీ నెగిటివ్‌ వచ్చింది. దీంతో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ కిట్ల నాణ్యత, పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి 

సాక్షి, సిటీబ్యూరో: కరోనా వైరస్‌ నిర్ధారణ కోసం ప్రభుత్వం సరఫరా చేసిన ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టు కిట్ల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. దగ్గు, జలుబు, జ్వరం, ఒంటి నొప్పులు, ఆయాసం వంటి లక్షణాలతో బాధపడుతూ వైరస్‌ నిర్ధారణ కోసం వచ్చిన బాధితులకు చుక్కలు చూపిస్తున్నారు. వైరస్‌ లేనివారికి ఉన్నట్లు...ఉన్న వారికి లేనట్లు రిపోర్టులు వస్తుండటంతో ఇటు వైద్యులే కాకుండా అటు బాధితులు ఆందోళన చెందుతున్నారు. బోయిన్‌పల్లి గిరిజన సంక్షేమ వసతి గృహం విద్యార్థులకు నిర్వహించిన యాంటిజన్‌ టెస్టులు, జారీ చేసిన రిపోర్టులే ఇందుకు నిదర్శనం. తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల సంస్థలో పనిచేస్తున్న కొంత మంది అధికారులు కమీషన్లకు కక్కుర్తి పడి నాణ్యతను పరిశీలించకుండా నాసిరకం కిట్లను కొనుగోలు చేయడమే ఇందుకు ప్రధాన కారణమని పలువురు సీనియర్‌ వైద్యులు ఆరోపిస్తున్నారు. వైరస్‌ విస్తరణకు ఈ తప్పుడు రిపోర్టులు కూడా ఓ కారణమని చెబుతున్నారు. 

ప్రశ్నార్థకంగా ర్యాపిడ్‌ కిట్ల నాణ్యత.. 
నిజానికి కోవిడ్‌ నిర్ధారణలో ఆర్టీపీసీఆర్‌ను గోల్డెన్‌ స్టాండర్డ్‌గా భావిస్తారు. ఇందులో వైరస్‌ నిర్ధారణకు 24 గంటలకుపైగా సమయం పడుతుంది. అదే ర్యాపిడ్‌ యాంటిజెన్‌లో అరగంటలోనే ఫలితం తేలుతుంది. సత్వర వైరస్‌ నిర్ధారణ, చికిత్సల కోసం ప్రభుత్వం ఈ కిట్‌ల వైపు మొగ్గుచూపింది. నగరంలో ప్రస్తుతం 20 ప్రభుత్వ, 60 ప్రైవేటు కేంద్రాల్లో ఆర్టీపీసీఆర్‌ చేస్తున్నారు. ఒక్కో సెంటర్‌లో రోజుకు సగటున 25 పరీక్షలు చేస్తుండగా, ప్రస్తుతం 404 టెస్టులకు సంబంధించిన రిపోర్టులు వెయిటింగ్‌లో ఉన్నాయి. ఇక హైదరాబాద్‌లో 97, మేడ్చల్‌లో 88, రంగారెడ్డిలో 60 పట్టణ ఆరోగ్యకేంద్రాల్లో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు చేస్తున్నారు. ఒక్కో సెంటర్‌లో రోజుకు సగటున 50 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే దగ్గు, జలుబు, జ్వరం, ఒంటి నొప్పులు, ఆయాసం వంటి కోవిడ్‌ లక్షణాలు ఉన్నవారికి ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులో నెగిటివ్‌ రావడం సహజమే. ఇలాంటి వారికి వైద్యులు ఖచ్చితత్వం కోసం ఆర్టీపీసీఆర్‌ను సిఫార్సు చేసి, ఆ రిపోర్ట్‌ ఆధారంగా వైరస్‌ను నిర్ధారిస్తారు. నిజానికి యాంటిజెన్‌లో పాజిటివ్‌ వచ్చిన వారికి ఆర్టీపీసీఆర్‌లోనూ పాజిటివ్‌ రావాలి. కానీ బోయిన్‌పల్లి గిరిజన సం క్షేమ వసతి గృహంలో నిర్వహించిన క్యాంపులో పాజిటివ్‌ వచ్చిన వారిలో, ఇద్దరికి మినహా అందరికీ ఆ తర్వాత నెగిటివ్‌ రావడం వైద్య ఆరోగ్యశాఖ అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా కిట్ల నాణ్యత ప్రశ్నార్థకంగా మార్చింది.  

ఒక్క రోజే 300కుపైగా కేసులు.. 
ఒక వైపు కిట్ల నాణ్యతపై విమర్శలు వెల్లువెత్తుతుండగా...మరో వైపు గ్రేటర్‌లో చాపకిందినీరులా వైరస్‌ విస్తరిస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు మరింత పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనం. తాజాగా సోమవారం కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఆగస్టు తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కూకట్‌పల్లి ఆరోగ్య కేంద్రం పరిధిలో 47, కుత్బుల్లాపూర్‌లో 22, సరూర్‌నగర్‌లో 27, ముసారంబాగ్‌లో 7, ముషీరాబాద్‌లో 16, గచ్చిబౌలిలో 19,  ఉప్పల్‌లో 26, అంబర్‌పేటలో 29, గోల్కొండలో 13, మేడ్చల్‌లో 25, సుభాష్‌నగర్‌లో 10, అల్వాల్‌ లో 7, మల్కజ్‌గిరిలో 27,  వనస్థలిపు రం ఏరియా ఆస్పత్రిలో 30, ఘోషామహల్‌లో 9, సనత్‌నగర్‌లో 2, మలక్‌పేట్‌లో 4, బంజారాహిల్స్‌లో 3, ఆమన్‌నగర్‌లో 3, మల్లాపూర్‌లో 3, కాప్రాలో 11, యునానీ ఆస్పత్రిలో 2 పాజిటివ్‌ కేసుల చొప్పున నమోదు కావడం గమనార్హం. ఇవేకాకుండా ప్రైవేటు డయాగ్నోస్టిక్స్‌లోనూ కేసుల సంఖ్య భారీగానే నమోదైనట్లు తెలిసింది.  

గ్రేటర్‌లో కరోనా కేసులు ఇలా.. 
తేదీ    హైదరాబాద్‌    మేడ్చల్‌    రంగారెడ్డి 
16          29            41           10 
17          35            21           12 
18          47            20           29 
19         75             32           31 
20         81             34           64 
21         91             28           37 

చదవండి: కరోనా కట్టడికి 15 రోజుల ప్రచార కార్యక్రమాలు

మరిన్ని వార్తలు