కరోనా ఎఫెక్ట్; మళ్లీ పెరుగుతున్న నిరుద్యోగం!

14 Apr, 2021 19:06 IST|Sakshi

దేశవ్యాప్తంగా 8.6 శాతానికి పెరిగిన అన్‌ ఎంప్లాయ్‌మెంట్‌

కరోనా ఎఫెక్ట్, పలుచోట్ల లాక్‌డౌన్లు, ఆంక్షలతో ఉద్యోగాల్లో కోతలు

అత్యధికంగా హరియాణాలో    28.1 %, గోవాలో 22% నిరుద్యోగం

అత్యల్పంగా అస్సాంలో 1.1, కర్ణాటకలో 1.2, తెలంగాణలో 3.8 శాతం

సీఎంఐఈ తాజా అధ్యయనంలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో నిరుద్యోగం మళ్లీ పెరుగుతోంది. నిరుద్యోగ శాతం ఏకంగా 8.6 శాతానికి చేరుకుంది. ఇందులో పట్టణ ప్రాంతాల్లో 9.81 శాతంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 8 శాతానికి పెరిగింది. కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం, పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్లు, ఆంక్షలతో ఉద్యోగాల్లో కోతలు పడుతున్నాయి. ‘సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ)’సంస్థ తాజా నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది.
 
కుదురుకునే సమయంలో మళ్లీ దెబ్బ 
కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం గతేడాది జాతీయ స్థాయిలో లాక్‌ డౌన్‌ విధించడంతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోవాల్సి వచ్చింది. లక్షల మంది వలస కార్మికులు, రోజుకూలీలు పొట్టచేతబట్టుకుని వందల కిలోమీటర్లు కాలినడకన సొంతూళ్లకు వెళ్లిన దృశ్యాలు ఇంకా కళ్లముందే ఉన్నాయి. దశలవారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో చాలా వరకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మళ్లీ లభించాయి. రెండు మూడు నెలలుగా అన్నిరంగాలు కుదురుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా సెకండ్‌ వేవ్‌ మొదలవడం ఆందోళనకరంగా మారింది.


పలు రాష్ట్రాల్లో పాక్షిక లాక్‌డౌన్లు, ఆంక్షలు, షరతులు, నైట్‌ కర్ఫ్యూలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది ఎదురైన చేదు అనుభవాలను గుర్తుకుతెచ్చుకుంటున్న వలస కూలీలు, అసంఘటిత కార్మికులు సొంతూళ్ల బాట పట్టడం మొదలైందని వార్తలొస్తున్నాయి. క్రమంగా కోవిడ్‌ కేసులు పెరుగుతుండటం వ్యాపారాలపై ప్రభావం చూపుతోంది. దీంతో ఉద్యోగాల కోత మొదలైందని సీఎంఐఈ నివేదికలో వెల్లడించింది. ఏప్రిల్‌ 11తో ముగిసిన వారాంతంతో దేశంలో నిరుద్యోగం 8.6 శాతానికి చేరుకుందని తెలిపింది. రెండు మూడు వారాల కిందటి పరిస్థితి (6.7 శాతం నిరుద్యోగం)తో పోలిస్తే.. ఒక్కసారిగా నిరుద్యోగం పెరిగిందని వెల్లడించింది. 

కీలక రాష్ట్రాల్లో ఆంక్షలతో.. 
దేశంలో ఆర్థికంగా పరిపుష్టంగా ఉండడంతోపాటు భారీగా పరిశ్రమలు, ఇతర సంస్థలున్న మహారాష్ట్ర ప్రస్తుతం కరోనా దెబ్బతో విలవిల్లాడుతోంది. దేశ వాణిజ్య రాజధానిగా ఉన్న ముంబై, పక్కనే ఉన్న నాగ్‌పూర్‌ తదితర ప్రాంతాల్లో వారాంతపు లాక్‌డౌన్, ఇతర ఆంక్షలు అమలు చేస్తున్నారు. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతోంది. అక్కడ కోవిడ్‌ వైద్య సదుపాయాల కల్పనలో ఇబ్బంది ఎదురైతే మరిన్ని ఆంక్షలు విధించక తప్పదని అధికారులు ఇప్పటికే ప్రకటించారు.

ఇలా కీలక ప్రాంతాల్లో కరోనా దెబ్బతో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలపై ప్రభావం పడుతోంది. ఇక నగరాలు, పట్టణాల్లో ఆంక్షలు, నైట్‌ కర్ఫ్యూలు ఎక్కువ కాలం కొనసాగితే మళ్లీ గ్రామాలకు రివర్స్‌ వలసలు మొదలవుతాయని బెంగళూరుకు చెందిన ఆర్థికవేత్త కునాల్‌ కుందూ చెబుతున్నారు. మళ్లీ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కల్పన అనేది సవాల్‌గా మారుతుందని అంటున్నారు.

కోటి ఉద్యోగాలు పోయాయి 
‘‘నెల నెలా జీతాలు వచ్చే ఉద్యోగాలు భారీగా కోతకు గురవుతున్నాయి. దాదాపు కోటి ఉద్యోగాల వరకు క్షీణత ఏర్పడింది. అదే సమయంలో వ్యవసాయం, ఉపాధి పనుల అవకాశాల్లో పెరుగుదల నమోదైంది. ఏప్రిల్‌ 11 నాటికి పట్టణాల్లో నిరుద్యోగం 9.81 శాతానికి చేరుకుంటే.. గ్రామీణ ప్రాంతాల్లో 8 శాతానికి చేరుకుంది. 
– మహేశ్‌ వ్యాస్, ఎండీ, సీఈవో–సీఎంఐఈ  

మరిన్ని వార్తలు