పాజిటివ్‌ బాధితుల  ‘పడక’ పాట్లు..!

15 May, 2021 15:39 IST|Sakshi

ఆస్పత్రుల్లో నిండిపోతున్న  ఐసీయూ, ఆక్సిజన్‌ బెడ్‌లు

కోవిడ్‌ బారిన పడ్డ హన్మకొండకు చెందిన రాజారావుకు నాలుగు రోజుల తర్వాత శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో సంప్రదిస్తే జనరల్‌ బెడ్‌లు తప్ప ఆక్సిజన్, ఐసీయూ బెడ్‌లు అందుబాటులో లేవు. దీంతో రాజారావు కొడుకు 60 కిలోమీటర్ల దూరాన ఉన్న తొర్రూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించాడు.  

కూకట్‌పల్లికి చెందిన జి.అనసూయకు రెండ్రోజులుగా ఆక్సిజన్‌ స్థాయిలు 91కి పడిపోయాయి. ఆక్సిజన్‌ పెట్టించాలని కుటుంబ సభ్యులు సమీపంలోని ఆస్పత్రుల్లో ప్రయత్నించినా ఎక్కడా బెడ్‌ అందుబాటులో లేదు. దీంతో దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నంలోని ఓ ఆస్పత్రిలో బెడ్‌ దొరకడంతో అడ్మిట్‌ చేశారు. రోజుకు రూ.40వేల చొప్పున బెడ్‌ చార్జీలు చెల్లిస్తున్నట్లు సమాచారం.  

సాక్షి, హైదరాబాద్‌: సెకండ్‌ వేవ్‌లో కరోనా సోకిన వారు నిర్లక్ష్యం చేస్తే తీవ్రఇబ్బందులు పడుతున్న ఘటనలు అనేకం. వైరస్‌ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే గొంతు, ఊపిరితిత్తులు, పొట్టలో తీవ్ర ప్రభావాన్ని చూపి అనారోగ్య సమస్యలను వేగంగా పెంచుతోంది. దీంతో బాధితులు ఆస్పత్రుల బాట పడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్‌ల లభ్యత ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ చెబుతున్నా.. మెరుగైన వైద్యం దొరుకుతుందన్న ఉద్దేశంతో రోగులు ముందుగా ప్రైవేట్‌ వైపు చూస్తున్నారు.

బెడ్‌ల కొరత...
రాష్ట్రంలో కోవిడ్‌ యాక్టివ్‌ కేసులు 54,832. వైద్యా రోగ్య శాఖ గణాంకాల ప్రకారం వీరిలో 28,825 (52.55 శాతం) మంది ఆస్పత్రుల్లో ఉన్నారు. ఆస్పత్రుల్లో చేరిన వారిలో 50.5 శాతం మంది ఆక్సిజన్‌ బెడ్‌లపై ఉండగా.. 29.47 శాతం మంది ఐసీయూ ల్లో ఉన్నారు. వాస్తవానికి రాష్ట్రంలోని కరోనా బెడ్‌ల సంఖ్య ప్రకారం.. యాక్టివ్‌ కేసులన్నింటిలో 96 శాతం మందిని ఆస్పత్రిలో చేర్పించొచ్చు. అంతేకాదు ఈ బెడ్‌లలో సగం ఖాళీగా ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ చెబుతోంది. కానీ ప్రైవేట్‌ ఆస్పత్రులు మాత్రం బెడ్లు ఖాళీగాలేవంటూ బాధితులను తిప్పిపంపిస్తున్నాయి. గత్యంతరంలేక కొందరు ఆక్సిజన్‌ సిలిండర్లు బుక్‌ చేసుకుని ఇంటివద్దే ఊపిరి పీలుస్తుండగా.. మరికొందరు ఆస్పత్రుల వద్దే పడిగాపులు కాస్తున్నారు. దీంతో సకాలంలో వైద్యం అందక, ప్రాణవాయువు దొరక్క మరణిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

వసతుల్లేకనే ‘ప్రైవేట్‌’కు... 
కోవిడ్‌ బారినపడుతున్న వారిలో ఎక్కువ మంది ప్రైవేట్‌ ఆస్పత్రులకే ప్రాధాన్యత ఇస్తున్నారు.  అయితే కోవిడ్‌ చికిత్స కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టిమ్స్‌ (తెలంగాణ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌)ను ఏర్పాటు చేసింది. ఇందులో పెద్ద సంఖ్యలో బాధితులు ఉన్నారు. ఆస్పత్రి ప్రారంభించి ఏడాది కావొస్తున్నా.. రక్త పరీక్ష చేసే పరిస్థితి లేదు. సమీపంలోని ఓ ప్రైవేట్‌ ల్యాబ్‌కు నమూనాలను పంపి పరీక్షలు చేయిస్తున్నారు. ఇలా సరైన వసతులు లేకపోవడంతోనే ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్తున్నట్లు పలువురు చెబుతున్నారు.

సగం బెడ్‌లు ఖాళీగా ఉన్నాయట... 
రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో పడకల లభ్యతను ప్రజలకు వివరించాలని హైకోర్టు ఆదేశించడంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా బెడ్‌ అవైలబిలిటీ డాష్‌బోర్డును ఏర్పాటు చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల వారీగా మొత్తం పడకలు, భర్తీ అయినవి, ఖాళీగా ఉన్నవి... అనే వివరాలను ప్రదర్శిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో అన్ని కేటగిరీల్లో ఉన్న బెడ్‌లు 53,782. వీటిలో 28,825 బాధితులతో భర్తీ కాగా, 24,957 బెడ్‌లు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అన్ని ఆస్పత్రుల్లోని బెడ్‌లలో 46.4 శాతం బెడ్‌లు ఖాళీగా ఉన్నట్లు డాష్‌బోర్డు సమాచారం చెబుతోంది. కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో 46.22 శాతం ఖాళీగా ఉండగా... ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 46.47 శాతం బెడ్‌లు ఖాళీగా ఉన్నట్లు వైద్య,ఆరోగ్య శాఖ ప్రకటించడం గమనార్హం.

బెడ్‌ అవైలబులిటీ డాష్‌బోర్డు ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రై వేటు ఆస్పత్రుల్లో బెడ్‌ల పరిస్థితి ఇది 
                              మొత్తం         భర్తీ        ఖాళీ         శాతం  
జనరల్‌ బెడ్‌లు... 
ప్రభుత్వ                    5,473     1,228       4,245        77.56 
ప్రైవేట్‌                      15,884    4,534     11,350        71.45 
ఆక్సిజన్‌ బెడ్‌లు.. 
ప్రభుత్వ                    7,560      5,311       2,249       29.74 
ప్రైవేట్‌                      13,425    9,257       4,168       31.04 
ఐసీయూ బెడ్‌లు 
ప్రభుత్వ                   2,170      1,636        534          24.60 
ప్రైవేట్‌                     9,270      6,859      2,411        26.00 

ఇన్ని ఆంక్షలెందుకు...? 
వైద్య,ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన డాష్‌బోర్డు సమాచారం ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో దాదాపు సగం బెడ్‌లు ఖాళీగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇంత పెద్ద సంఖ్యలో బెడ్‌లు ఖాళీగా ఉన్నప్పుడు పొరుగు రాష్ట్రాలకు చెందిన కరోనా బాధితుల రాకపై ఆంక్షలు విధించడం, రాష్ట్రంలో కోవిడ్‌ బారిన పడ్డ వారు హోం ఐసోలేషన్‌లో మాత్రమే ఉండాలని సూచించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.

(చదవండి: England: లాక్‌డౌన్‌ ఆంక్షలు ఎత్తివేయాలా..వద్దా!

>
మరిన్ని వార్తలు