కరోనా: ఆసుపత్రి బయట టీ, కాఫీలకు వెళ్లొస్తున్న రోగులు

4 May, 2021 09:13 IST|Sakshi
కింగ్‌కోఠి ఆస్పత్రి   

 కింగ్‌ కోఠి ఆస్పత్రిలో బయటకెళ్లొస్తున్న కోవిడ్‌ రోగులు

సిబ్బంది కొరతతో పర్యవేక్షణ శూన్యం

5 ఐసీయూ వెంటిలేటర్ల బెడ్లకు ఓ డాక్టర్‌ పర్యవేక్షణ అవసరం

విషయం తెలిసాక లబోదిబోమంటున్న వైద్య బృందం

మరో పక్క కోవిడ్‌ బారిన పడుతున్న సిబ్బంది 

సాక్షి, హిమాయత్‌నగర్‌: కోవిడ్‌కు గురై కింగ్‌కోఠి ఆస్పత్రిలో అడ్మిట్‌ అయిన రోగులు కాస్తంత తేరుకున్నాక బయటకెళ్లొస్తున్నారు. పక్క బెడ్‌ వారికి ఓ మాట చెప్పేసి బయటకు వెళ్లి అలా ఓ టీ లేదా కాఫీ తాగి కొద్దిసేపు చెట్ల కింద కూర్చుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలేవీ కూడా అక్కడున్న సిబ్బంది, సూపరింటెండెంట్, నోడల్‌ అధికారి, స్టాఫ్‌ నర్సులకు కానీ అస్సలు తెలియడం లేదు. సిబ్బంది కారణంగా ఏ ఒక్కరూ ఆయా ప్రాంతాల్లో పర్యవేక్షణ లేని కారణంగా కోవిడ్‌ రోగులు ఇష్టారాజ్యాంగా బయటకెళ్లొస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  

ఐదు బెడ్లకు ఒకరు ఉండాలి 
ఆస్పత్రిలో మొత్తం మీద 350 పడకలు ఉన్నాయి. వీటిలో 50 ఐసీయూ పడకలు, 33 వెంటిలేటర్‌ పడకలు ఉన్నాయి. మిగిలినవన్నీ ఆక్సిజన్‌ బెడ్సే. అయితే ఐసీయూలో పేషెంట్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించేందుకు ప్రతి ఐదు బెడ్లకు ఒక వైద్యుడు ఉండాలి. కానీ.. ఇక్కడ జరుగుతుంది వేరు.  ఐసీయూలోని వెంటిలేటర్‌ బెడ్ల వద్ద వైద్యుడి పర్యవేక్షణ కొరవడింది. దీనికి కారణం వైద్యులు తక్కువ ఉండటమే. ఆస్పత్రి మొత్తం సూపరింటెండెంట్, అడిషినల్‌ సూపరింటెండెంట్, నోడల్‌ అధికారి వంటి వారితో కలిపి సీనియర్, జూనియర్, డిప్యూటేషన్‌పై వచ్చిన వారు ఇలా మొత్తం మీద 28 మంది వైద్యులు ఉన్నారు. ఆర్టీపీసీఆర్‌ టెస్టు మొదలుకొని వ్యాక్సిన్‌ వేసే వరకు అన్ని చోట్ల వైద్యులు విధులు నిర్వర్తిస్తున్నారు. దీని కారణంగా ఐసీయూలో సరైన పాత్ర పోషించలేని పరిస్థితి ఏర్పడింది. 

సిబ్బంది కొరతతోనే.. 
వైద్యులతో పాటు స్టాఫ్‌ నర్సులు, వార్డు బాయ్స్, 4వ తరగతి ఉద్యోగుల కొరత సైతం తీవ్రంగా పట్టి పీడిస్తుంది. దీని కారణంగా కోవిడ్‌ రోగుల వద్ద సరైన పర్యవేక్షణ లేదు. రోగులను పట్టించుకునే వారు లేరు. దీంతో కాస్త కోలుకున్న కోవిడ్‌ రోగులు లోపల వార్డులో ఉండలేక ఆస్పత్రి బయటకు వెళ్లి మరీ టీ తాగి, కాస్త కాలక్షేపం చేసి వస్తున్నారని సీనియర్‌ వైద్యులు బహిర్గతంగా చెబుతున్నారు. ఈ విషయంపై పోలీసులకు చెప్పినప్పటికీ.. ఎవరూ కరోనా రోగి ఎవరూ అటెండెంట్‌ అనేది తాము గుర్తించలేమనే జవాబు ఎదురవుతుంది. ఇలా పేషెంట్లు బయటకు వెళ్లి వస్తే వారి నుంచి ఇతరులకు కోవిడ్‌ సోకే ప్రమాదం పొంచి ఉందని సిబ్బంది వాపోతున్నారు. మూడు రోజుల క్రితం ఒక పేషెంట్‌ ఏకంగా ఉద యం అనగా వెళ్లి రాత్రి 7 గంటలకు తిరిగి రాకపోవడాన్ని ‘సాక్షి’ ప్రచురించిన విషయం విధితమే.

కోవిడ్‌ బారీన పడుతున్న సిబ్బంది 
కింగ్‌ కోఠి ఆస్పత్రి సిబ్బంది సైతం కోవిడ్‌ బారిన పడుతుండటంతో మరింత పనిభారం ప్రస్తుతం చేస్తున్న వారిపై పడుతుంది. ప్రతిరోజూ టెస్టుల కోసం వచ్చే వారి ఓపీ 350 నుంచి 400 మధ్య ఉంటుంది. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్‌ టెస్టుల వద్ద విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది, వైద్యులు అదే విధంగా కోవిడ్‌ వార్డులో విధులు నిర్వర్తించే వైద్యులు, సిబ్బంది, 4వ తరగతి ఉద్యోగులు సైతం కరోనాకు గురవుతున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా 35 మందికి పైగా సిబ్బ ందికి కరోనా వ్యాపించింది. వారందరూ తిరిగి కోలుకుని విధులకు హాజరవుతున్నప్పటికీ.. మరికొంత మందికి మళ్లీ వ్యాపిస్తుంది. ప్రస్తుతం ఆరుగురు సిబ్బంది కరోనా బారిన పడ్డారు.

కట్టడి చేసే దిశగా ఆలోచిస్తున్నాం 
కొద్దిగా తేరుకున్నాక కొందరు రోగులు బయటకు వెళ్లి వస్తున్న విషయం తెలిసింది. అటెండెంట్స్‌ వచ్చి మా పేషెంట్‌ ఎక్కడా అని మమ్మల్నే అడుగుతున్నారు. వారం రోజుల క్రితం శంకర్‌ అనే యువకుడు ఉదయం 7 గంటల ప్రాంతంలో వెళ్లిపోయాడు. తిరిగి రాత్రి మళ్లీ వచ్చాడు. ఈ విషయంపై నారాయణగూడ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాం. ఇకపై అలా జరగకుండా ఉండేందుకు ఆ పరిణామాలను కట్టడి చేసే దిశగా ఆలోచిస్తున్నాం. 
– డాక్టర్‌ రాజేంద్రనాథ్, సూపరింటెండెంట్, కింగ్‌కోఠి ఆస్పత్రి 

చదవండి: కరోనా టెస్ట్‌ చేయలేదని వ్యక్తి హల్‌చల్‌!

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు