కొండగట్టు: భక్తులు లేకుండానే అంజన్న జయంతి వేడుకలు

27 Apr, 2021 08:08 IST|Sakshi

కరోనా కారణంగా అంతరాలయంలోనే వేడుకలు

భక్తులకు అనుమతి నిరాకరణ

30 వరకు కొండగట్టు ఆలయం బంద్‌

సాక్షి, కొండగట్టు(చొప్పదండి): కరోనా కారణంగా ఏటా కొండగట్టు అంజన్న కొండపై జరిగే చిన్న జయంతి ఉత్సవాలు ఈసారి అంతరాలయానికే పరిమితమవుతున్నాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శ్రీఆంజనేయ స్వామి ఆలయంలో నేడు (మంగళవారం) జరిగే హనుమాన్‌ చిన్న జయంతికి అధికారులు భక్తులకు అనుమతి నిరాకరించారు. అంతరాలయంలోనే పూజలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
 
గతేడాదీ భక్తులు లేకుండానే...
కొండగట్టులో ఏటా రెండు సార్లు హనుమాన్‌ చిన్న, ఒకసారి పెద్ద జయంతి ఉత్సవాలు జరుగుతాయి. కానీ కోవిడ్‌–19 కారణంగా గతేడాది ఉత్సవాలను సైతం అర్చకులు భక్తులు లేకుండానే ఆలయం లోపల నిర్వహించారు. ఈ ఏడాది కూడా అలాగే జరుపుతామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఆలయాన్ని ఐదు రోజులపాటు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కొండకు ఎవరూ రావొద్దని చెప్పడంతో హనుమాన్‌ దీక్షాపరులు తమ తమ గ్రామాల్లోని అంజన్న ఆలయాల్లో మాల విరమణ చేస్తున్నారు. మంగళవారం చిన్న జయంతి సందర్భంగా చాలామంది మాల విరమణ చేయనున్నారు.

బంద్‌ విషయం  తెలియక భక్తుల రాక..
కొండగట్టు ఆలయం బంద్‌ ఉన్న విషయం తెలియక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కాలినడకన స్వామివారి దర్శనానికి వస్తున్నారు. ఈ క్రమంలో కొండ దిగువన బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు వారిని ఇళ్లకు తిప్పి పంపిస్తున్నారు. శ్రీఆంజనేయ స్వామి ఆలయంతో పాటు ఉప ఆలయాల్లోని దేవతామూర్తులకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. హనుమాన్‌ చిన్న జయంతి సందర్భంగా భక్తులు ఇళ్లలోనే ఉండి, సహకరించాలని ఆలయ ఈవో చంద్రశేఖర్‌ కోరారు. 

మరిన్ని వార్తలు