కరోనా టెర్రర్‌.. ముట్టుకోకుండానే అంటుకుంటోంది..!

27 Apr, 2021 09:01 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

జిల్లాలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి

నిబంధనలు పాటించని కరోనా రోగులు

యథేచ్ఛగా బయట సంచారం

ప్రజల్లో కరువైన కనీస బాధ్యత.. సామాజిక అవగాహన 

సాక్షి, సిరిసిల్లటౌన్‌: కరోనా రోగిని నేరుగా కలువడం, వారితో దగ్గరగా మాట్లాడటం, ఒకే గదిలో, దగ్గరదగ్గరగా మెదలడం, తుంపర్లు ఇతరుల లాలాజలంతో కలువడం, లేదా ముక్కునీరుతో కలువడంతో కరోనా వచ్చేది. ఇది మొదటి వేవ్‌లో అందరం చూశాం. లక్షణాలున్న వారికి దూరంగా మెదిలి తప్పించుకున్నాం. కానీ ప్రస్తుతం రెండో దశ కరోనా వైరస్‌ వ్యాప్తి గతానికి భిన్నంగా ఉంది. మొదటి వేవ్‌లో కనిపించని లక్షణాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రోగిని ముట్టుకోకుండానే అంటుకుంటుంది. గాలి ద్వారా కూడా వైరస్‌ వ్యాపిస్తున్నట్లు వైద్యశాస్త్ర మేధావులు చెబుతున్నారు. ఫలితంగా వైరస్‌ ఉధృతి ఎక్కువై సామాజిక వ్యాప్తి జరుగుతుంది. జిల్లాలో ప్రజలు సామాజిక బాధ్యతను విస్మరిస్తూ...కరోనా వ్యాప్తికి కారకులైతున్న వైనంపై కథనం..

కరోనా సామాజిక వ్యాప్తి..?
కరోనా వైరస్‌ సామాజిక వ్యాప్తి జరుగుతుందన్న అంశం చర్చనీయాంశమైంది. రోజురోజుకు జిల్లాలో వందలాది సంఖ్యలో కేసులు నమోదవడం ఇందుకు బలం చేకూర్చుతుంది. అయితే కరోనా బారిన పడినవారు సరైన చికిత్స పొందుతూ బహిరంగ ప్రదేశాలకు రాకుండా ఉండటం లేదు. కొందరైతే సాధారణ వ్యక్తుల్లాగే వివిధ ఫంక్షన్లు, సమావేశాలు, ఇతర వేడుకల్లో పాల్గొంటున్నారు. పండుగల సందర్భాల్లో వేలాది జనం మార్కెట్లు, షాపింగ్‌ల కోసం భయం లేకుండా తిరగడమే ప్రస్తుత పరిస్థితికి కారణమైంది.

రాజకీయ ఫంక్షన్లు, సంతలు, షాపింగ్‌లకు జనాలు వేలాది సంఖ్యలో పాల్గొనడం మరో కారణమైతున్నట్లు వైద్యశాఖ మేధావులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన పలు కార్యక్రమాల్లో లెక్కకు మించిన జనాలు హాజరవడంతో వైరస్‌ అంటుకున్నట్లు తెలుస్తోంది. మొదటి వేవ్‌లో రోగినుంచి సాధారణ వ్యక్తికి సోకడంలో లక్షణాలు బయట పడటానికి మూడు నుంచి వారం రోజులు పట్టేది. ఇప్పుడా పరిస్థితి లేదు. కేవలం నిమిషాల వ్యవధిలోనే అంటుకుని రెండు మూడు రోజుల్లోనే రోగి పరిస్థితి చేయిదాటే దాఖలాలు కనిపిస్తున్నాయి. కొందరిలో ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయించినా..వైరస్‌ జాడలు కనిపించడం లేదు. కొత్త వైరస్‌ ప్రభావానికి లోనైన వారికి విరేచనాలు, ఒళ్లునొప్పులు, తలనొప్పి వగైరా కనిపిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. 

సాధారణ ప్రజలు ఇలా..
మాస్కులు లేకుండా ఎవరూ ఇళ్లలోంచి బయటకు రావొద్దు
 అన్ని దుకాణాలు, మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో భౌతికదూరం పాటించాలి
బయటకు వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ శానిటైజర్‌ బాటిల్‌ తీసుకుపోవాలి
 అన్ని షాపుల్లోనూ యజమానులు శానిటైజర్లు అందుబాటులో ఉంచి, మాస్కులు ధరించాలి 
 కరోనా రోగులపై వివక్ష చూపరాదు.
 నాకేం కాదని అశ్రద్ధ చేయొద్దు. కరోనా వచ్చిందని భయపడాల్సిన పనిలేదు
 ► పోలీసులు అమలు చేస్తున్న కర్ఫ్యూ నిబంధనలు, పలు గ్రామాల్లో అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ నియమాలను ప్రజలు పాటించాలి

కోవిడ్‌–19 పాజిటివ్‌ వారు..
 కరోనా లక్షణాలు కనపడగానే ప్రాథమిక దశలోనే టెస్టులు చేయించుకోవాలి
 ఇంట్లోనే ఉంటూ..ఐసోలేషన్‌ నిబంధనలు పాటించాలి. బయట తిరుగొద్దు
 కరోనా సోకినవారు తప్పకుండా హోం ఐసోలేషన్‌ పాటించాలి. డాక్టర్‌ సూచలను పాటిస్తూ చికిత్స పొందవచ్చు. రోగ నిరోధక శక్తి పెంచే ఆహారాన్ని తీసుకోవాలి.
 మాననికంగా ధైర్యాన్ని కోల్పోకుండా, భయానికి లోను కాకుండా ఉండాలి
లక్షణాలు పెచ్చుమీరితే ఆస్పత్రిలో వైద్యుల పరిరక్షనలో చికిత్స పొందాలి

మరిన్ని వార్తలు