వైరస్‌ ఉధృతి: అనుమానితులు ఎక్కువ.. కిట్లు తక్కువ

29 Apr, 2021 08:19 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

క్యూలైన్‌లలోనే గంటల తరబడి

కిట్లు సరిపోక వెనుదిరుగుతున్న వైనం

జిల్లా వ్యాప్తంగా రోజుకు 1600 పరీక్షలే !

సాక్షి, జగిత్యాల: జిల్లాలో కిట్ల కొరత తీవ్రంగా ఉంది. కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తుండడంతో పీహెచ్‌సీలకు అనుమానితులు బారులు తీరుతున్నారు. పీహెచ్‌సీలకు అరకొర కిట్లు వస్తుండడంతో పలువురు పరీక్షలు చేయించుకోకుండానే వెనుదిరుగుతున్నారు. మళ్లీ మరుసటి రోజు వచ్చి లైన్‌లో ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. నిత్యం వందలకొద్ది అనుమానితులు వస్తుండగా పరీక్షలు మాత్రం వందలోపే చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నిత్యం 1600లకు మించి పరీక్షలు చేయడం లేదు. 

బారులు తీరుతున్న జనం
జిల్లాలోని ప్రతీ ఆరోగ్య కేంద్రంతోపాటు కమ్యూనిటీ ఆస్పత్రుల్లో నిర్ధారణ పరీక్షలు చేస్తున్నప్పటికీ సరిపోవడం లేదు. కమ్యూనిటీ ఆస్పత్రుల్లో 100, జిల్లా ఆస్పత్రిలో 200, పీహెచ్‌సీల్లో 50 చొప్పున కిట్లు కేటాయిస్తూ రోజుకు అంతమందికే చేస్తున్నారు. సెకండ్‌వేవ్‌ తీవ్రత ఎక్కువగా ఉండడంతో అనుమానితులు సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. మొదట్లో టీకాలు వేసుకునేందుకు ముందుకురాని వారు, సెకండ్‌వేవ్‌ తీవ్రత ఎక్కువగా ఉండడంతో మొదట కరోనా పరీక్షలు చేసుకుని టీకాలు వేసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. ముందు పరీక్షలు చేయించుకుందామంటే ర్యాపిడ్‌టెస్ట్‌ కిట్ల కొరత ఏర్పడింది. ముఖ్యంగా మున్సిపాలిటీల్లో ఉదయం నుంచే బారులు తీస్తున్నారు. పూర్తిస్థాయిలో కిట్లు పంపిణీ కాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కొరత ఉన్నట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. 

రోజుకు 1,600 మాత్రమే
వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఊపందుకోవడంతో టెస్ట్‌ల కోసం అనుమానితులు బారులుతీరుతున్నారు. గతంలో పరీక్షలు చేసుకునేందుకు ముందుకురాని వారు ప్రస్తుతం వైరస్‌ ఉధృతిని చూసి పరుగులు పెడుతున్నారు. దీంతో కిట్ల నిల్వలు తగ్గిపోతున్నాయి. సరఫరా సైతం అంతంతే ఉండడంతో కొరత ఏర్పడుతోంది. 

జగిత్యాలలోనే ఆర్టీపీసీఆర్‌ 
జగిత్యాలలోని ఓల్డ్‌హైస్కూల్‌లో ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌లు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల్లో ర్యాపిడ్‌ టెస్ట్‌లు చేస్తున్నారు. ర్యాపిడ్‌ టెస్ట్‌ల్లో నెగెటివ్‌ వస్తే ఆర్టీపీసీఆర్‌కు పంపుతున్నారు. ఆర్టీపీసీఆర్‌లో పాజిటివ్‌ వస్తుండడంతో పలువురు ఆందోళన చెందుతున్నారు. 

మరిన్ని వార్తలు