అక్కడ కోవిడ్‌ టెస్ట్‌ బహు ఖరీదు.. ఏకంగా రూ.4500

20 Nov, 2021 10:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో యాంటిజెన్‌ పరీక్ష  ఖరీదైన వ్యవహారంగా మారింది. ప్రయాణానికి 72 గంటల ముందే ఆర్టీపీసీఆర్‌  పరీక్ష చేసుకున్నప్పటికీ విమానాశ్రయంలో ఫ్లైట్‌ బయలుదేరడానికి ముందు యాంటిజెన్‌ పరీక్ష  తప్పనిసరిగా మారింది. దీంతో  కనీసం  రూ.150  కూడా విలువ చేయని యాంటిజెన్‌ పరీక్షలకు అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.4500 వరకు వసూలు చేస్తున్నారు. కోవిడ్‌ నెగెటివ్‌ నినేదికతో బయలుదేరిన ప్రయాణికులు సైతం యాంటిజెన్‌ పరీక్ష  చేసుకోవలసి రావడంతో చిన్న టెస్టు కోసం రూ.వేలల్లో వసూలు చేయడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.

శంషాబాద్‌  ఎయిర్‌పోర్టులో ఒక ప్రైవేట్‌ సంస్థ ఆధ్వర్యంలో  ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అమెరికాతో పాటు పలు దేశాలు కోవిడ్‌ ఆంక్షలను సడలించడంతో  అంతర్జాతీయ రాకపోకలు పెరిగాయి. దీంతో  ఎయిర్‌పోర్టులో యాంటిజెన్‌ టెస్టులకు సైతం డిమాండ్‌ నెలకొంది. ‘టెస్టుల పేరిట ఇలా దోచుకోవడం అన్యాయమని ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు’. ‘ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి అమెరికాకు నేరుగా వెళ్లేందుకు ఇంకా ఫ్లైట్‌లు అందుబాటులోకి రాలేదు. కానీ ఇక్కడి నుంచి అక్కడికి చేరుకొనే వరకు కనీసం మూడు,నాలుగు సార్లు  యాంటిజెన్‌ టెస్టులు చేసుకోవలసి వస్తుంది.’ అని  ఒక ప్రయాణికుడు తెలిపారు.  

ఆంక్షలు సడలించాక..... 
కోవిడ్‌  దృష్ట్యా నిలిచిపోయిన రాకపోకలను  పునరుద్ధరించినప్పటికీ  ఇంకా పూర్తిస్థాయిలో  ఎయిర్‌లైన్స్‌ సేవలు  అందుబాటులోకి రాలేదు, గతంలో  కుదిరిన ఎయిర్‌బబుల్‌ ఒప్పందం మేరకే పలు ఎయిర్‌లైన్స్‌ పరిమితంగా  విమానాలను నడుపుతున్నాయి. ఒక్క అమెరికాకే కాకుండా యూరోప్‌ దేశాలకు సైతం రాకపోకలు పెరిగాయి. ప్రత్యేకించి ఎక్కువ మంది బ్రిటన్‌కు  బయలుదేరి వెళ్తున్నారు.అలాగే దుబాయ్, దోహ, షార్జా తదితర దేశాలకు సైతం రాకపోకలు పెరిగాయి.

అక్టోబర్‌లో హైదరాబాద్‌ నుంచి లక్ష మందికి పైగా  వివిధ దేశాలకు రాకపోకలు సాగించగా   ఆ సంఖ్య  ప్రస్తుతం 1.6 లక్షలు దాటినట్లు అంచనా. ఇదే సమయంలో  దేశంలోని  65 నగరాలకు  హైదరాబాద్‌ నుంచి రాకపోకలను పునరుద్ధరించారు. దీంతో జాతీయ ప్రయాణికుల రద్దీ పెరిగింది. అమెరికాకు వెళ్లవలసిన వాళ్లు  బెంగళూరు, ముంబయి, దిల్లీ నుంచి బయలుదేరుతున్నారు.  దేశీయ ప్రయాణికులు కూడా 9.35 లక్షల నుంచి ఇంచుమించు 10 లక్షల వరకు చేరుకున్నట్లు అంచనా.  

మరో 2 నెలలు ఇలాగే... 
మరో 2 నెలల పాటు యాంటిజెన్‌ పరీక్షలు తప్పనిసరి కావచ్చునని ఎయిర్‌పోర్టు వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రపంచంలోని చాలా దేశాల్లో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ తుదిదశకు చేరుకుంది. జనవరి నాటికి అందరూ వ్యాక్సిన్‌లు తీసుకోవచ్చు. ఆ తరువాత యాంటిజెన్‌ తప్పనిసరి వంటి నిబంధనలు ఉండకపోవచ్చునని  ఒక అధికారి అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు