Third Wave In Telangana: గుడ్‌న్యూస్‌ చెప్పిన తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు

8 Feb, 2022 15:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: కరోనా మూడో దశ పూర్తిగా ముగిసిపోయిందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణలో కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయని, తెలంగాణకు ఇది శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితిపై డీహెచ్‌ మాట్లాడుతూ..  మూడో దశ డిసెంబర్ నుంచి ప్రారంభమైందని, జనవరిలో మూడో దశ ఉద్ధృతి పెరిగిందన్నారు. రాష్ట్రంలో కోవిడ్‌ పాజిటివిటీ రేటు అత్యధికంగా 5 శాతానికి వెళ్లిందని, ప్రస్తుతం 2 శాతం కంటే తక్కువ ఉందన్నారు. మరోవైపు దేశంలో కూడా కరోనా కేసులు లక్షలోపే నమోదవుతున్నాయని, పాజిటివిటీ రేటు భారీగా తగ్గిందన్నారు. 

రెండేళ్ళుగా కరోనా ప్రపంచాన్ని పట్టిపీడించిందని డీహెచ్‌ అన్నారు. ‘కోవిడ్‌ మొదటి దశ వల్ల 10 నెలలు ఇబ్బంది పడ్డాం. సెకండ్‌ వేవ్‌ ఆరునెలలు పాటు ఇబ్బందులకు గురి చేసింది. ఎంతో మంది ప్రాణాలు బలిగొంది. మూడో దశలో 28 రోజుల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. జనవరి 25న అత్యధికంగా 4,800 కేసులు నమోదయ్యాయి. థర్డ్‌ వేవ్‌ కేవలం రెండు నెల్లోనే అదుపులోకి వచ్చింది. ఈ దశలో మొత్తం కేవలం 3 వేల  మంది మాత్రమే ఆసుపత్రుల్లో చేరారు’ అని వెల్లడించారు.
చదవండి:  భర్త వేధింపులు.. స్కిన్‌ ఎలర్జీ తగ్గిస్తానని స్టెరాయిడ్స్‌ ఇచ్చి

ఫీవర్‌ సర్వేతో సత్ఫలితాలు
‘ఫీవర్‌ సర్వే వల్ల సత్ఫలితాలు వచ్చాయి. ఫీవర్ సర్వే చేపట్టడం ద్వారా కోటి ఇళ్లలో సర్వే చేశాం.  4 లక్షల మందికి కిట్‌లు అందజేశాం. కోవిడ్‌ నియంత్రణలో వ్యాక్సిన్‌ కీలక ఆయుధంగా పనిచేసింది. ఒమిక్రాన్ వేరియంట్ చాలా సీరియస్ వైరస్.  కానీ వ్యాక్సిన్‌తో దీన్ని అరిగట్టగలిగాం.సూచనలు, జాగ్రత్తలు చేపట్టడం వల్లనే ఒమిక్రాన్ పరిస్థితి విషమించలేదు. ఇంకా ఇప్పటివరకు ఎవరు వ్యాక్సిన్ తీసుకోలేదో వారు తీసుకోవాలి.  ఇక ముందు కూడా కరోనా జాగ్రత్తలు పాటించాలి’ అని సూచించారు.

రాష్ట్రంలో ఎలాంటి కోవిడ్‌ ఆంక్షలు లేవు
‘రాష్ట్రంలో ఎలాంటి కోవిడ్‌ ఆంక్షలు లేవు. జనవరి 31 st వరకే ఆంక్షలు ఉన్నాయి.. వాటిని కూడా పూర్తిగా ఎత్తివేసింది. అన్ని సంస్థలు 100 శాతం పనిచేయొచ్చు. ఉద్యోగులు అందరూ కార్యాలయాకు వెళ్లొచ్చు. ఐటీ కంపెనీలు కూడా వర్క్‌ ఫ్రం హోం తీసేయొచ్చు. విద్యాసంస్థలను కూడా పూర్తిగా ప్రారంభించాం. ఇప్పటి వరకు రాష్ట్రంలో అయిదు కోట్ల మందికి టీకాలు వేశాలు. 82శాతం మందికి రెండు డోస్‌లు ఇచ్చాం. వచ్చే కొద్ది నెలలపాటు కొత్త వేరియంట్‌ పుట్టే అవకాశం లేదు. కోవిడ్‌ త్వరలో ఎండమిక్‌ అవుతుంది. భవిష్యత్తులో సాధారణ ఫ్లూలా మారుతుంది.’ అని పేర్కొన్నారు.
చదవండి:  రాని కరోనాను రప్పించి మరీ..

>
మరిన్ని వార్తలు