కరోనా దా‘రుణం’ రోడ్డుపాల్‌ చేసింది..

14 Jun, 2021 09:13 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

తండ్రి ఓ గుమస్తా.. కుమారుడు బంధువుల సహకారంతో ఓ దుకాణం నడిపిస్తున్నాడు. వీరిద్దరి పనులతో వారి కుటుంబం సాఫీగా సాగుతోంది. అయితే కరోనా మహమ్మారి వీరి కుటుంబాన్ని కాటు వేసి ఛిన్నాభిన్నం చేసింది. దీంతో ఈ కుటుంబంలో ఇద్దరు మరణించగా మిగిలిన ఇద్దరు రోడ్డున పడ్డారు. 

సాక్షి,అర్వపల్లి(నల్లగొండ): నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన పొలిశెట్టి శేఖర్‌(65) నిరుపేద కుటుంబీకుడు. ఈయన అక్కడ ఓ దుస్తుల దుకాణంలో గుమస్తాగా పనిచేస్తుండగా ఆయన కుమారుడు పొలిశెట్టి శివ(35) సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో బంధువుల సహకారంతో చిన్నదుకాణం నడుపుతున్నాడు. ఈయనకు ఏడాది కిందటే వివాహం జరిగింది. భార్యతో కలిసి ఇక్కడ ఉంటున్నాడు. కాగా పొలిశెట్టి శేఖర్, అతడి భార్య కళావతి(60) నల్లగొండలో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే రెండు నెలల క్రితం అర్వపల్లిలో ఉంటున్న కుమారుడు శివ కరోనా బారినపడ్డాడు. దీంతో ఆయన నల్లగొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఇదిలా ఉండగా.. శేఖర్‌ భార్య కళావతికి కూడా పాజిటివ్‌ వచ్చింది. ఆమెను కూడా అదే ఆస్పత్రిలో చేర్పించారు. రూ.10లక్షల వరకు అప్పుతెచ్చి వైద్యానికి ఖర్చు పెట్టారు. చికిత్స పొందుతున్న క్రమంలోనే ఏప్రిల్‌ 29న భార్య కళావతి మరణించింది. తర్వాత నాలుగు రోజులకు మే 3న కుమారుడు శివ కూడా కరోనాతో కన్నుమూశాడు. దీంతో వృద్ధుడైన శేఖర్, కోడలు మీనా రోడ్డున పడ్డారు. మీనా ప్రస్తుతం తన తల్లిగారింట్లో ఉంటుండగా శేఖర్‌ అర్వపల్లిలోని తన కూతురి ఇంట్లో ఉంటున్నాడు.

ఓవైపు భార్య, కుమారుడు చనిపోయి కన్నీరుమున్నీరవుతూనే మరోవైపు చేసిన అప్పులు ఎలా తీర్చాలని మదనపడుతున్నాడు. చిన్నవయసులో ఉన్న తన కోడలు పరిస్థితి ఏంటని, వృద్ధుడైన తాను ఎలా జీవనం సాగించాలని వేదన పడుతున్నాడు. కరోనా కారణంగా ఈ కుటుంబం సంతోషం నుంచి దుఃఖసాగరంలో మునిగిపోయింది. దేవుడు వారితోపాటు తనను కూడా పైలోకానికి తీసుకెళ్తే బాగుండేదని, ఇప్పుడు తాను ఎలా బతకాలి, తన కోడలు పరిస్థితి ఏంటని శేఖర్‌ విలపిస్తున్నాడు. తన కుటుంబం లాంటి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని వాపోతున్నాడు. ప్రభుత్వం తన కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. 

చదవండి: 4 కోట్ల ఆస్తులు: బుక్కెడు బువ్వ పెట్టరూ..

మరిన్ని వార్తలు