‘ఆయుష్మాన్‌ భారత్‌’తో పేదలకు అన్యాయమే

20 May, 2021 02:48 IST|Sakshi

రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని పక్కన పెడతారేమోనని అనుమానం కలుగుతోంది: వైఎస్‌ షర్మిల

సాక్షి, హైదరాబాద్‌: ‘ఆయుష్మాన్‌ భారత్‌’ అమలు చేసేందుకు ఉన్న నిబంధనల దృష్ట్యా పేదలందరికీ ఉచిత వైద్యం అందే అవకాశం లేదని, రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ద్వారానే పేద కుటుంబాలకు ఉచిత వైద్య సేవలు అందుతాయని దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తనయ వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు. బుధవారం ఆమె బెంగళూరు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఆయుష్మాన్‌ భారత్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని, దీనివల్ల రాష్ట్రంలో కేవలం 26 లక్షల 11 వేల కుటుంబాలు మాత్రమే లబ్ధిపొందే అవకాశం ఉందని, ప్రభుత్వ నిర్ణయంతో  మిగతా వారికి వైద్యం అందని ద్రాక్షగా మారుతుందన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ద్వారా సంవత్సరానికి ఒక కుటుంబం గరిష్టంగా రూ. 5 లక్షల వరకే లబ్ధిపొందే అవకాశం ఉందని, గరిష్ట పరిమితి దాటిన పక్షంలో పేదలపై ఆర్థిక భారం తప్పదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆయుష్మాన్‌ భారత్‌లో 1,350 వ్యాధులకు చికిత్స లభిస్తుండగా, అందులో లేని 540 వ్యాధులకు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స లభిస్తుందని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు.

ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ఆరోగ్యశ్రీని పక్కన పెట్టి పూర్తిగా ఆయుష్మాన్‌ భారత్‌నే అమలు చేస్తారనే అనుమానం కలుగుతోందన్నారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీకి సంబంధించిన నిధులు ప్రభుత్వం సకాలంలో విడుదల చేయడం లేదని ప్రైవేట్‌ ఆసుపత్రులు పేదలకు చికిత్సలు నిరాకరిస్తున్న సందర్భాలు చూస్తున్నామని, ఆయుష్మాన్‌ భారత్‌ అమలుతో ఇక కేంద్రం నుంచి ఎప్పటికి నిధులు వచ్చేనని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీకి ఒక పటిష్ట వ్యవస్థ ఉందని, ప్రభుత్వం పేదల వైద్యం విషయంలో తప్పించుకునే వైఖరిని మానుకుని, తక్షణం కరోనా ను ఆరోగ్యశ్రీలో చేర్చి రాష్ట్రంలోని 80 లక్షల పేద కుటుంబాలకు భరోసా కల్పించాలని వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు