కరోనా ఉధృతి : టీకా కోసం పడిగాపులు 

13 Apr, 2021 09:20 IST|Sakshi

టీకా కోసం  వృద్ధుల పాట్లు

ఆరుగంటలు ఎదురుచూపులు   

గాంధీ ఆస్పత్రి :   కరోనా వైరస్ ‌నివారణకు గాను ఒక వైపు టీకా ఉత్సవ్‌ పేరిట ప్రతిఒక్కరు వ్యాక్సిన్‌ వేసుకోవాలని ప్రచారం జరుగుతుండగా, మరోవైపు సెకెండ్‌ డోస్‌ వ్యాక్సిన్‌ కోసం గంటల తరబడి నిరీక్షించిన వయోవృద్ధులు నిరాశతో వెనుతిరిగిన ఘటన సికింద్రాబాద్‌ గాంధీఆస్పత్రి  వ్యాక్సిన్‌ సెంటర్‌లో జరిగింది.

వివరాలు...  ఈనెల 12వ తేదిన కోవాగ్జిన్‌ సెకెండ్‌ డోస్‌ తీసుకోవాలని సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ రావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 80 మంది సీనియర్‌ సిటిజన్స్‌ సోమవారం ఉదయం 8.30 గంటలకు గాంధీ టీకా కేంద్రానికి చేరుకున్నారు. వీరందరికీ ఇచ్చేందుకు సరిపడ కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ డోసులు స్టాక్‌ లేకపోవడంతో మధ్యాహ్నం 2 గంటల వరకు నిరీక్షించారు. వివిధ రుగ్మతలతో బాధపడుతున్న వృద్ధులు గంటల కొద్ది నిరీక్షించి నీరసానికి గురయ్యారు. 

33 డోసులు తక్కువ వచ్చాయి : రాజారావు, గాంధీ సూపరింటెండెంట్‌  
పలువురు వృద్ధులు సెకెండ్‌డోస్‌ టీకా కోసం నిరీక్షించిన మాట వాస్తమేనని, కొన్ని డోసులు తక్కువ రావడంతో సమస్య ఉత్పన్నం అయిందని సూపరింటెండెంట్‌ రాజారావు తెలిపారు. ఈనెల 12వ తేదిన  73 మందికి కోవాగ్జిన్‌ సెకెండ్‌ డోస్‌ వేయాల్సి ఉందని, అయితే 40 డోసులే రావడంతో మిగిలిన 33 మందికి టీకా వేయలేకపోయామని వివరించారు.

మరిన్ని వార్తలు