కోవిడ్‌ టీకాలకు కటకట..!

14 Jan, 2023 00:46 IST|Sakshi

రాష్ట్రంలో కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ స్టాక్‌ ఖాళీ.. మూడు రోజుల క్రితమే వెబ్‌సైట్‌ క్లోజ్‌

కోవాగ్జిన్‌ నిల్వలు కూడా అంతంతే

ఈ నెలాఖరుతో ముగియనున్న ఆ టీకాల గడువు

విదేశాలకు వెళ్లేవారు, బూస్టర్‌ డోసు కోసం వచ్చేవారికి తిప్పలు

కరోనా కొత్త వేరియంట్లు, విదేశాల్లో కేసుల పెరుగుదల వార్తలతో జనంలో ఆందోళన

సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్రంలో కోవిడ్‌ టీకాలకు కొరత ఏర్పడింది. ముఖ్యంగా కోవిషీల్డ్‌ వ్యాక్సిన్ల స్టాక్‌ పూర్తిగా ఖాళీ అయింది. టీకా కోసం ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ సెంటర్లకు వెళ్తున్నవారికి ప్రస్తుతం అందుబాటులో లేవన్న సమాధానమే వస్తోంది. మరోవైపు చైనాతోపాటు పలు దేశాల్లో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయని, కొత్త వేరియంట్లు ప్రభావం చూపుతున్నాయని వస్తున్నవార్తలతో జనంలో ఆందోళన కనిపిస్తోంది.

డిమాండ్‌ మేరకు టీకాలను సరఫరా చేయకపోవడం, ప్రభుత్వ కోల్డ్‌ చెయిన్‌ పాయింట్‌ (సీసీపీ), డిస్ట్రిక్స్‌ వ్యాక్సి నేషన్‌ పాయింట్‌ (డీవీ ఎస్‌) కేంద్రాలకు ఇప్పటికే సర ఫరా చేసిన కోవిషీల్డ్‌ టీకాల గడువు ముగిసిపోవడం వంటివి ఇబ్బందికరంగా మారింది. ఇదే టీకా తొలి రెండు డోసులు వేసుకున్న వారితోపాటు విదేశాలకు వెళ్లాల్సినవారు వ్యాక్సిన్లు అందుబాటులో లేక ప్రైవేటులో తీసు కోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని సొమ్ముచేసు కుంటున్న ప్రైవేటు ఆస్పత్రులు టీకాలతోపాటు అదనపు చార్జీలు అంటూ అడ్డగోలుగా వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కోవిషీల్డ్‌ గడువు ముగియడంతో..
కరోనా వైరస్‌ నుంచి రక్షణ కోసం ప్రభుత్వం ప్రజలకు కోవాగ్జిన్, కోవిషీల్డ్‌ వ్యాక్సిన్లను ఇస్తోంది. మెజార్టీ ప్రజలు మొదటి, రెండో డోసు కోవిషీల్డ్‌ టీకాలు తీసుకున్నారు. బూస్టర్‌ డోసులు పంపిణీ మొదలైనా ఇటీవలి వరకు పెద్దగా డిమాండ్‌ కనిపించలేదు. కానీ కొన్నిరోజులుగా కోవిడ్‌ కొత్త వేరియంట్లను గుర్తించడం, ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో మళ్లీ ప్రభావం చూపిస్తుండటంతో.. బూస్టర్‌ (ప్రికాషన్‌) డోసు వేసుకునేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 3,24,42,135 ఫస్ట్‌డోసు, 3,15,40,633 సెకండ్‌ డోసు టీకాలను పంపిణీ చేశారు. వీరిలో 1,32,93,044 మంది ప్రికాషన్‌ డోసు తీసుకోగా.. మరో 1,61,38,443 మందికి అవసరం ఉంది. ప్రభుత్వం ఇంతకు ముందు సరఫరా చేసిన కోవిïషీల్డ్‌ టీకాల గడువు ఈ నెల 10వ తేదీతో ముగిసి పోయింది. దీనితో మిగిలిన టీకాలను పక్కన పడేశారు.

సంబంధిత వెబ్‌సైట్‌ కూడా మూడు రోజుల కిందే మూతపడింది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో కోవాగ్జిన్‌ మాత్రమే అందుబాటులో ఉంది. అది కూడా 2.77 లక్షల డోసులే స్టాకు ఉంది. ఈ వ్యాక్సిన్‌ గడువు కూడా ఈ నెలా ఖరుతో ముగియ నున్నట్టు సమాచారం. టీకా నిల్వలు దగ్గరపడుతుండటంతో వైద్య సిబ్బంది కూడా ఏమీ చేయ లేక చేతులెత్తేస్తున్నారు. వ్యాక్సినే షన్‌ కోసం ఆస్పత్రు లకు వెళ్తున్నవారు నిరాశతో వెనుదిరుగుతున్నారు.

కోవిషీల్డ్‌ బూస్టర్‌ డోస్‌ లేదన్నారు
ఈ నెల 23న అమెరికా వెళ్లాల్సి ఉంది. వాక్సినేషన్‌ తప్పనిసరి చేశారు. ఇప్పటికే మొదటి, రెండు డోసులు కోవిషీల్డ్‌ తీసుకున్నా. బూస్టర్‌ డోసు తీసుకోవాల్సి ఉంది. టీకా కోసం గురువారం బాలాపూర్‌ పీహెచ్‌సీకి వెళ్లాను. కానీ ఆ టీకా లేదన్నారు. ఎనిమిది రోజుల్లో ప్రయాణం ఉంది. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు.
– అశోక్‌కుమార్, మీర్‌పేట్, హైదరాబాద్‌

టీకాల కోసం లేఖ రాసినా స్పందించని కేంద్రం
కేంద్ర ప్రభుత్వం కంపెనీల నుంచి కరోనా టీకాలను తీసుకుని దేశవ్యాప్తంగా రాష్ట్రాలకు సరఫరా చేస్తుంది. ఆయా రాష్ట్రాల అవసరాలు, డిమాండ్‌ను బట్టి పంపిణీ చేస్తుంది. రాష్ట్రంలో కోవిడ్‌ టీకాల స్టాకు ఖాళీ అవుతుండటంతో వెంటనే పంపాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు కొన్నిరోజుల కిందే కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయకు విజ్ఞప్తి చేశారు. కానీ దీనిపై కేంద్రం ఇంతవరకు స్పందించలేదని.. రాష్ట్ర అవసరాలకు తగినట్టుగా కేంద్రం నుంచి టీకాలు అందడం లేదని వైద్యారోగ్య శాఖ వర్గాలు చెప్తున్నాయి.

మరిన్ని వార్తలు