‘బీర్‌దాణా’తో దెబ్బతింటున్న పశువుల ఆరోగ్యం.. ఆ పాలు మనుషులకూ డేంజర్‌

3 Mar, 2022 13:31 IST|Sakshi
(ఫైల్‌ ఫొటో)

సాక్షి, రంగారెడ్డి జిల్లా: అధిక పాల దిగుబడి కోసం గేదెలు, ఆవులకు మోతాదుకు మించి బీర్‌దాణా (బీర్‌ తయారు చేయగా మిగిలిన వ్యర్థాల లిక్విడ్‌) తాగిస్తున్నారు. ఇలా చేయడం వలన ప్రత్యక్షంగా పశువుల ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతో పాటు.. పరోక్షంగా పాలు తాగిన చిన్నారుల అనారోగ్యానికి కారణమవుతున్నారు. సాధారణంగా పాలిచ్చే గేదెలు, ఆవులకు రైతులు అధిక పాల దిగుబడి కోసం కడుపునిండా పచ్చిగడ్డి, ఎండుగడ్డి, పల్లిపట్టి, బెల్లంపట్టి, కుసుమ నూనె తీయగా మిగిలిన కిల్లి, తవుడు, కందిపొట్టు, మొక్కజొన్నతో తయారు చేసిన సంప్రదాయ దాణా వాడుతుంటారు. వీటిలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. అయితే బహిరంగ మార్కెట్లో ఈ దాణా ధరలు రెట్టింపవడంతో వ్యయ భారాన్ని తగ్గించుకునేందుకు కొంతమంది పక్కదారిపట్టారు.  

ధర తక్కువ   
బీర్‌ తయారీ కంపెనీలు ట్యాంకర్ల ద్వారా రహస్యంగా సరఫరా చేస్తున్న బీర్‌దాణాను డ్రమ్ముకు రూ.900 నుంచి రూ.1,000 చొప్పున కొనుగోలు చేసి పశువులకు అందిస్తున్నారు.  సంప్రదాయదాణాలో ఐదు శాతానికి మించి బీర్‌దాణా వాడకూడదు. కానీ తక్కువ ధర.. 20–30 శాతం పాలు ఎక్కువగా ఇస్తుండడంతో రైతులు ఒక్కో పశువుకు రోజుకు సగటున నాలుగు నుంచి ఐదు కిలోల చొప్పున వాడుతున్నారు. పశువుల ఆరోగ్యానికి ఇది హానికరమని వైద్యులు హెచ్చరించినా పెడ చెవిన పెడుతున్నారు. ఫలితంగా పశువుల జీవితకాలం పదిహేనేళ్ల నుంచి పదేళ్లకు పడిపోతోంది. ఎనిమిది నుంచి పది ఈతలు ఈనాల్సిన గేదెలు నాలుగైదు ఈతలకే పరిమితమవుతున్నాయి. ఆరోగ్యపరిస్థితి క్షీణించి, త్వరగా మృత్యువాత పడుతున్నాయి.

పశువుల పాకలోని డ్రమ్ముల్లో బీర్‌ లిక్విడ్‌ 

డిమాండ్‌ ఎక్కువ కావడంతో..  
పశువైద్యశాఖ అధికారుల అంచనా ప్రకారం జిల్లా లో 1,88,182 పశువులు ఉండగా, వీటిలో 1,22, 58 7 గేదెజాతివి ఉన్నాయి. విజయ, మదర్‌ డెయి రీలు 8,570 మంది రైతుల నుంచి పాలు సేకరిస్తున్నాయి. గ్రేటర్‌ వాసులకు రోజుకు కనీసం 25–30 లక్షల లీటర్ల పాలు అవసరమవుతుండగా, ప్రస్తుతం జిల్లాలో 2.50 లక్షల లీటర్లకు మించి సరఫరా కావడం లేదు. బహిరంగ మార్కెట్లో లీటర్‌ పాలను రూ.70 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. దిగుబడికి, డిమాండ్‌కు మధ్య భారీ వ్యత్యాçసం ఉండడంతో రైతులు పశువుల నుంచి అధిక దిగుబడి సాధించేందుకు బీర్‌దాణాను వాడుతున్నారు.

ఇప్పటి వరకు జిల్లాలో 4,144 పాడిపశువులను 75 శాతం నుంచి 50 శాతం సబ్సిడీపై రైతులకు అందజేశారు. పశుగ్రాస సాగు కోసం ఈ ఏడాది ఇప్పటి వరకు 140.2 మెట్రిక్‌ టన్నుల విత్తనాలు సరఫరా చేశారు. సొంతంగా పొలం ఉన్న వారు గడ్డినిసాగు చేసినప్పటికీ.. పొలం లేనివారు పశువులకు ఆహారంగా బీర్‌దాణాను వినియోగిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తి ప్రభుత్వం సరఫరా చేసిన పశువుల్లో ఇప్పటికే 417 చనిపోవడం గమనార్హం.   

ఆరోగ్య సమస్యలు వస్తాయి 
సాధారణంగా మక్క, తవుడు, వేరుశశగ చెక్క, కందిపొట్టుతో తయారు చేసిన దాణాను పశువులకు వాడుతుంటారు. కిలో రూ.25 నుంచి రూ.30 వరకు ఖర్చవుతుంది. బీర్‌దాణాకు లీటర్‌కు రూ.పదిలోపే దొరుకుతోంది. ఇందులో ఆల్కాహాల్‌ శాతం ఎక్కువగా ఉండడంతో పశువులు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పాలల్లో ఎసిడిటీ లెవల్స్‌ ఎక్కువగా ఉంటాయి. వీటిని తాగిన పిల్లలకు జీర్ణకోశ సంబంధ సమస్యలు తలెత్తే ప్రమాదముంది.   
– డాక్టర్‌ శంకర్,వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్, తలకొండపల్లి  

మరిన్ని వార్తలు