మీ పోస్టులపై నిఘా ఉంటుందని మర్చిపోకండి..

13 Aug, 2020 12:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బెంగుళురు అల్లర్ల నేపథ్యంలో తెలంగాణలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అల్లర్లకు కారణం అయిన సోషల్ మీడియా పోస్టులపై నిఘా పెంచారు. అన్నీ జిల్లాల పోలీస్ యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. సోషల్ మీడియా పోస్టుల విషయంలో గీత దాటితే చర్యలు తప్పమని తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు. శాంతి భద్రతలను దెబ్బతీసే అలాంటి పోస్టులు పెట్టవద్దని ప్రజలను తెలంగాణ పోలీసులు కోరుతున్నారు. సోషల్ మీడియాలో అలాంటి విద్వేషకర పోస్టులు పెట్టే వారిని తెలంగాణ పోలీసులు నిరంతరం గమనిస్తున్నామన్నారు. (రాజుకున్న రాజధాని)

అలాంటి పోస్టులు పెట్టిన వారిపై వెంటనే కేసులు పెట్టి, తగిన కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అన్ని స్టేషన్లకూ, సీనియర్ అధికారులకూ ఆదేశాలు జారీచేసినట్లు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ తెలిపారు. తెలంగాణ భద్రత, రక్షణలో విషయంలో అత్యున్నత స్థాయి పాటించేలా పోలీసులకు సహకరించాలని ప్రజలకు విజ్నప్తి చేశారు. సమాజంలో అశాంతిని నెలకొల్పి ప్రభావితంచేసే సోషల్ మీడియా పోస్టులను ప్రచారం చేయవద్దని తెలిపారు. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ లోని అన్ని కమిషనరేట్స్ , జిల్లా ఎస్పీలకు, స్టేషన్ SHO లకు డిజీపీ కార్యాలయం నుండి ఆదేశాలు అందాయన్నారు.(తెలంగాణలో కరోనా యాక్టివ్‌ కేసులు.. 22,736)

కాగా.. కర్ణాటక రాజధాని బెంగుళూరు ఒక్క సారిగా ఉలిక్కి పడిన విషయం తెలిసిందే. ఫేస్‌బుక్‌లో ఓక వ్యక్తి చేసిన పోస్ట్ బెంగుళురులో కల్లోలానికి దారితీసింది. వేలసంఖ్యలో జనం రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే నివాసం, పోలీస్ స్టేషన్ పై దాడికి దిగారు. పరిస్థితి చేయిదాటి పోవడంతో తప్పని పరిస్థితి ల్లో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా అల్లరి మూకల దాడుల్లో 60మంది పోలీస్ సిబ్బంది గాయపడ్డారు. ఇళ్లు, వాహనాలు , ఏటిఎంలు ధ్వంసం అయ్యాయి. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించి కర్ఫ్యూ విధించారు. 

మరిన్ని వార్తలు