బీజేపీ నేతల ఆరోపణలు అవాస్తవం: సీపీ

27 Oct, 2020 13:17 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సిద్దిపేట పోలీసులపై చేసిన ఆరోపణలపై పోలీసు కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ స్పందించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పోలీసులపై బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, పోలీసులే డబ్బు పెట్టారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం నోటీసులు ఇచ్చాకే సోదాలు నిర్వహించామని తెలిపారు. సోదాలపై అధికారులు పంచనామా కూడా నిర్వహించారన్నారు. సురభి అంజన్‌రావుకు నోటీసులు ఇచ్చాకే సోదాలు చేశామని, మొత్తం వీడియోలో చిత్రీకరించినట్లు చెప్పారు. బయట నుంచి వచ్చిన కార్యకర్తలు తమపై దాడి చేశారని, ఎన్నికల నియమావళి జిల్లా మొత్తానికి వర్తిస్తుందన్నారు. ఎన్నికల సమయంలో సీజ్‌ చేసిన డబ్బును ఎత్తుకెళ్లడం నేరమన్నారు. (చదవండి: పోలీసులే ఆ డబ్బు పెట్టారు: సంజయ్‌)

శాంతి భద్రతల నేపథ్యంలో కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ను జిల్లాకు రావొద్దని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయనకు రక్షణ కల్పించే పంపామని, ఎలాంటి దాడి జరగేదని సీపీ వెల్లడించారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు, ఆయన బంధువుల ఇళ్లలో పోలీసులు సోమవారం సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో ఎంపీ బండి సంజయ్‌ పోలీసులే డబ్బులు పెట్టి దొరికినట్లు చూపించారని ఆరోపించారు. ఇక రెచ్చగొట్టే చర్యలకు దిగినా, కార్యకర్తలు సమన్వయం పాటించి దుబ్బాక నియోజకవర్గంలోని బూత్ లెవల్ కార్యకర్తలు యథావిధిగా ప్రచారం కొనసాగించాలని సంజయ్‌ కోరారు. సిద్దిపేట సంఘటనపై ఎన్నికల సంఘం స్పందించాలని, కేంద్ర బలగాలను పంపించి ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని బండి సంజయ్‌ విజ్ఞప్తి చేశారు. (చదవండి: ఓటమి భయంతో అడ్డదారులు)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు