Rachakonda Police Commissionerate: కరోనా బాధితుల ఇంటికే ఆక్సిజన్‌

16 May, 2021 07:24 IST|Sakshi

రాచకొండ కమిషనరేట్‌లో ‘ప్రాణవాయుసేవ బ్యాంకు’ ప్రారంభం

నేరేడ్‌మెట్‌: కరోనాతో పోరాడుతున్న బాధితులకు ఆక్సిజన్‌ ఎంతో కీలకం. ఆక్సిజన్‌ కొరత నేపథ్యంలో పలు ఆసుపత్రుల్లో బాధితులు ఇబ్బందులు పడుతుండగా.. కొందరు మృత్యువాత పడిన దాఖలాలూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో హోం ఐసోలేషన్‌లో ఉంటూ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న బాధితులకు ప్రాణవాయువును అందించే కార్యక్రమానికి రాచకొండ పోలీసులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా డీఆర్‌డీఓ, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఆర్‌కేఎస్‌సీ), లయన్స్‌ క్లబ్, హెట్‌ ఫౌండేషన్, సెకండ్‌ చాన్స్‌ ఫౌండేషన్‌లతో కలిసి రాచకొండ పోలీసులు నేరేడ్‌మెట్‌లోని రాచకొండ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో ‘ప్రాణవాయు సేవ బ్యాంకు’ను ఏర్పాటు చేశారు.

శనివారం రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ ఈ బ్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, ఆక్సిజన్‌ సిలిండర్లు అవసరమైన వారు రాచకొండ కోవిడ్‌ కంట్రోల్‌ రూం నెంబర్‌ 9490617234కి ఫోన్‌ చేసి, రోగికి సంబంధించిన వివరాలు, డాక్టర్‌ ప్రిస్కిప్షన్, ఆధార్‌ కార్డు తదితర వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.

వివరాలు పరిశీలించి వారి ఇంటికి ఆక్సిజన్‌ సిలిండర్‌ను పంపించడం జరుగుతుందని సీపీ వివరించారు.  డొనేట్‌ప్లాస్మా.ఆర్‌కేఎస్‌సీ.ఇన్‌ వెబ్‌పేజీని సీపీ ప్రారంభించారు. ప్లాస్మా దాతలు, ప్లాస్మా అవసరమైన వారు ఈ వెబ్‌పేజీలో పేరు, వివరాలు నమోదు చేసుకోవాలని సీపీ కోరారు. 
 

చదవండి: 
కరోనా వ్యాక్సిన్‌: స్పుత్నిక్‌–వి భేష్‌.. సామర్థ్యం ఎంతంటే

Corona Warriors: డాక్టర్ల కన్నా ముందే..‘ఊపిరి’ పోస్తున్నారు

మరిన్ని వార్తలు