ప్లాస్మా దాతలకు సత్కారం

1 Aug, 2020 06:02 IST|Sakshi

గచ్చిబౌలి: ప్లాస్మా దాతలకు గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌లో ఘనంగా సత్కరించారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో సినీ హీరో విజయ్‌దేవరకొండ, సైబరాబాద్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ ఘనంగా సన్మానించారు. సైబరాబాద్‌ పోలీసులు, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌(ఎస్‌సీఎస్‌సీ) సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 126 మంది ప్లాస్మాయోధులు/ ప్లాస్మావారియర్స్‌(హీరోయిక్‌ వారియర్స్‌)ను సత్కరించారు. అనంతరం ప్లాస్మాదాతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. (ప్లాస్మా దాతలకు రూ.5 వేలు)

ప్లాస్మా దానంతో ప్రాణదానం 
ప్లాస్మా దానం చేసి కోవిడ్‌ బాధితులను రక్షించాల్సిన అవసరం ఉందని సినీహీరో విజయ్‌ దేవరకొండ అన్నారు. కోవిడ్‌కు వ్యాక్సిన్‌ వచ్చే వరకు ప్లాస్మా ఒక్కటే పరిష్కారమన్నారు. ప్రస్తుత తరుణంలో ప్లాస్మా దానం  ప్రాముఖ్యతపై ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు. కోవిడ్‌ నుంచి కోలుకున్న వారందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్లాస్మాదానం చేయాలని కోరారు. కరోనా కేసుల కంటే ప్లాస్మా దానాల సంఖ్య ఎక్కువగా ఉండా లన్నారు. రక్త, ప్లాస్మాదానంపై సైబరాబాద్‌ పోలీసులు చేస్తున్న కృíషి ఎనలేనిదన్నారు.     –సినీహీరో విజయ్‌దేవరకొండ 

కార్యక్రమంలో పాల్గొన్న విజయ్‌ దేవరకొండ, సీపీ సజ్జనార్‌    
రక్తదానం ప్రేరణతోనే ప్లాస్మా డొనేషన్‌ డ్రైవ్‌  
 సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ మాట్లాడుతూ రక్తదానం కోసం నిర్వహించిన స్పెషల్‌ డ్రైవ్‌ ప్రేరణతోనే ప్లాస్మా డొనేషన్‌ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టామన్నారు. ప్లాస్మాదానం సామాజిక బాధ్యతగా కావాలని, ప్లాస్మా దాతలు ప్రాణదాతలుగా నిలుస్తున్నారన్నారు. వారం రోజుల్లో సైబరాబాద్‌ పోలీసులు 1000 మంది డేటాబేస్‌ సేకరించారని, దాతలు, గ్రహీతల రక్తంతో సరిపోలడం అంత సులభం కాదన్నారు. ప్లాస్మా మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మోసం చేసేవారి వివరాలు తెలిస్తే వెంటనే 9490617444కు ఫోన్‌ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ట్రాఫిక్‌ ఏడీసీపీ ప్రవీణ్‌కుమార్, ఎస్‌సిఎస్‌సి ప్రధాన కార్యదర్శి కృష్ణ ఏదుల ప్రసంగించారు. అనంతరం విజయ్‌దేవరకొండ, సజ్జనార్‌ చేతుల మీదుగా ప్లాస్మాదానం పై రూపొందించిన వాల్‌పేపర్స్, ఆన్‌లైన్‌ పోర్టల్‌ లింక్, ఫోన్‌ నంబర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏడీసీపీ మానిక్‌రాజ్, ఏడీసీపీ మాదాపూర్‌ వెంకటే«శ్వర్లు, ఏడీసీపీ క్రైమ్‌ ఇందిరాన, ట్రాఫిక్‌ ఫోరమ్‌ ప్రతినిధి వెంకట్‌టంకశాల తదితరులు పాల్గొన్నారు. –సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌   

మరిన్ని వార్తలు