సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ బదిలీ, ఆర్టీసీ ఎండీగా నియామకం

26 Aug, 2021 01:59 IST|Sakshi

ఆర్టీసీ ఎండీగా సజ్జనార్‌

అదనపు డీజీగా పదోన్నతిపై బదిలీ

ఆయన స్థానంలో సైబరాబాద్‌ సీపీగా స్టీఫెన్‌ రవీంద్ర

అదనపు డీజీ స్థాయి అధికారి అంజనీకుమార్‌కు డీజీ స్థాయి పదోన్నతి..

మరో ముగ్గురు అధికారులకు కూడా...

త్వరలో మరిన్ని ట్రాన్స్‌ఫర్లు ఉంటాయన్న ప్రభుత్వ వర్గాలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో దాదాపు మూడేళ్లుగా బదిలీలు లేక.. పదోన్నతులు పొందినా అవే స్థానాల్లో కొనసాగుతున్న చాలా మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసి కొత్త బాధ్యతలు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సైబరాబాద్‌ కమిషనర్‌గా మూడేళ్లకుపైగా బాధ్యతలు నిర్వహిస్తున్న వీసీ సజ్జనార్‌కు అదనపు డీజీగా పదోన్నతి కల్పించి ఆయన్ను టీఎస్‌ఆర్టీసీ వైస్‌చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమించింది. అలాగే పశ్చిమ జోన్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న స్టీఫెన్‌ రవీంద్రను సైబరాబాద్‌ నూతన కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

అదనపు డీజీ స్థాయిల్లో ఉన్న అధికారులను బదిలీ చేయడంతోపాటు వారి స్థానాల్లో ఐజీపీలను నియమించారు. హైదరాబాద్‌ అదనపు కమిషనర్‌ (ట్రాఫిక్‌)గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్‌ అనిల్‌కుమార్‌ను మంగళవారం రాష్ట్ర నిఘా విభాగం అధిపతి (ఇంటెలిజెన్స్‌)గా అదనపు డీజీ హోదాలో నియమించిన నేపథ్యంలో ఆయన స్థానంలో తాత్కాలికంగా ఇన్‌చార్జి హోదాలో డీఎస్‌ చౌహాన్‌ను ప్రభుత్వం నియమించింది. ఎస్పీల నుంచి డీఐజీలుగా పదోన్నతి పొందినవారు, డీఐజీ నుంచి ఐజీలుగా పదోన్నతి పొందిన మరికొందరు సీనియర్‌ ఐపీఎస్‌లకు కూడా త్వరలోనే కొత్త పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఆర్టీసీ పగ్గాలు సజ్జనార్‌కు సవాలే...
సైబరాబాద్‌ సీపీగా పనిచేసిన కాలంలో వీసీ సజ్జనార్‌ పలు సంచనాలకు కేరాఫ్‌గా నిలిచారు. ముఖ్యంగా ‘దిశ’పై గ్యాంగ్‌రేప్, హత్యకు పాల్పడిన నిందితులను సజ్జనార్‌ సారథ్యంలోని పోలీసు బృందం ఎన్‌కౌంటర్‌ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సైబరాబాద్‌ పరిధిలో లా అండ్‌ ఆర్డర్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తూనే కమిషనరేట్‌లో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. కరోనా లాక్‌డౌన్‌ తొలినాళ్లలో హైదరాబాద్‌లోని ఇతర రాష్ట్రాల కార్మికులను సొంత ఊళ్లకు తరలించడంలో కీలకపాత్ర పోషించారు. ఆయన కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న ఆర్టీసీ ఇప్పటికే పీకలల్లోతు అప్పుల్లో కూరుకుపోవడంతోపాటు దాని అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారిన సమయంలో ఆయన వీసీ అండ్‌ ఎండీగా ఎలా బయటపడేస్తారన్న అంశం కీలకం కానుంది.

వచ్చే నెలలో...
అవినీతి నిరోధక విభాగం, విజిలెన్స్‌ డీజీగా ఉన్న పూర్ణచంద్రరావు, జైళ్ల విభాగం డీజీ రాజీవ్‌ త్రివేదీ సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేయనున్నారు. ఈ రెండు పోస్టులకు డీజీ లేదా అదనపు డీజీ అధికారులను నియమించాల్సి ఉంది. అలాగే రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌కు స్థాన చలనం జరిగితే ఆ స్థానంలో నార్త్‌జోన్‌ ఐజీ నాగిరెడ్డిని నియమిస్తారన్న ప్రచారం జరుగుతోంది. 

ఆ నాలుగు జిల్లాలకు..
ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, ములుగు జిల్లాలకు ప్రస్తుతం ఎస్పీలు లేరు. ఆ నాలుగు జిల్లాలు ఇప్పుడు ఇన్‌ఛార్జిల పాలనలో ఉన్నాయి. ఈ జిల్లాలకు త్వరలోనే ఎస్పీలను నియమించే అవకాశం ఉంది. ఇటీవల 32 మందికి నాన్‌ కేడర్‌ ఎస్పీలుగా పదోన్నతులు దక్కాయి. వారిలో చాలా మందికి జిల్లాల బాధ్యతలు అప్పగించనున్నారు. నిజామాబాద్‌ సీపీగా కార్తీకేయకు ఆ స్థానంలో ఐదేళ్లు పూర్తయింది. ఆయన కూడా బదిలీ జాబితాలో ఉన్నారు. అలాగే నల్లగొండ ఎస్పీ, డీఐజీ రంగనాథ్‌.. కూడా బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

సీఎంను కలిసిన ఇంటెలిజన్స్‌ చీఫ్‌..
రాష్ట్ర నిఘా విభాగం అధిపతిగా నియమితులైన డాక్టర్‌ అనిల్‌కుమార్‌ బుధవారం ఉదయం మర్యాదపూర్వకంగా సీఎం కేసీఆర్‌ను కలసి పుష్పగుచ్ఛం అందచేశారు. అంజనీకుమార్‌కు పదోన్నతి...హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌గా వ్యవహరిస్తున్న అదనపు డీజీ స్థాయి అధికారి అంజనీకుమార్‌కు డీజీ స్థాయి పదోన్నతి లభించింది. 1989–90 బ్యాచ్‌లకు చెందిన మొత్తం నలుగురు అదనపు డీజీలకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1989 బ్యాచ్‌కు చెందిన ఉమేష్‌ షరాఫ్‌ (సంక్షేమ విభాగం ఏడీజీ)తోపాటు 1990 బ్యాచ్‌ అధికారులు గోవింగ్‌ సింగ్‌ (సీఐడీ చీఫ్‌), అంజనీకుమార్, రవిగుప్తా (హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ) ప్రమోషన్లు ఇచ్చింది. వారిలో ఉమేష్‌ షరాఫ్‌ను ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ విభాగానికి బదిలీ చేయగా మిగిలిన ముగ్గురిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.  

చదవండి: హైదరాబాద్‌ మెట్రో రైలుకు గుడ్‌న్యూస్‌!

మరిన్ని వార్తలు