ట్రాన్స్ జెండర్ డెస్క్‌.. మార్పుకు నాంది: సీపీ సజ్జనార్‌

6 Mar, 2021 18:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ డెస్క్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది ఒక చారిత్రాత్మకమైన రోజు అని, ప్రపంచంలోనే మొదటిసారి ట్రాన్స్ జెండర్ డెస్క్‌ను తీసుకువచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమం దేశంలోనే కమ్యూనిటీ పట్ల మార్పునకు నాంది కాబోతోందని తెలిపారు. ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నా ట్రాన్స్‌ జెండర్లకు ఏమీ అందటంలేదని పేర్కొన్నారు. ఈ డెస్క్ ద్వారా అన్ని సదుపాయాలు అందుతాయని, ఇప్పటికే సైబరాబాద్ పరిధిలో ఈ కమ్యూనిటీల్లో ఎన్నో మార్పులు తీసుకువచ్చామని తెలిపారు. రక్షణ, ఉద్యోగాలు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. 

జాబ్ మేళాల్లో పెద్దఎత్తున పాల్గొంటే ట్రాన్స్‌జెండర్లకు సాయం అందిస్తామని తెలిపారు. వారికి డబుల్ బెడ్రూమ్ కూడా వచ్చేలా కృషి చేస్తామన్నారు. వారికి సాయం చేయటంలో ముందుంటామని కానీ, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టం తన పని తాను చేయాల్సి వస్తుందన్నారు. ట్రాన్స్‌జెండర్లు మారితేనే వారి కమ్యూనిటీ మారుతుందని తెలిపారు. తెలంగాణలోని ట్రాన్స్‌ జెండర్లపై ఒక డాక్యుమెంటరీ తీసి ప్రపంచానికి తెలియజేయాలన్నారు. వందల ఏళ్ల వివక్ష పోవటానికి కొంత సమయం పడుతుందని, దేశంలో ఎవరు కష్టాల్లో ఉ‍న్నా ప్రజ్వల సంస్థ  వ్యవస్థాపకురాలు సునీతా కృష్ణన్ ముందుగా స్పందిస్తారని తెలిపారు.

చదవండి:  ఉప్పల్‌లో లారీ బీభత్సం

మరిన్ని వార్తలు