భారీ వర్షం: శభాష్‌ పోలీస్‌.. 

17 Oct, 2020 11:02 IST|Sakshi
సహాయ కార్యక్రమాల్లో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌

సాక్షి, హైదరాబాద్‌: ఆపద వచ్చిందంటే చాలు మేమున్నామంటూ ముందుండే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు ఈసారి కూడా ప్రజలకు బాసటగా నిలిచారు. భారీ వర్షం వల్ల అతలాకుతలమైన ప్రాంతాల్లో ప్రాణాలను లెక్కచేయకుండా సేవలందించారు. లోతట్టు ప్రాంతాల్లోని నీటిని మోటార్ల ద్వారా బయటకు పంపించారు. రహదారులకు అడ్డుగా పడి ఉన్న చెట్లను తొలగించారు. ప్రమాదానికి అవకాశమున్న మ్యాన్‌హోల్స్‌ను ఓపెన్‌ చేసి నీటిని క్లియర్‌ చేసే ప్రయత్నం చేశారు. నేషనల్‌ డిజాస్టర్‌ టీమ్‌(ఎన్‌డీఆర్‌ఎఫ్‌), డిజాస్టర్‌ రెస్క్యూ ఫోర్స్‌(డీఆర్‌ఎఫ్‌), ఆర్మీ, అక్టోపస్‌ బలగాలతో కలిసి వరదల్లో చిక్కుకున్న పిల్లలు, పెద్దలు, వృద్ధులను రక్షించారు. ఆకలితో ఇబ్బందిపడుతున్న వారికి ఆహర పొట్లాలు అందించారు. దాదాపు నాలుగు రోజుల నుంచి కంటిమీద కునుకు లేకుండా పోలీసు కమిషనర్ల నుంచి హోంగార్డుల వరకు అలుపెరగని సేవలందించారు. వరదల వల్ల ట్రాఫిక్‌ ఏర్పడిన ప్రాంతంలో క్లియర్‌ చేసి ముందుకు వెళ్లేలా చూశారు. ప్రస్తుతం వర్షం తగ్గినా లోతట్టు ప్రాంత ప్రజలను ఇబ్బందుల నుంచి బయటపడేయడంపై దృష్టి సారించి పనిచేస్తున్నారు.

నిత్యావసరాలు తీసుకువస్తున్న రాచకొండ పోలీసులు

  • చైతన్యపురిలోని రీబాక్‌ షోరూమ్‌  సమీపంలో ఇళ్లల్లోకి వరదనీరు వచ్చి చేరడంతో ఆయా నివాసాల్లో ఉన్న పది మందిని సంరక్షించారు. 
  • మల్కాజ్‌గిరి ఠాణా పరిధిలోని షిర్డీనగర్, పటేల్‌ నగర్, వసంతపురి కాలనీలో వరదల్లో చిక్కుకున్న 30 మంది కుటుంబాలను ఇన్‌స్పెక్టర్‌ బి.జగదీశ్వర్‌రావు నేతృత్వంలోని సిబ్బంది కాపాడారు.  
  • ఉప్పల్‌ ఠాణా పరిధిలోని కావేరినగర్‌లో వరదలో చిక్కుకున్న ఆర్‌టీసీ బస్సు నుంచి 33 మంది ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చారు.  
  • జలమయమైన పెద్దఅంబర్‌పేట రహదారిలో చిక్కుకున్న లారీ నుంచి డ్రైవర్‌ రాంరెడ్డిని హయత్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేంద్ర నేతృత్వంలోని బృందం ప్రాణాలనుకా పాడింది. 
  • లోతట్టు ప్రాంతమైన సరూర్‌నగర్‌ వివేకానంద కాలనీలో పాలు, నీరు, టిఫిన్, పండ్లను ట్రాఫిక్‌ పోలీసు రిజర్వ్‌డ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాచమల్లు నేతృత్వంలోని బృందం సరఫరా చేసింది.  
  • రాబిన్‌ హుడ్‌తో కలిసి సైబరాబాద్‌ పోలీసులు వరద లోతట్టు ప్రాంతాల్లో ఆçహార ప్యాకెట్లు పంపిణీ చేశారు.  
  • అబ్దుల్లాపూర్‌మెట్‌ ఠాణా పరిధిలోని శక్తి బ్రిడ్జి వద్ద చిక్కుకున్న మృతదేహన్ని జేసీబీద్వారా బయటకు తీసుకొచ్చేలా చూసిన కానిస్టేబుల్‌ సురేందర్‌ను రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ సన్మానించారు.  
  • గగన్‌పహాడ్‌లో కోతకు గురైన రహదారిని, మైలార్‌దేవ్‌పల్లిలోని పల్లెచెరువు,  ప్రాంతాల్లో సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ శుక్రవారం పర్యటించారు.  
  • ఘట్‌కేసర్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లే దారిలో నిండుకుండలా మారిన కుంటను   సీపీ మహేష్‌భగవత్‌ పరిశీలించి సహాయ చర్యలు చేపట్టారు. 

గచ్చిబౌలిలో ఆగని భూ ప్రకంపనలు
సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ టీఎన్జీఒ కాలనీలో భూ ప్రకంపనల భయం ఇంకా కొనసాగుతూనే ఉంది. శుక్రవారం ఉదయం, మధ్యాహ్నం కూడా భూమిలోంచి శబ్దాలు వచ్చాయి. గడిచిన మూడు రోజుల నుండి భూమిలోంచి శబ్దాలు వస్తుండటంతో స్థానికుల భయాందోళనలకు గురవుతున్నారు. ప్రకంపనల తీవ్రతను తెలుసుకునేందుకు ఎన్జీఆర్‌ఐ ప్రతినిధులు శుక్రవారం కాలనీలో రెండు భూకంప లేఖినిలను అమర్చారు. ఎన్జీఆర్‌ఐ సీనియర్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ శ్రీనగేష్‌ సాక్షితో మాట్లాడుతూ భూమిలో వస్తున్న శబ్దాల వల్ల భయపడాల్సిన అవసరం లేదని రిక్టర్‌ స్కేల్‌పై 0.5గా నమోదవుతున్నాయన్నారు. భూకంప లేఖినిలతో పరిస్థితిని మరిన్ని రోజులు పరిశీలిస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు