‘కరోనా జయించిన వారు ప్లాస్మా దానం చేయండి’

31 Jul, 2020 18:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనాను జయించి ప్లాస్మా దానం చేయడానికి వస్తున్న వారందరికి సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి అనేక మందితో ప్లాస్మా దానం చేయించామన్నారు. ఇలాంటి వారిని స్పూర్తిగా తీసుకుని మరికొంత మంది ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. పది రోజుల్లో తాము 160 మందికి ప్లాస్మాదానం చేశామని చెప్పారు. మాదాపూర్, బాలానగర్ ప్రాంతాల్లో అంబులెన్స్ సేవలు ఏర్పాటు చేశామని వాటిని ప్రజలంతా వినియోగించుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కరోనా రోగులకు కూడా ప్లాస్మా దానం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. (చదవండి: కరోనా: కోలుకున్న వారు ప్లాస్మా దానం ఇవ్వండి!)

ప్లాస్మా దానం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు వచ్చిన సినీ హీరో విజయ్ దేరకొండకు సీపీ కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల తన స్నేహితుడి తండ్రికి కరోనా రావడంతో ప్లాస్మా అవసరం వచ్చిందని.. అప్పుడే ప్లాస్మా అవసరం తెలుసుకున్నానని విజయ్ చెప్పారు. కరోనా వచ్చిన వాళ్ళు ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేయాలని కోరారు. ప్లాస్మా దానం చేయడం ద్వారా చాలా మంది కుటుంబాలకు అండగా ఉన్నవాళ్లమవుతామపని పేర్కొన్నారు. ఒకవేళ తనకు కరోనా వస్తే కరోనాను జయించి ప్లాస్మా దానం చేయడానికి తాను సిద్దంగా ఉన్నానని సీపీ వ్యాఖ్యానించారు. (చదవండి: ప్లాస్మా దానం చేసిన ఎమ్మెల్యే సుధాకర్‌)

>
మరిన్ని వార్తలు