తాగి నడిపితే తాట తీస్తాం: సజ్జనార్‌

14 Nov, 2020 08:57 IST|Sakshi

సాక్షి, రాయదుర్గం: మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమవుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైన వారికి ఐపీసీ సెక్షన్‌ 304 పార్ట్‌–2 ప్రకారం పదేళ్ల జైలు శిక్ష పడేలా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సైబరాబాద్‌ పరిధిలో ప్రతి ప్రమాదాన్ని రోడ్‌ ట్రాఫిక్‌ యాక్సిడెంట్‌ మానిటరింగ్‌ (ఆర్‌టీఏఎం) సెల్‌ పర్యవేక్షిస్తుందన్నారు. రోడ్డు ప్రమాదాల సమయంలో వాహనం నడిపేవారికి బీఏసీ పరీక్షలు నిర్వహిస్తామని, ప్రమాదం చేసి పారిపోయేందుకు యత్నించే వారి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రమాదాల సమయంలో ఆల్కాహాల్‌ టెస్ట్‌లకు నిరాకరించే, సహకరించని వారిపై కూడా ఎంవీయాక్ట్‌ 205 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలకు డ్రంకన్‌డ్రైవ్‌ కారణమని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పబ్‌ల యాజమానులు కూడా తమ పబ్‌లో మద్యం సేవించి వాహనాలు నడుపుకుంటూ వెళ్లే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని లేని పక్షంలో వారిపై కూడా తీసుకుంటామన్నారు. 

2,061 వాహనాల వేలం  
రాయదుర్గం: సైబరాబాద్‌ పోలీసులు  వివిధ రకాల 2061 వాహనాలను వేలం వేయాలని నిర్ణయించారు. మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ ప్రాంగణంలో ఉన్న ఈ వాహనాల చట్టం ప్రకారం బహిరంగ వేలం వేస్తారు. ఈ వాహనాలపై అభ్యంతరాలు ఉంటే దరఖాస్తు చేసు కోవచ్చు. నోటిఫికేషన్‌ తేదీ నుంచి ఆరునెలల లోపు వాహనాలను క్లెయిమ్‌ చేయాలి. వివరాల కోసం సీఏఆర్‌ రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ జి వెంకటస్వామి, లేదా సైబరాబాద్‌ òసెల్‌ నంబర్‌ 94910 39164ను సంప్రదించాలని సూచించారు. 

మరిన్ని వార్తలు