న్యాయవాదుల హత్య: ‘ఆ ఆరోపణల్లో నిజం లేదు’

21 Feb, 2021 03:37 IST|Sakshi

న్యాయవాద దంపతుల హత్యను సీరియస్‌గా తీసుకున్నాం 

నిందితులు ఎంతటివారైనా అరెస్ట్‌ చేస్తాం 

మంథనికి సంబంధంలేని వారితో శాస్త్రీయ విధానంలో దర్యాప్తు  

వామన్‌రావు మాట్లాడిన వీడియోను ల్యాబ్‌కు పంపించాం 

బ్యారేజీలో పడేసిన ఆయుధాలను వెలికితీస్తాం 

‘సాక్షి’ఇంటర్వ్యూలో రామగుండం సీపీ సత్యనారాయణ

సాక్షి, కరీంనగర్‌: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా ఉపేక్షించేది లేదని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణ స్పష్టం చేశారు. న్యాయవాదులు గట్టు వామన్‌రావు, నాగమణిలను పట్టపగలు నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా హత్య చేయడాన్ని చాలెంజింగ్‌గా తీసుకున్నామని.. హత్య జరిగిన 24 గంటల్లోపే ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని పేర్కొన్నారు. మంథనికి సంబంధం లేని పోలీస్‌ అధికారులతో దర్యాప్తు సాగుతోందని వెల్లడించారు. న్యాయవాద దంపతుల హత్య అనంతరం చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో రామగుండం సీపీని ‘సాక్షి’ఇంటర్వ్యూ చేసింది. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..  

24 గంటల్లోపే అరెస్టు చేశాం.. 
గట్టు వామన్‌రావు, నాగమణిలను దారుణంగా పట్టపగలు, నడిరోడ్డు మీద హత్య చేయడాన్ని తీవ్రంగా పరిగణించి ఉన్నతస్థాయి అధికారులు రంగంలోకి దిగారు. దంపతులపై దాడిచేసినవారిని 24 గంటలలోపే అరెస్టు చేశాం. వారికి రెక్కీగా ఉపయోగపడ్డ కుమార్‌ను అరెస్టు చేశాం. ఈ క్రమంలోనే శాస్త్రీయపరమైన దర్యాప్తులో బిట్టు శ్రీను పాత్ర బయటకొచ్చింది. అతడు కారు, కత్తులు సమకూర్చినట్టు తేలింది. మాతోపాటు హైదరాబాద్‌ నుంచి వచ్చిన శాస్త్రీయ, సాంకేతిక బృందాలు దర్యాప్తులో పాలు పంచుకుంటున్నాయి. విచారణలో నిందితులుగా తేలితే వారు ఎంతటివారైనా సరే కచ్చితంగా అరెస్టు చేస్తాం. 

శాస్త్రీయ విధానంలో దర్యాప్తు.. 
బిట్టు శ్రీను అనే వ్యక్తి మంథనికి చెందిన ఓ ప్రజాప్రతినిధి మేనల్లుడు. చిరంజీవి, కుంట శ్రీనుతో హత్యకు ముందు, తర్వాత చాలాసార్లు మాట్లాడాడు. వారికి కారు, కత్తులు ఇచ్చాడు. మరోవైపు ప్రధాన నిందితుడు కుంట శ్రీనుకు ఊరిలో ఉన్న ఇల్లు, పెద్దమ్మ గుడి, రామస్వామి గోపాలస్వామి గుడి వివాదాలతోపాటు వామన్‌రావు కుటుంబంతో విభేదాలు ఉండటంతో హత్యలో నేరుగా పాల్గొన్నాడు. బిట్టు శ్రీను కీలక పాత్ర వహించాడన్న ఆధారాలు దొరికిన తర్వాత శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తు చేస్తున్నాం. కేసును ఇతర ప్రాంతాల వారే దర్యాప్తు చేస్తున్నారు.  

ఆ ఫోన్‌ సీజ్‌ చేశాం.. 
వామన్‌రావు తొలుత పుట్ట మధు పేరు ప్రస్తావించినట్లు వైరల్‌ అయింది నిజమే. ఒరిజనల్‌గా వామన్‌రావును వీడియో తీసిన వ్యక్తి ఫోన్‌ను సీజ్‌ చేశాం. ఎలాంటి మార్ఫింగ్‌లు, కటింగ్‌లు లేని ఒరిజనల్‌ వీడియోను ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబరేటరీ(ఎఫ్‌ఎస్‌ఎల్‌)కి పంపిస్తున్నాం. అందులో పుట్ట మధు అనే పదం లేదు. ఐదు సెకన్లు ముందు వచ్చిందది. పెదాల కదలిక, సౌండ్స్‌ చూస్తే కరెక్ట్‌ అనిపించలేదు. అయినా నిజానిజాల కోసం ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించాం. అవి కాకుండా చాలా వీడియోలు, ఆడియోలను 2018 కంటే ముందువి, ఇటీవల కాలంలోనివి వేరే వాళ్ల వాయిస్‌ కూడా కుంట శ్రీను వాయిస్‌గా పెడుతున్నారు. దర్యాప్తును ఇవి ప్రభావితం చేస్తాయి. ఘటనను ప్రత్యక్షంగా చూసిన చాలామంది సాక్షులను విచారించాం. వీడియోలను సేకరించాం. దర్యాప్తుకు ఉపయోగపడే వీడియోలు ఉంటే ఇవ్వాలని కోరాం. ఈ సమయంలో ఫేక్‌ వీడియోలు, ఆడియోలు వైరల్‌ చేయడం కరెక్ట్‌ కాదు. 

భద్రత అడిగితే ఇచ్చేవాళ్లమే.. 
వామన్‌రావు, నాగమణిలకు సంబంధించి కొన్ని కేసుల్లో వ్యాజ్యాలు వేయగా.. ఆ కేసుల విచారణ పూర్తయ్యే వరకు దంపతులిద్దరినీ తెలంగాణలోని ఏ పోలీస్‌స్టేషన్‌కు పిలవొద్దని హైకోర్టు ఆదేశాలిచ్చింది. వాటిని పాటించాం. లోక్‌ అదాలత్‌కు సంబంధించి ఒకటి రెండుసార్లు కానిస్టేబుల్‌ ఫోన్‌ చేస్తేనే ‘కంటెప్ట్‌ ఆఫ్‌ కోర్టు’అని వామన్‌రావు చెప్పారు. ఐదారు నెలలుగా వారితో ఎవరూ టచ్‌లో లేరు. వాళ్లకు ముప్పు ఉంటే లిఖితపూర్వకంగా పిటిషన్‌ ఇస్తే చర్యలు తీసుకొనేవాళ్లం. వాళ్లు ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు పోతున్నారో కూడా మాకు తెలియదు. గుంజపడుగులో గొడవలు జరగకుండా పెట్రోలింగ్‌ చేశాం. కానీ ఇంత దారుణంగా హత్య చేస్తారని భావించలేదు. 

బ్యారేజీలో లోతు ఎక్కువ ఉండటంతో.. 
హత్య జరిగిన తరువాత ఆయుధాలను సుందిళ్ల బ్యారేజీలో వేసినట్లు తేలింది. వాటిని తీయాలని భావించినా, అక్కడ లోతు ఎక్కువగా ఉండడంతో గజ ఈతగాళ్లను పిలిపించాలని నిర్ణయించాం. ఆయుధాలను తీసే విషయంలో శ్రద్ధ చూపించలేదనే ఆరోపణల్లో నిజం లేదు. త్వరలోనే వాటిని వెలికి తీస్తాం. ఇక ఈ కేసును త్వరలోనే పరిష్కరిస్తాం. బిట్టు శ్రీనును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం. మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. తరువాత ఈ కేసులో ప్రమేయం ఉన్నవారందరినీ అరెస్టు చేస్తాం. 

చదవండి:
దంపతుల హత్య: ఆ సమాచారం ఇచ్చింది లచ్చయ్య
నేను వజ్రాన్ని... మోసగాణ్ని కాదు: పుట్ట మధు

మరిన్ని వార్తలు