ప్రజాపంథా రాష్ట్రకార్యదర్శి డీవీ కృష్ణ కన్నుమూత 

27 Jun, 2022 01:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌/ముషీరాబాద్‌: సీపీఐ (ఎంఎల్‌) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి దుర్గంపూడి వెంకట కృష్ణారెడ్డి(డీవీ కృష్ణ) ఆదివారం ఉదయం ఇక్కడ అనారోగ్యంతో మరణించారు. డీవీ కృష్ణ(77) కొంతకాలంగా కేన్సర్‌ తో పోరాడుతున్నారు. డీవీ కృష్ణ 1945 ఆగస్టు 20న గుంటూరు జిల్లా మాచర్ల దగ్గర గల తేలుకుంట్లలో జన్మించారు. తల్లిదండ్రులు నాగేంద్రమ్మ, వెంకటప్పారెడ్డి. డీవీ కృష్ణకు మూడేళ్ల వయస్సు ఉన్నప్పుడే ఆయన కుటుంబం వ్యవసాయం నిమిత్తం నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ సమీపంలోని పెంటకుర్దు గ్రామానికి వలస వచ్చింది.

శ్రీకాకుళం, నగ్జల్బరీ పోరాటాల ప్ర«భావంతో  1970లో విప్లవ కమ్యూనిస్టు పార్టీలో చేరారు. 1973లో సీపీఐ (ఎంఎల్‌) నేత చండ్ర పుల్లారెడ్డితో కలసి నిజామాబాద్, కరీంనగర్‌ జిల్లాలో విప్లవోద్యమ నిర్మాణానికి కృషి చేశారు. కృష్ణ భార్య కొంతకాలం క్రితమే మరణించారు. ఆయన కూతురు దీప అమెరికాలోని ఓ బ్యాం కులో ఉద్యోగం చేస్తున్నారు. విద్యానగర్‌లోని మార్క్స్‌ భవన్‌లో ఉంచిన డీవీకృష్ణ భౌతికకాయాన్ని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వీరభద్రం, ప్రజాపంథా రాష్ట్ర సహాయ కార్య దర్శి పి.రంగారావు, న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌. వెంకటేశ్వర్‌రావు సందర్శించి నివాళులర్పించారు.  

మరిన్ని వార్తలు